చైతన్యాన్ని మేలుకొలుపుదాం
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:43 AM
వినాయక చవితిని గణపతి పుట్టినరోజుగా మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ పండుగ వెనుక ఉన్న అంతరార్థం చాలా లోతైనది. గజముఖునిగా మనం పూజిస్తున్న...
చింతన
14న వినాయక చవితి
వినాయక చవితిని గణపతి పుట్టినరోజుగా మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ పండుగ వెనుక ఉన్న అంతరార్థం చాలా లోతైనది. గజముఖునిగా మనం పూజిస్తున్న గణేశుని రూపం ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేయడానికి మాత్రమే ఉద్దేశించినది. గణేశుని ‘అజం నిర్వికల్పం నిరాకారమేకం’ అని వర్ణిస్తారు. దీని అర్థమేమిటంటే... గణేశుడుఅజుడు... పుట్టుక లేనివాడు. నిరాకారుడు... రూపం లేనివాడు. నిర్వికల్పుడు... గుణాలు లేనివాడు. ఈ విశ్వం ఆవిర్భావానికి కారణమైన శక్తి గణేశుడు. సమస్త సృష్టి ఆయన నుంచే ఉద్భవించింది. అంతిమంగా ఈ ప్రపంచం అదే శక్తిలో లీనమవుతుంది.
గణేశుడు మనకు వెలుపల ఎక్కడో ఉన్నవాడు కాదు... ఆయన మన జీవితానికి కేంద్ర బిందువు. అయితే రూపం లేకుండా... నిరాకార తత్త్వాన్ని గ్రహించడం అందరికీ సాధ్యం కాదు. అది చాలా సూక్ష్మమైన జ్ఞానం. మన ప్రాచీన ఋషులు, మునులు ఈ విషయాన్ని ఎగిరినవారు. అందుకే... అన్ని స్థాయిల ప్రజలకూ అర్థమయ్యేలా, వారి ప్రయోజనం కోసం ఒక రూపాన్ని సృష్టించారు. నిరాకార తత్త్వాన్ని నేరుగా అనుభవించలేనివారు... సాకార (విగ్రహ) రూపాన్ని నిరంతరం ఆరాధించడం ద్వారా... క్రమంగా నిరాకార బ్రహ్మాన్ని చేరుకుంటారు. గణేశుడి సాకార రూపాన్ని నిరంతరం పూజించడం ద్వారా... ఆ నిరాకార పరమాత్మను చేరుకొనే ఒక విశిష్టమైన మార్గాన్ని వినాయక చవితి లేదా గణేశ చతుర్థి మనకు సూచిస్తుంది.
గణేశుణ్ణి మన అంతరాత్మ (చైతన్యం) నుంచి బయటకు వచ్చి, కొంతకాలం విగ్రహంలో ఉండాలని మనం ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలు, పూజలు ముగిసిన తరువాత... ఆయనను వచ్చిన చోటికే... అంటే మన అంతరాత్మలోకి... వెళ్ళిపోవాలని వీడ్కోలు చెబుతున్నాం. విగ్రహంలో ఆయన ఉన్నప్పుడు... ఆ దేవుడు మనకు ప్రసాదించిన వాటినే పూజ రూపంలో ఆయనకు తిరిగి సమర్పిస్తాం. కొన్ని రోజుల పూజ తరువాత విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసే ఆచారం... దేవుడు ఆ విగ్రహంలో లేడని, మన అంతరాత్మలోనే ఉన్నాడనే సత్యాన్ని దృఢపరుస్తుంది. కాబట్టి.. సాకార రూపంలోని సర్వవ్యాప్తిని అనుభూతి చెందడం, ఆ రూపం ద్వారా ఆనందాన్ని పొందడమే వినాయకచవితి పండుగ సారాంశం.
ఒక విధంగా చెప్పాలంటే... ఇళ్ళలో కుటుంబ సభ్యులతో, వీధుల్లో ఇరుగు పొరుగులతో చేసుకొనే ఇలాంటి ఉత్సవాలు, పూజలు ప్రజల్లో ఉత్సాహాన్ని, భక్తిభావాన్ని, సామరస్యాన్ని పెంపొందిస్తాయి. చైతన్యానికి అధిష్టాన దైవం గణేశుడు. అందుకే... చైతన్యాన్ని మేలుకొలపడం కోసం ప్రతి పూజకు ముందు గణేశుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి... గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, అపారమైన భక్తితో, ప్రేమతో పూజించి, ధ్యానం చేస్తూ... మన అంతరాత్మలో ఆయనను అనుభూతి చెందుదాం.
శ్రీశ్రీ రవిశంకర్
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ