Share News

కారణం మన లోపలే ఉండొచ్చు...

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:58 AM

‘అష్టావక్ర గీత’ గ్రంథం చదువుతున్నప్పుడు జనక మహారాజుకు, అష్టావక్ర మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో లోతైన ఒక వైరుధ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జ్ఞానానికి, ఆధ్యాత్మికమైన పరిపక్వతకు ప్రసిద్ధుడైన జనకుడు...

కారణం మన లోపలే ఉండొచ్చు...

యోగా

‘అష్టావక్ర గీత’ గ్రంథం చదువుతున్నప్పుడు జనక మహారాజుకు, అష్టావక్ర మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో లోతైన ఒక వైరుధ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జ్ఞానానికి, ఆధ్యాత్మికమైన పరిపక్వతకు ప్రసిద్ధుడైన జనకుడు ‘‘కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి... వైరాగ్యం చ కథం ప్రాప్తం... అంటే జ్ఞానం ఎలా లభిస్తుంది? ముక్తి ఎలా కలుగుతుంది? వైరాగ్యం ఎలా సిద్ధిస్తుంది?’’ అని అడుగుతాడు. దానికి అష్టావక్రుడు ఇచ్చిన సమాధానంలోని చక్కదనం... జనకుడి దృష్టిని అతను మళ్ళించడంలోనే ఉంది. బయట ఉన్న ఏదైనా వస్తువునో, విషయాన్నో ఆశ్రయించాలని చెప్పడానికి బదులు... అప్పటికే జనకుడిలో అంతర్గతంగా ఉన్న... అంటే, అతని సాక్షిగా ఉన్న చైతన్యం వైపు మళ్ళించాడు. అద్వైత దృక్పథం ప్రకారం... ఒక వ్యక్తి ఆధ్మాత్మికంగా అన్వేషించే దాన్ని బయట ఎక్కడో కాదు... తనలో తాను గుర్తించాలి. ఈ ఆలోచన వైద్య రంగంలో నేను ప్రతి రోజూ ఎదుర్కొనే మరో వైరుధ్యం గురించి ఆలోచించేలా చేసింది.

నిర్ధారణలో మరో కోణం

వైద్యులుగా... మా దగ్గరికి ఛాతీలో అసౌకర్యంతో ఒక రోగి వస్తే... కరోనరీ వ్యాధి ఉందేమో పరిశీలిస్తాం. రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే... గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నాయేమో పరిశీలిస్తాం. తలనొప్పితో వస్తే... నరాలు, రక్తనాళాలు తదితరాలకు సంబంధించిన కారణాల కోసం పరిశీలిస్తాం. ఈ శోధన చాలా అవసరం. ఎందుకంటే... రోగులకు తీవ్రమైన వ్యాధి ఉన్నట్టయితే... దాన్ని గుర్తించకుండా వదిలేసే ప్రమాదం నుంచి అది తప్పిస్తుంది. కానీ... ఒక్కోసారి పరీక్షల ద్వారా వివరించగలిగే దానికన్నా... రోగి అనుభవించే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ రోగ లక్షణం ఉంది, బాధ ఉంది. కానీ అది శరీరకమైన వ్యాధి కాకపోవచ్చు. ఇక్కడే వైద్య రంగానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కోణం ప్రవేశిస్తుంది... అదే మెదడు, మనసు, శరీరం, అంచనాలు, అవగాహనల మధ్య ఉండే పరస్పర సంబంధం. పరీక్షల్లో ఏదీ తేలనంత మాత్రాన.. ‘‘మీకు ఏ సమస్యా లేదు’’ అని కొట్టి పారేయడం సరైనది కాదు. వారి బాధ వాస్తవమైనది. మానసికమైనవి, సందర్భానుసారం ఎదురైనవి అయిన కారణాలు... మనలోని లక్షణాలను లేదా నొప్పిని గ్రహించే, అనుభవించే తీరును ప్రభావితం చేయగలవని ఆధునిక నాడీ శాస్త్రం నిరూపించింది. అయితే ఇంకా నిర్ధారణకాని శారీరక వ్యాధి నుంచి దాన్ని జాగ్రత్తగా వేరు చేసి గుర్తించడమే ఇక్కడున్న సవాలు.


వ్యత్యాసం సూక్ష్మమే కానీ....

ఇద్దరు రోగులు అనుభవిస్తున్న రోగ లక్షణాలు భిన్నంగా ఉన్నా... వారికి ఒకే రకమైన పరీక్షలు జరపవచ్చు. ‘‘మీ గుండె నిర్మాణరీత్యా సాధారణంగా ఉంది’’ అనే మాట విని ఒక రోగి ధైర్యం తెచ్చుకోవచ్చు. మరొక రోగి గుండె తాలూకు ప్రతి చప్పుడునూ గమనిస్తూ, ప్రతి అనుభూతిని ప్రమాదంగా భావిస్తూ... పదే పదే పరీక్షల చేయించుకోవాలని అనుకోవచ్చు. గుండె దానంతట అదే కొట్టుకుంటుంది. కానీ గుండె ఎలా కొట్టుకుంటోందో అదే పనిగా విశ్లేషిస్తూ ఉండడం ఆందోళనకు మూలం కావచ్చు. అలాంటప్పుడు వైద్యుడి పాత్ర వ్యాధిని గుర్తించడం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒక అవయవంలో ఏం జరుగుతోంది? అలాగే ఆ అవయవంలో ఏం జరుగుతోందనే విషయంలో రోగి వ్యాఖ్యానం ఏమిటి?... ఈ రెండిటి మధ్యా వ్యత్యాసం సూక్ష్మమైనదే కావచ్చు, కానీ ముఖ్యమైనది.

ఏది సమస్య?

ఇక్కడే దీనికి, అష్టావక్రుడి సమాధానావికీ మధ్య అనూహ్యమైన ఒక సంబంధం కనిపిస్తుంది. జ్ఞానాన్ని, మోక్షాన్ని ఎలా పొందవచ్చని జనకుడు ప్రశ్నించినప్పుడు... ఒక వస్తువును సంపాదించడం వైపు కాకుండా, సాక్షి (ఆత్మ) వైపు అతణ్ణి అష్టావక్రుడు మళ్ళిస్తాడు. ఆయన బోధన ఆత్మను చైతన్యంగా, అనుభవానికి సాక్షిగా వర్ణిస్తుంది. వైద్యరంగంలో కూడా ఇలాంటిది కనిపిస్తుంది. మరో స్కాన్‌, మరో నిపుణుడు, మరో రక్త పరీక్ష, మరో వివరణ, మరో మాత్ర... ఇలా ఒక రోగి నిరంతరం బయట వెతుకుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ అన్వేషణ అవసరమే. కానీ మరికొన్నిసార్లు ఆ అన్వేషణే బాధల చక్రంలో ఒక భాగం కావచ్చు. ఒక వ్యక్తికి ఒక అనుభూతి కలుగుతుంది. భయపడతాడు. ‘ఇది ఏ వ్యాధి కావచ్చు?’ అని వెతుకుతాడు. ఆ అనుభూతి మీద మరింత దృష్టి పెడతాడు. సాధారణమైన శారీరక మార్పులను రోగ లక్షణాలుగా భావిస్తాడు. మరింత భయపడతాడు. శరీరం ఒక అనుభూతిని ఉత్పత్తి చేస్తుంది. మనసు ఒక వ్యాఖ్యానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ వ్యాఖ్యానం భావోద్వేగపరమైన ఒక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. ఆ భావోద్వేగ ప్రతిస్పందన శరీరం పట్ల అవగాహనను పెంచుతుంది. ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ సమస్య కేవలం వ్యాధితోనే కాకపోవచ్చు. వ్యాధి లక్షణం గురించిన ఆలోచనా సంబంధమే సమస్యగా మారి ఉండవచ్చు.


ముఖ్యమైన పాఠం

బహుశా ఒక వైద్యుడికి అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే. మందుని సూచించడానికి ముందు... దాన్ని స్వీకరించే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఒక రోగికి మాత్ర అవసరమవుతుంది. కొన్నిసార్లు పరీక్ష, ఇంకొన్నిసార్లు మానసిక చికిత్స లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన జోక్యం అవసరమవుతాయి. మరికొన్ని సార్లు జాగ్రత్తగా పరిస్థితిని విశ్లేషించిన తరువాత రోగికి భరోసా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే, ప్రతి శారీరక అనుభూతికీ ఏదో ఒక వ్యాధి కారణం కానవసరం లేదని రోగి కొన్నిసార్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. ‘మీ వ్యాధి కేవలం మీ మనసులోనే ఉంది’ అని రోగికి చెప్పడం ఈ ప్రక్రియ ఉద్దేశం కాదు. ‘మీకు కలుగుతున్న అనుభవం వాస్తవమైనదే. దానికి కారణం ఏమిటో... అలాగే మీ మనసుల మెదడు, శరీరం... ఒకదాన్ని మరొకటి ఎలా ప్రభావితం చేసుకుంటున్నాయో తెలుసుకుందాం’ అని వారికి అర్థమయ్యేలా చేయడమే అసలైన లక్ష్యం.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌

ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌, 9440087532

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..

Updated Date - Oct 02 , 2026 | 04:58 AM