ఐదు నిమిషాల ఆసనం
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:54 AM
అత్యంత ప్రభావాన్ని కనబరిచే కొన్ని సాధనలు శరీరాన్ని తక్కువ శ్రమకు లోను చేస్తాయి. అలాంటి కోవకు చెందిన, ఐదు నిమిషాల నిడివి కలిగిన ‘విపరీత కారిణి’ యోగాసనం గురించి తెలుసుకుందాం!
యోగా
అత్యంత ప్రభావాన్ని కనబరిచే కొన్ని సాధనలు శరీరాన్ని తక్కువ శ్రమకు లోను చేస్తాయి. అలాంటి కోవకు చెందిన, ఐదు నిమిషాల నిడివి కలిగిన ‘విపరీత కారిణి’ యోగాసనం గురించి తెలుసుకుందాం!
కేవలం ఐదు నిమిషాల పాటు రెండు కాళ్లను పైకి లేపి గోడకు ఆనించి ఉంచడం వల్ల అలసిన కాళ్లకు ఉపశమనం దక్కుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ కూడా ఉపశమనం పొందుతుంది. రోజంతా ఉరుకుల పరుగులతో గడిపేసే ఉద్యోగులు, సాయంత్రానికి శరీరానికి ఉపశమనాన్ని అందించాలనుకుంటే, ఈ ఆసనాన్ని తప్పక సాధన చేయాలి. ఇందుకోసం...
కటి భాగం గోడకు తాకేలా వెల్లకిలా పడుకోవాలి
నెమ్మదిగా కాళ్లను పైకి లేపాలి
చేతులను వదులుగా పక్కకు చాపాలి
ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాసించాలి
తిరిగి కాళ్లను నెమ్మదిగా కిందకు దింపాలి
ఈ ఆసనంతో...
నాడీ వ్యవస్థ: కాళ్లు గుండె కంటే ఎత్తుకు చేరుకుంటాయి కాబట్టి 90 సెకన్ల వ్యవధిలో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ చైతన్యమవుతుంది. హృదయ స్పందన నెమ్మదించి, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గుముఖం పడుతుంది. దాంతో రోజంతా అప్రమత్తంగా ఉండే శరీరానికి... ‘నువ్విప్పుడు సురక్షితంగా ఉన్నావు, కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు’ అనే సంకేతం అందుతుంది.
రక్తం: గురుత్వాకర్షణ శక్తి వల్ల, కాళ్లలో పేరుకున్న రక్తం, లింఫ్ స్రావాలు గుండెకు చేరతాయి. ఫలితంగా రక్తప్రసరణ మెరుగుపడి, వాపులు తగ్గుతాయి. వెరికోజ్ వెయిన్స్ ఉపశమనం పొందుతాయి. రోజంతా మన శరీర భారాన్ని మోసిన కాళ్లు విశ్రాంతి పొందుతాయి.
వెన్ను: కాళ్లను పైకి లేపినప్పుడు, వెన్ను దిగువ భాగం విశ్రాంతి పొందుతుంది. వెన్ను కండరాలన్నీ ఉపశమనం పొందుతాయి. దాంతో గంటల తరబడి కుర్చీలో కూర్చుని పని చేయడం వల్ల తలెత్తే నడుము నొప్పులు అదుపులోకొస్తాయి.
మెదడు: తలకిందుల భంగిమలు నిమిషాల్లో మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచుతాయి. దాంతో తలనొప్పులు, మెంటల్ ఫాగ్ తగ్గుతాయి. మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. నాడీ వ్వవస్థ విశ్రాంత స్థితికి లోనవుతుంది.
రికవరీ: ప్రతి రోజూ నిద్రకు పది నిమిషాల ముందు ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల, కంటి నిండా నిద్ర పడుతుంది. కార్టిసాల్ హార్మోన్ తగ్గడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, తక్కువ సమయంలోనే గాఢనిద్రలోకి జారుకుంటాం!
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్
మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..