Share News

యాత్రీ సిస్టర్స్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:46 AM

లోకల్‌ ట్రెయిన్‌... ముంబయి నగర జీవన రేఖ. రోజూ దాదాపు 80 లక్షలమంది రాకపోకలు సాగించే నెట్‌వర్క్‌. కానీ రైళ్ల రాకపోకలు తెలుసుకొనే సరైన వ్యవస్థ లేక ప్రయాణికులు...

యాత్రీ సిస్టర్స్‌

లోకల్‌ ట్రెయిన్‌... ముంబయి నగర జీవన రేఖ. రోజూ దాదాపు 80 లక్షలమంది రాకపోకలు సాగించే నెట్‌వర్క్‌. కానీ రైళ్ల రాకపోకలు తెలుసుకొనే సరైన వ్యవస్థ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు తిరుగులేని పరిష్కారం చూపించారు లఖీ సకారియా, రీవా సకారియా. ఈ అక్కాచెల్లెళ్ళు రూపొందించిన ‘యాత్రీ’ యాప్‌... కచ్చితమైన సమాచారంతో ప్రయాణికులకు మార్గదర్శిగా నిలుస్తోంది.

‘‘అది 2021. కొవిడ్‌ పీడకల నుంచి ముంబయి నగరం మెల్లగా కోలుకుంటోంది. కార్యాలయాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. మరి ఉద్యోగులు సురక్షితంగా ఆఫీసుకి చేరుకోగలరా? ఎన్నో సంస్థల యజమానులను పీడిస్తున్న ఈ సందేహాన్నే మేమూ ఎదుర్కొన్నాం. మా సిబ్బందిలో ఎక్కువమంది లోకల్‌ రైళ్ళలోనే ప్రయాణిస్తారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆ నెట్‌వర్క్‌ పూర్తిగా స్తంభించిపోయింది. ఆంక్షలు తొలగిన తరువాత కూడా అధికారులలో, జనంలో నెలకొన్న భయం కారణంగా... రాకపోకలు పూర్తి స్థాయిలో సాగడం లేదు. ఈ సంగతి మా ఉద్యోగులతో మాట్లాడినప్పుడు.. ‘‘అధికారులకు కూడా సరైన సమాచారం లేదంటున్నారు. దీంతో ఊహాగానాల మీద ఆధారపడాల్సి వస్తోంది’’ అని చెప్పారు. వారి మాటలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి.

రైల్వేస్‌ భాగస్వామ్యంతో...

మా సిబ్బందికే కాదు... నగరంలో రోజూ దాదాపు 80 లక్షల మంది రాకపోకలకు లోకల్‌ రైళ్ళే ప్రధాన ఆధారం. ముంబయి లోకల్‌ ట్రైన్లది 173 ఏళ్ళ చరిత్ర. 450 కిలోమీటర్ల విస్తీర్ణం... 150 స్టేషన్లు... సుమారు 2,400 ట్రిప్పులు. ఇంత విస్తృతమైన నెట్‌వర్క్‌లో ట్రాక్‌లకు మరమ్మతులు తలెత్తడం లాంటి వివిధ కారణాలవల్ల రాకపోకల్లో జాప్యాలు, రైళ్ళు రద్దు కావడం జరుగుతూనే ఉంటాయి. వాటిని నివారించలేం. కానీ ఆ సమాచారం ప్రయాణికులకు తెలియడం అత్యవసరం. అందుకే... ప్రత్యేకించి ముంబయి లోకల్‌ ట్రైన్ల కోసం మేమే ఒక యాప్‌ రూపొందించాలనుకున్నాం. ఈ సందర్భంగా మా నేపథ్యం గురించి చెప్పాలి. మా కుటుంబం దాదాపు 34 ఏళ్ళుగా ముంబయిలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తోంది. మా చదువులు పూర్తయిన తరువాత ఇద్దరం దాని నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నాం. రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కూడా మేం చేపట్టాం. లోకల్‌ ట్రైన్లకు సంబంధించిన యాప్‌ గురించి రైల్వే అధికారులను సంప్రతించినప్పుడు... ‘‘అలాంటి యాప్‌ అవసరం ఉంది. అభివృద్ధి చెయ్యండి’’ అని ప్రోత్సహించారు. అలా 2022 జూలైలో ఇండియన్‌ రైల్వేస్‌ భాగస్వామ్యంతో... సెంట్రల్‌ రైల్వేస్‌ నేతృత్వంలో ‘యాత్రీ’ యాప్‌ తెచ్చాం.


నెల రోజులు...

అయితే దాని వెనకాల చాలా కసరత్తు జరిగింది. రైల్వే అవసరాలకు అనువైన జీపీఎస్‌ పరికరాలను ప్రత్యేకంగా తయారు చేయించాం. వాటిని ప్రతి కంపార్టుమెంట్‌లో అమర్చాం. సిగ్నల్స్‌కు అవరోధాలను తగ్గించడానికి, ట్యాంపరింగ్‌ను నివారించడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాం. వివిధ మార్గాల్లో సిగ్నల్‌ కనెక్టివిటీని పరిశీలించాం. దాదాపు నెలరోజుల పాటు మేము రైళ్ళలో ప్రయాణాలు చేశాం. రియల్‌ టైమ్‌ కచ్చితత్వాన్ని అంచనా వేశాం. అన్నిటికన్నా పెద్ద సవాల్‌... ప్రజల విశ్వాసాన్ని పొందడం. దాన్ని పొందాలంటే... ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మాకు తెలుసు. మా ఆలోచనలకు అనుగుణంగా యాప్‌ రూపొందించి విడుదల చేసినప్పుడు... ప్రయాణికుల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. ప్రయాణికులకు దగ్గర్లో ఎక్కడ స్టేషన్‌ ఉంది, మీరు ఏ మార్గంలోకి వెళితే మీ గమ్యానికి చేరుకోగలరు, లైవ్‌ ట్రైన్‌ లొకేషన్‌, ఛార్జీలు ఎంత, ప్రస్తుతం రైలు మీ స్టేషన్‌కు ఎంత దూరంలో ఉంది?... ఇలా అన్ని వివరాలు అందుబాటులో ఉంచాం.

అన్ని సేవలు ఒకే చోట...

ఇప్పుడు దాదాపు సగం మందికి పైగా ప్రయాణికులు ఈ యాప్‌ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ముంబయికి చెందిన సెంట్రల్‌, వెస్ట్రన్‌ నెట్‌వర్క్స్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, పుణే, కాన్పూర్‌, కొచ్చి నగరాల్లో లోకల్‌, మెట్రో, మోనో, బస్‌ తదితర ప్రయాణ సాధనాల సమాచారాన్ని మా యాప్‌ ద్వారా అందిస్తున్నాం. మీరు వెళ్ళాల్సిన మార్గంలో ఏయే రవాణా మార్గాలున్నాయి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది... ఇలా అన్నీ తెలుసుకోవచ్చు. టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు త్వరలోనే దేశంలో 25కు పైగా నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. మీరు ఏ నగరంలో నివసిస్తున్నా, లేదా సందర్శించడానికి వెళ్ళినా... ప్రణాళిక, ప్రయాణం, చెల్లింపు... ఇలా అన్నీ ఒకే చోట అందించాలనేది మా ఆశయం.’’

ప్రస్తుతం ముంబయి సెంట్రల్‌, వెస్ట్రన్‌ నెట్‌వర్క్స్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, పుణే, కాన్పూర్‌, కొచ్చిల్లో లోకల్‌, మెట్రో, మోనో, బస్‌ ప్రయాణ సాధనాల సమాచారాన్ని యాప్‌ ద్వారా అందిస్తున్నాం.

ఇవి కూడా చదవండి..

రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ

Updated Date - Apr 29 , 2026 | 02:46 AM