నిజమైన ప్రార్థన
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:03 AM
సాధారణంగా ‘‘ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది’’ అని అంటూ ఉంటారు. కానీ ప్రతి విజయం వెనుకా ‘‘నేను నీకు తోడుగా ఉన్నాను’’ అనే దైవ శక్తి ఉంటుందని...
చింతన
సాధారణంగా ‘‘ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది’’ అని అంటూ ఉంటారు. కానీ ప్రతి విజయం వెనుకా ‘‘నేను నీకు తోడుగా ఉన్నాను’’ అనే దైవ శక్తి ఉంటుందని నేను చెబుతాను. మీరు దైవాన్ని ప్రార్థించి, హృదయపూర్వకంగా వేడుకున్నప్పుడు.. ఆ దైవత్వం మీలో ఉదయిస్తుంది. ప్రార్థించడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. మీరు జ్ఞాని అయినా కాకపోయినా, మీరు ధనవంతులైనా, పేదవారైనా... ఎవరైనా ప్రార్థించవచ్చు.
మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రార్థన ఒక శక్తిమంతమైన సాధనం. ఏదైనా అడ్డంకిని అధిగమించడం అసాధ్యం అనిపించినప్పుడు... ప్రగాఢమైన ప్రార్థన అద్భుతాలను సృష్టించగలదు. మీకు చేతనైన పనులు మీరు చేయండి. మీవల్ల కానివాటి కోసం ప్రార్థించండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ... అంతిమ నిర్ణయం ఆ దైవశక్తిదేనని గుర్తించండి. మీరు ప్రార్థనల ద్వారా ఆ శక్తిని పొందవచ్చు. ప్రార్థన అంటే కేవలం కూర్చొని కొన్ని పదాలను జపించడం మాత్రమే కాదు... ప్రశాంతమైన, నిశ్చలమైన, ధ్యాననిమగ్నమైన స్థితిలో ఉండడం. అందుకే వైదిక సంప్రదాయంలో ప్రార్థనకు ముందు ధ్యానం ఉంటుంది. అలాగే ప్రార్థన తరువాత కూడా ధ్యానం ఉంటుంది. మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు. ఆ ప్రార్థన ఎంతో శక్తిమంతంగా మారుతుంది. మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారనేది ప్రధానం కాదు. ప్రతి మతం ప్రార్థనకు మాటలను, చిహ్నాలను, ఆచారాలను జోడిస్తుంది. కానీ ప్రార్థన వాటన్నిటికన్నా అత్యున్నతమైనది. అది భావాలకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో జరుగుతుంది. ఆ భావాలు మాటలకు, మతాలకు అతీతమైనవి.
మీ ప్రార్థనల్లో చిత్తశుద్ధితో ఉండండి. దైవం నుంచి మీరు కోరుకున్నదాన్ని పొందడం కోసం తొందరపడకండి. నిజమైన ప్రార్థన... ఏదైనా మాకు సొంతం కావాలనే కోరికకు పూర్తిగా విరుద్ధం. ప్రార్థన అంటే దైవాన్ని గౌరవించడం, ఆయనకు సర్వస్వాన్నీ సమర్పించడం. ఈ లక్షణాలు భక్తిని కలిగిస్తాయి, శరణాగతికి దారి తీస్తాయి. భక్తి విశ్వాసాలు ప్రార్థనకు మూలాధారాలు. విశ్వాసం కలిగి ఉండడం అంటే... దేవుని రక్షణ మీకు ఉందని గ్రహించడం. అంతర్గతంగా భక్తి వికసించడం. దైవం పట్ల మీలో భక్తి ప్రజ్వరిల్లకపోతే... మీ జీవితం అశాంతిగా ఉంటుంది. భక్తి ద్వారా మీలో ఒక తపన పుడుతుంది. ఆ తపన ఉన్నప్పుడు నిజమైన ప్రార్థన దానంతట అదే జరుగుతుంది.
శ్రీశ్రీరవిశంకర్
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ