Share News

వీరనారి సైన్యమై కదిలిన వేళ

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:43 AM

ఉగ్రవాదులతో పోరులో భర్త అమరుడైతే ఆ కన్నీటిని ధైర్యంగా మార్చుకుని ఆయన బాటలోనే నడిచిన దేశపు మొట్ట మొదటి వీరనారి ఆమె. సాయుధ దళాల వెటరన్‌ డే సందర్భంగా...

వీరనారి సైన్యమై కదిలిన వేళ

స్ఫూర్తి

ఉగ్రవాదులతో పోరులో భర్త అమరుడైతే ఆ కన్నీటిని ధైర్యంగా మార్చుకుని ఆయన బాటలోనే నడిచిన దేశపు మొట్ట మొదటి వీరనారి ఆమె. సాయుధ దళాల వెటరన్‌ డే సందర్భంగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవీందర్‌ జీత్‌ రంధవా (రిటైర్డ్‌) అజేయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సైన్యం ఆమెకు సెల్యూట్‌ చేసింది. ‘మనకోసం మనం నిలబడితే ఏదైనా సాధ్యం’ అంటూ యువతలో స్ఫూర్తి నింపే రంధవా స్ఫూర్తిగాధ ఇది.

చండీగఢ్‌లో ఇటీవల జరిగిన 10వ సాయుధ దళాల వెటరన్స్‌ డే వేడుకలు ఎందరో వీరుల త్యాగాలను స్మరించుకున్నాయి. కానీ, అక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన పేరు.. లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవీందర్‌ జీత్‌ రంధవా (రిటైర్డ్‌). భారత సైన్యం చరిత్రలో ఒక సామాన్య ఇల్లాలు అధికారిణిగా ఎదిగిన అసాధారణ ప్రయాణం ఆమెది.

విధి ఆడిన వింతనాటకం

1997 జూన్‌ 17.. అనంతనాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్‌ సుఖ్వీందర్‌ జీత్‌ సింగ్‌ రంధవా (కీర్తిచక్ర-మరణానంతరం) వీరమరణం పొందారు. అమృత్‌సర్‌కు చెందిన రవీందర్‌ అప్పుడు ఒక పసిపాపకు తల్లి. భర్త మరణవార్త విన్నప్పుడు ఆమె సర్వస్వం కోల్పోయినట్టు భావించారు. కానీ, తన బిడ్డను సైనిక వాతావరణంలోనే పెంచాలన్న తన భర్త ఆఖరి కోరికను నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.


66-navya.jpg

సంకెళ్లను తెంచుకుని

ఒక సాధారణ గృహిణి సైన్యంలో చేరడం అంత సులభం కాదు. వయసు, వైవాహిక స్థితి వంటి ఎన్నో అడ్డంకులు. కానీ రవీందర్‌ పట్టుదల ముందు నిబంధనలు కూడా తలవంచక తప్పలేదు. అప్పటి ఆర్మీచీఫ్‌ జనరల్‌ వేద్‌ ప్రకాశ్‌ మలిక్‌ సహకారంతో ప్రత్యేక అనుమతి పొందిన ఆమె 1997 డిసెబర్‌లో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎ్‌సబీ) పాసయ్యారు. 1998 మార్చి 21న తన పుట్టిన రోజునాడే ఆమె ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (చెన్నై)లో అడుగుపెట్టారు. సెప్టెంబర్‌ 5న యూనిఫాం ధరించి దేశంలోనే తొలి ‘వీరనారి’ అధికారిణిగా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.

పాతికేళ్ల ప్రయాణం

ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో రెండున్నర దశాబ్దాలపాటు విశేష సేవలు అందించిన రవీందర్‌ ఒకవైపు విధి నిర్వహణ చేస్తూనే మరోవైపు సింగిల్‌ మదర్‌గా తన కుమార్తెను ప్రయోజకురాలిని చేశారు. 2023లో పదవీ విరమణ చేసినప్పటికీ ఆమె ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. ‘‘మన కోసం మనం నిలబడనంత వరకు ఎవరూ మనల్ని కాపాడలేరు. మిమ్మల్ని మీరు నమ్మితే ఈ ప్రపంచంలో ఏ సమస్యా పరిష్కారం కాకుండా పోదు’’ అని చెప్పే కల్న ల్‌ రంధవా జీవితం ఎంతోమందికి స్ఫూర్తి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 22 , 2026 | 04:43 AM