అణచివేతను దాటి ఆకాశమే హద్దుగా
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:23 AM
పేదరికం తలుపు తట్టినా.. వివక్ష ఎదురు నిలిచినా వెనకడుగు వేయలేదు ఆ ఆరుగురు యువతులు. మగవారికి మాత్రమే సాధ్యమనుకున్న భారీ వాహనాల స్టీరింగ్‌ను చేతబూని...
స్ఫూర్తి
పేదరికం తలుపు తట్టినా.. వివక్ష ఎదురు నిలిచినా వెనకడుగు వేయలేదు ఆ ఆరుగురు యువతులు. మగవారికి మాత్రమే సాధ్యమనుకున్న భారీ వాహనాల స్టీరింగ్‌ను చేతబూని చరిత్ర పుటల్లోకి పింక్ బస్సులను పరుగులెత్తిస్తున్నారు.
గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆ 22 సీట్ల బస్సు డోరు తీసి డ్రైవర్ సీట్లో రాజసం ఉట్టిపడేలా కూర్చుంది 22 ఏళ్ల అనితాకుమారి. సైడ్ మిర్రర్ సర్దుతున్న సహాయకుడికి సూచన ఇస్తూనే ఒకసారి అద్దంలో చూసుకుని తాపీగా యాక్సిలరేటర్ నొక్కింది. అప్పటి వరకు ఆవరణలో నిశ్శబ్దంగా ఉన్న ఆ భారీ వాహనం అనిత చేతుల్లో పసిపాపలా కదిలింది. ఇది కేవలం ఒక బస్సు ప్రయాణం కాదు.. తరతరాల సామాజిక అణచివేతను దాటుకుంటూ సాగుతున్న ఆత్మగౌరవ ప్రయాణం. బీహార్ స్టేట్ రోడ్ ట్రాన్‌పోర్ట్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా ఆరుగురు మహిళలు డ్రైవర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనితతోపాటు బేబీ కుమారి (22), గాయత్రి (22), ఆర్తి(21), సరస్వతి (21), రాగిణి కుమారి (21).. ఈ ఆరుగురు యువతులు డ్రైవర్లు మాత్రమే కాదు.. బీహార్‌లోనే అత్యంత వెనుకబడిన ‘ముషహర్’ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్లు.
అపనమ్మకాలను అధిగమిస్తూ
నిజానికి వీరి ప్రయాణం పూలబాట ఏమీకాదు. ఐదడుగుల కంటే తక్కువ ఎత్తుండే బేబీ కుమారిని చూసి ‘నీ వల్లేం అవుతుంది’ అని వెక్కిరించిన వారే ఎక్కువ. కానీ బేబీ గట్టి పట్టుదలతో నిలబడింది. గతంలో కనీసం సైకిల్ కూడా తొక్కడం రాని ఆమె నేడు భారీ ట్రక్కులను, బస్సులను అవలీలగా రివర్స్ గేర్‌లో పార్క్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు తన ఎత్తు గురించి ఇతరులు చేసే కామెంట్లకు బాధపడే బేబీ.. ఇప్పుడు స్టీరింగ్ పట్టుకుంటే తన ధైర్యం హిమాలయమంత ఎత్తుకు చేరుకుంటుందని చెబుతోంది. ఈ వృత్తి తనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని గర్వంగా చెప్పింది.

ముళ్లబాటలో పూల ప్రయాణం
ఈ మహిళా డ్రైవర్ల వెనుక ‘సుధా దీదీ’గా పిలిచే సామాజిక కార్యకర్త సుధా వర్గీస్ కృషితోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఉంది. పౌష్టికాహార లోపం, పేదరికం తాండవించే ముషహర్ కుటుంబాల్లోని ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లిళ్లు చేసుకునే సంప్రదాయాన్ని సుధా వర్గీస్ మార్చాలనుకున్నారు. వారిని డ్రైవింగ్ వైపు మళ్లించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. అయితే సమాజం నుంచి ఎదురైన సవాళ్లు తక్కువేం కాదు. వివాహిత అయిన సరస్వతీ కుమారికి అత్తమామలను ఒప్పించడం పెద్ద సవాలుగా మారింది. ‘బస్సు నడిపితే లోకం నవ్వుతుంది’ అన్న వారి భయాలను దాటుకుని, నేడు తన భర్త గర్వంగా పదిమందికీ చెప్పుకునేలా ఆమె తనను తాను నిరూపించుకుంది.
రిపబ్లిక్ డే పరేడ్‌లో మెరుపులు
వీరంతా 2023లో చిన్న వాహనాల లైసెన్స్, 2024లో భారీ వాహనాల లైసెన్స్ పొంది ఔరంగాబాద్‌లోని ఐడీటీఆర్ సంస్థలో వృత్తిపరమైన శిక్షణ పూర్తిచేసుకున్నారు. కేవలం బస్సు నడపడమే కాకుండా ఇంజిన్ మెకానిజం, చిన్నచిన్న రిపేర్లు కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం పాట్నా వీధుల్లో ప్రాక్టీస్ చేస్తున్న వీరిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యంగా ఆగి చూస్తున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో గవర్నర్ ఎదుట తమ పింక్ బస్సులతో పరేడ్ నిర్వహించారు. ఒక కూలి కూతురిగా పుట్టి గాంధీ మైదాన్‌లో రాష్ట్ర ప్రముఖుల ముందు బస్సు నడపడం తమ జీవితకాల స్వప్నమని ఆర్తి కుమారి ఉద్వేగంగా చెప్పింది.
గమ్యం వైపు దూసుకుపోతూ..
బీహార్ రోడ్లపై ప్రస్తుతం 100కుపైగా పింక్ బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు పురుషులే వీటిని నడిపేవారు. కానీ ఇప్పుడు ఈ ఆరుగురు వీరనారిలు ఆ బాధ్యతను పంచుకున్నారు. మరో 13 మంది యువతులు కూడా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు లేవని డీలా పడిపోకుండా, ఈ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న వీరి తపన ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం.
ఇవీ చదవండి
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ