Share News

ఆయనకు చూపులేదు కానీ... జ్ఞానమే మూడోకన్ను!

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:04 AM

వెన్నెలకంటి సుందరరామశర్మ జీవితం అపజయాన్ని ఒప్పుకోని అంచంచల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అంధత్వం అనేది జ్ఞానసాధనకు ఆటంకం కాదని...

ఆయనకు చూపులేదు కానీ... జ్ఞానమే మూడోకన్ను!

చింతన

వెన్నెలకంటి సుందరరామశర్మ జీవితం అపజయాన్ని ఒప్పుకోని అంచంచల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అంధత్వం అనేది జ్ఞానసాధనకు ఆటంకం కాదని, పట్టుదల, అంకితభావం ఉంటే భగవత్‌ తత్త్వాన్ని దర్శించి, దాన్ని ఇతరులకు పంచవచ్చని ఆయన నిరూపించారు. శబ్ద తరంగాలనే తన గురువుగా చేసుకొని, ఇతరులు గ్రంథాలు చదువుతూ ఉంటే శ్రద్ధగా వింటూ, వాటన్నిటినీ మస్తిష్కంలో భద్రపరుచుకున్నారు. ‘శ్రీమదాంధ్ర వచన జ్ఞానావశిష్ఠం’, ‘బ్రహ్మసూత్ర రహస్యం’, ‘సీతారామాంజనేయ సంవాదము’ అనే అపూర్వమైన గ్రంథకర్తగా చిరకీర్తి పొందారు.

బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు చూపు లేకపోయినా... అంతర్నేత్రంతో పరమాత్మ తత్త్వాన్ని దర్శించి, ఆ దివ్య జ్ఞానాన్ని లోకానికి పంచిన మహనీయుడు వెన్నెలకంటి సుందరరామశర్మ. ఆయన రచించిన అపూర్వమైన మూడు గ్రంథాలలో ‘శ్రీమదాంధ్ర వచన జ్ఞానావశిష్ఠం’ అత్యంత విశిష్టమైనది. సుందరరామశర్మ పుట్టిన సంవత్సరం తదితర వివరాలు రికార్డుల్లో స్పష్టంగా లేవు. అయితే ఆయన రచించిన ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథాలు 1918-1920 మధ్య కాలంలో ముద్రితమమయ్యాయి. వీటి ఆధారంగా చూసినప్పుడు... ఆయన పంతొమ్మిదో శతాబ్దం చివరి భాగంలో లేదా ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో జీవించి ఉన్నారని భావించవచ్చు.

శ్రీరామ, వశిష్ట సంవాదం

సుందరరామశర్మ సులభశైలిలో రచించిన ‘శ్రీమదాంధ్ర వచన జ్ఞానవాశిష్ఠం’ అద్భుతమైన వేదాంత నిధి. దాని మూలాన్ని వాల్మీకి రచించాడని చెబుతారు. యుక్తవయసులో అడుగుపెట్టిన శ్రీరాముడు దేశాటన (తీర్థయాత్రలు) ముగించుకొని అయోధ్యకు తిరిగి వస్తాడు. లోకాన్ని చుట్టిన రాముణ్ణి తీవ్రమైన వైరాగ్యం ఆవహిస్తుంది. సంసార జీవితం, ఐశ్వర్యం. రంగుల ప్రపంచం అన్నీ అనిత్యమైనవనీ, మనుషులు సుఖం అనుకొనేవన్నీ దుఃఖ కారకాలనీ భావించి... నిరాశతో, మౌనంగా ఉండిపోతాడు. సరిగ్గా అదే సమయంలో తన యాగ సంరక్షణ కోసం రాముణ్ణి తనతో పంపాల్సిందిగా దశరథుణ్ణి కోరడానికి విశ్వామిత్రుడు వస్తాడు. రాముడి వైరాగ్య స్థితిని గమనించిన విశ్వామిత్రుడు... రాముడిలో వేదన కేవలం అజ్ఞానం కాదనీ, అది పరమజ్ఞానానికి ద్వారమనీ గ్రహిస్తాడు. రాముడికి తత్త్వబోధ చేయాల్సిందిగా అతని కులగురువైన వశిష్ట మహర్షిని ప్రార్థిస్తాడు. దాంతో... రాజాస్థానంలో... మహర్షులు, పండితుల సమక్షంలో వశిష్ట-శ్రీరామ సంవాదం ప్రారంభమవుతుంది. ఇదీ జ్ఞాన వాశిష్ఠం నేపథ్యం. వశిష్టుడికి, రాముడికి మధ్య జరిగిన సంభాషణ... ఉత్తమ గురువుకు, ఉత్తమ శిష్యుడికి మధ్య జరిగిన తాత్త్విక చర్చ. వశిష్టుడి బోధన ముగిసేసరికి... శ్రీరాముడి మనసులోని సందేహాలన్నీ పటాపంచలవుతాయి. తన గురువు పాదాలకు నమస్కరించి, వైరాగ్యభావాన్ని విడిచిపెట్టి, లోక రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం కార్యోన్ముఖుడవుతాడు.


వైరాగ్యమే తొలి మెట్టు

వశిష్ట మహర్షి శ్రీరాముడికి అందించిన ఈ బోధనలో సంసార వైరాగ్యమే మోక్షానికి మొదటి మెట్టుగా వర్ణించడం జరిగింది. ఈ గ్రంథంలోని తత్త్వాన్ని సామాన్యులకు సైతం అనుభవంలోకి వచ్చేలా సుందరరామ శర్మ మలిచారు. జగత్తు అనేది ఒక స్వప్నం లాంటిదని, నిద్ర లేచిన వెంటనే స్వప్న జగత్తు ఎలా మాయమవుతుందో, జ్ఞానోదయం కలిగిన వెంటనే ఈ సంసార బంధాలు అలాగే పటాపంచలైపోతాయని ఈ గ్రంథం చెబుతుంది.

భక్తి, యోగ, జ్ఞానాల త్రివేణీ సంగమం

జగత్తు మిథ్య అని, జీవుడు పరబ్రహ్మకంటే వేరు కాదని చాటిచెప్పే అద్వైత సిద్ధాంతాన్ని సుందరరామశర్మ శోధించారు. కంటికి కనిపించే ఈ నామ రూపాత్మక జగత్తు అంతా ఒక భ్రమ మాత్రమేనని, కళ్ళు లేకపోవడం వల్లనే ఈ ప్రపంచపు మాయా రూపాలు ఆయన మనస్సును భ్రమింపజేయలేకపోయాయని భావించవచ్చు. బ్రహ్మసూత్ర రహస్యంలో ఆయన చేసిన తత్త్వ విచారణ జీవుడి బంధం, విముక్తి అనే ప్రాథమిక సత్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఉపనిషత్తుల సారాన్నంతటినీ వ్యాసుడు సూత్రాలుగా మలిస్తే, వాటి వెనుక ఉన్న కఠినమైన అద్వైతాన్ని సుందరరామశర్మ సులభతరం చేశారు. అవిద్య (అజ్ఞానం) ఎలా తొలగిపోతుందో వివరిస్తూ... కంటికి కనిపించే ఈ జగత్తు రజ్జు-సర్ప భ్రాంతి (తాడును చూసి పాము అనుకోవడం) లాంటిదనీ, బుద్ధి అంతర్ముఖమైనప్పుడు... భ్రాంతి తొలగి కేవలం సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే మిగులుతుందని నిరూపించారు. ఆయన మరో విశిష్ట రచన అయిన ‘సీతారామాంజనేయ సంవాదము’ తాత్పర్యంలో ఆయన చేసిన తత్త్వ విచారణ... భక్తి, యోగ, జ్ఞానాల త్రివేణీ సంగమం. కేవలం భక్తితో మొదలయ్యే సాధన... యోగ సాధన ద్వారా పరమ జ్ఞానంగా ఎలా మారుతుందో అందులో వివరించారు. జీవాత్మ-పరమాత్మ ఐక్యతకు (జీవ బ్రహ్మైక్యానికి) దారి తీసే రహస్య మార్గాలను ఆవిష్కరించారు. ఆయన గ్రంథాలు అందరికీ అవశ్య పఠనీయాలు.

వనం జ్వాలా నరసింహారావు

సులభ వచనంలో బ్రహ్మసూత్రాలు..

వ్యాస మహర్షి రచించిన అత్యంత క్లిష్టమైన బ్రహ్మసూత్రాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వచన రూపంలో తీసుకురావాలనే సంకల్పం ఆయనకు కలగడమే ఒక అద్బుతం. ఆ సంకల్ప బలంలోంచే ‘బ్రహ్మసూత్ర రహస్యం’ అనే మహత్తర వచనకావ్యం ఆవిర్భవించింది. అద్వైతానికి మూలస్తంభాలలాంటి ఆ సూత్రాలను, వాటి అంతరార్థాలను ఇతరులకు చెప్పి రాయించి, గ్రంథస్తం చేయడం అక్షరాలా ఒక యజ్ఞం. ఆయన ఆంతరంగిక వేదాంత ప్రయాణాన్ని, ఆయన గ్రంథాల్లోని నిగూఢ తత్త్వ విచారణను పరిశీలిస్తే... మానవ మేధస్సుకు అందని ఎన్నో రహస్యాలు గోచరిస్తాయి. అది కేవలం అక్షరాల కూర్పు కాదు... నిర్గుణ పరబ్రహ్మ తత్త్వానికి, సగుణోపాసన భక్తి మార్గానికి మధ్య నిర్మించిన సేతువు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 02:04 AM