Share News

శ్రమే ఆరాధన

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:51 AM

‘దేహమే దేవాలయం’ అంటారు విజ్ఞులు. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే... అది ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధన అంటే వేరేది ఏదో కాదు... శ్రమ. ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ అనే నానుడి కూడా ఉంది...

శ్రమే ఆరాధన

సద్బోధ

‘దేహమే దేవాలయం’ అంటారు విజ్ఞులు. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే... అది ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధన అంటే వేరేది ఏదో కాదు... శ్రమ. ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ అనే నానుడి కూడా ఉంది. పనే అసలైన ఆరాధన. శ్రద్ధగా శ్రమిస్తే దేహం బాగుంటుంది. అందులో... ఆత్మస్వరూపమై ఉన్న దైవం ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రమలేని దేహం శక్తిని కోల్పోతుంది. కళావిహీనంగా ఉంటుంది.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్‌ దాదాపు మూడు వేల ఏళ్ళ పూర్వ కాలానికి చెందినవాడు. ఒకసారి ఆయన ఒక పల్లెటూరుకు వెళ్ళాడు. అక్కడ తోటలో వృద్ధ తోటమాలిని, అతని కుమారుణ్ణి చూశాడు. వారు ఎంతో కష్టపడి బావిలోంచీ నీరు తోడుతూ ఉండడం గమనించాడు. వారిపై కన్ఫ్యూషియ్‌సకు జాలి కలిగింది. ఎద్దులు, గుర్రాల సాయంతో బావిలోంచీ నీరు తోడే నూతన ఆవిష్కరణ గురించి వారికి తెలియకపోవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ‘ఈ తండ్రి, కొడుకు నీరు తోడడం కోసం ఇంకా పాత పద్ధతిలో ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు?’ అని ఆలోచించాడు. వృద్ధుని దగ్గరకు వెళ్ళి ‘‘మిత్రమా! నీరు తోడడానికి కొత్త పద్ధతిని కనుక్కున్నారు. ఎద్దులను, గుర్రాలను వినియోగించి ఎంతటి లోతైనా బావి నుంచయినా సులువుగా నీరు తోడుకోవచ్చు. దాని గురించి నీకు తెలీదా? ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? పట్టణానికి వెళ్ళి, ఆ పద్ధతిని చూసి నేర్చుకోండి. మీకు ఈ కష్టం తప్పుతుంది’’ అని చెప్పాడు.

అప్పుడు ఆ వృద్ధుడు ‘‘ఉష్‌... గట్టిగా మాట్లాడవద్దు. నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది. మా అబ్బాయి వింటే కొంపలు అంటుకుపోతాయని నాకు భయంగా ఉంది’’ అన్నాడు.


‘‘మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పింది మీ మంచికే కదా!మీ అబ్బాయి వింటే ఏమవుతుంది?’’ అని అడిగాడు కన్ఫ్యూషియస్‌.

వృద్ధుడు కన్ఫ్యూషియస్‌ చెవిలో ‘‘మీరు చెప్పిన ఆ కొత్త పద్ధతి గురించి నాకు తెలుసు. కానీ మా అబ్బాయికి తెలిస్తే... వాడు ఇలా నీళ్ళు తోడే పని వదిలేసి... ఆ కొత్త పద్ధతి పాటిస్తాడు. శారీరక శ్రమ లేకపోవడంతో వాడి శరీరం బలహీనమవుతుంది. కాంతిని కోల్పోతుంది. ఆ తరువాత ప్రాణమే పోతుంది’’ అన్నాడు. ఓషో ఈ కథను ఒక సందర్భంలో చెబుతూ... ‘‘జీవం, శ్రమ ఈ రెండూ ఒక్కటే. పని చేయని దేహం పాడుపడిన దేవాలయం’’ అన్నారు.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 04:51 AM