వారికోసం... వారి భాషలో!
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:01 AM
దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడానికి, వారికి సన్మార్గం చూపడానికి ఏసు క్రీస్తు ఈ భువిపై అవతరించాడు. ఆ సందేశాన్ని మరింత బలంగా తెలియజేయడం కోసం ఆయన...
దైవమార్గం
దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడానికి, వారికి సన్మార్గం చూపడానికి ఏసు క్రీస్తు ఈ భువిపై అవతరించాడు. ఆ సందేశాన్ని మరింత బలంగా తెలియజేయడం కోసం ఆయన ఉపమాన శైలిని ఎన్నుకున్నాడు.
ప్రభువు మాటలు వినడానికి వచ్చిన వారిలో విద్యావంతులు, మేధావుల కన్నా నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలే ఎక్కువ. ఆయన కొండల్లో సంచరించినా, కోనల్లో ఉన్నా వారు ఆయను అనుసరించేవారు. అందుకే వారి భాషలో, వారికి అర్థమయ్యే ఉపమానాలను ఉపయోగించి దైవ సందేశాన్ని ఏసు క్రీస్తు ప్రకటించాడు. వాటిలో దేవుని రాజ్య విస్తరణ గురించి బాహ్యమైన, అంతర్గతమైన ఉదాహరణలతో చెప్పినవి ప్రసిద్ధమైనవి.
‘‘ఒక రైతు తన పొలంలో ఆవగింజ నాటాడు. ఆ ఆవగింజ చూడడానికి కనిపించనంత చిన్నది. కానీ అది మొలిచింది. పెద్దదయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇస్తూ... పచ్చగా కళకళలాడుతోంది. అదే విధంగా వెలుగుతో, సత్యంతో నిండిన దైవవాక్కు... భూభాగాలన్నిటినీ విస్తరించి, దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేస్తుంది’’ ఆయన చెప్పాడు. అలాగే ‘‘ఒక ఇల్లాలు మర్నాడు ఉదయం తన పిల్లలకోసం ఒక వంటకం
చేయాలనుకుంది. చారెడు పిండి తీసుకుంది, దానిలో చిటికెడంత పులిసిన పిండిని కలిపింది. తెల్లారేసరికి మొత్తం పిండి పులిసిపోయింది. అలాగే శక్తిమంతమైన దైవవాక్కు మనుషులను, వారి మనసులను మార్చేస్తుంది’’ అని వివరించాడు. మొదటి ఆవగింజ ఉపమానం... దైవ రాజ్యం బాహ్యంగా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తోంది. పులియని పిండిలో పులిసిన పిండి కలిపినప్పుడు అంతర్గతంగా జరిగే మార్పు... దేవుని వాక్కు ద్వారా మానవునిలో హృదయంలో కలిగే (అంతర్గత) మార్పును సూచిస్తుంది. ఏసు ప్రసంగాల్లో ఇలాంటి ఉపమానాలు అనేకం కనిపిస్తాయి. ఒక లోతైన, నిగూఢమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యే వాటితో పోల్చి చెప్పడమే ఉపమానం. దీనివల్ల ఆ విషయం శ్రోతలకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ