భక్త ప్రతిమలూ ప్రత్యేకమే
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:33 AM
ఆలయాల్లో ప్రతిష్ఠించే దైవ భక్తుల విగ్రహాల రూపకల్పనకు ప్రత్యేకమైన విధివిధానాలను గ్రంథాలు నిర్దేశించాయి. విష్ణు భక్తులైన ఆళ్వార్ల విగ్రహాలన్నిటినీ ఉత్తమ అష్ట తాళంలో...
తెలుసుకుందాం
ఆలయాల్లో ప్రతిష్ఠించే దైవ భక్తుల విగ్రహాల రూపకల్పనకు ప్రత్యేకమైన విధివిధానాలను గ్రంథాలు నిర్దేశించాయి. విష్ణు భక్తులైన ఆళ్వార్ల విగ్రహాలన్నిటినీ ఉత్తమ అష్ట తాళంలో చేయాలని ‘విష్ణుతత్త్వం’ అనే గ్రంథం చెబుతోంది. శిల్పులు వైష్ణవ విధులను పాటిస్తూ... ఆ భక్తుల విగ్రహాలను వైష్ణవ సంప్రదాయానుగుణంగా తయారు చేయాలి. అలాగే శివభక్తులైన నాయనార్ల విగ్రహాలను శైవ సంప్రదాయానుసారంగా ఉత్తమ అష్టమ తాళంలో రూపొందించాలి.
బోధలు, కైంకర్యాల ఆధారంగా...
సాధారణంగా భక్త ప్రతిమలన్నీ రెండు చేతులూ జోడించి, అంజలి ముద్రతో భగవంతుడికి నమస్కరిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రతిమలు ఆ భక్తుల జ్ఞానవైరాగ్యం, వారు చేసిన బోధలు, ఆ ప్రతిమలు ఉన్న క్షేత్రాలు, ఆ క్షేత్రాలలో వారు చేసిన కైంకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆళ్వార్లలో ముఖ్యుడైన శ్రీనమ్మాళ్వార్ విగ్రహం జ్ఞానముద్రలో ఉంటుంది. మిగిలిన చోట్ల అంజలి ముద్రలో ఉన్నప్పటికీ, తిరుమల క్షేత్రంలో... శ్రీవారి సన్నిధిలో కొలువైన శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉపదేశాత్మకంగా జ్ఞాన, వరద ముద్రలతో ఉంటుంది. అలాగే శ్రీరంగ క్షేత్రంలో జ్ఞానముద్రతో ఉంటుంది. బదరీనాథ్ ఆలయంలోని శ్రీఆదిశంకరాచార్యుల ప్రతిమ జ్ఞానముద్రతో, మరొక చేతిలో తాళపత్రాలతో ఉంటుంది. శ్రీ మధ్వాచార్యుల ప్రతిమ... ఆయన ప్రవచించిన ద్వైత సిద్ధాంతాన్ని సూచిస్తూ, రెండు వేళ్ళను చూపిస్తూ ఉంటుంది.
ఆయుధాలు, వాయిద్యాలు
పరమ భక్తుడైనప్పటికీ రాచరిక నేపథ్యం ఉన్న శ్రీకులశేఖర ఆళ్వార్ విగ్రహానికి కత్తి, డాలు అమర్చి ఉంటాయి. భగవంతునికే మంగళాశాసనం చేసిన పెరియాళ్వార్ ప్రతిమకు చేతిలో తాళాలు, పూలబుట్ట ఉంటాయి. భగవంతుడికి పుష్ప కైంకర్యం చేసిన విప్రనారాయణుడనే ఆళ్వారు చేతికి కూడా ఒక పూలబుట్ట అమర్చుతారు. భగవంతుని సాయుజ్యం పొందిన ఆండాళ్ తల్లి విగ్రహాన్ని సాక్షాత్తూ భూదేవి రూపంలో... సర్వాభరణయుక్తంగా ఉత్తమ నవ నవతాళంలో చేస్తారు. తురుప్పాణి ఆళ్వార్ చేతిలో వీణ ఉంటుంది. తిరుమంగై ఆళ్వార్ చేతిలో బల్లెం ఉంటాయి.
తిరుమలలో హుండీకి ఎదురుగా ఉండే తాళ్ళపాక వారి సంకీర్తనా భాండాగారం పైన ఉండే శ్రీ అన్నమయ్య, పెద్ద తిరుమలాచార్యుల విగ్రహాలు తంబురాలు పట్టుకొని యక్షుల మాదిరిగా ఉంటాయి. తిరుజ్ఞాన సంబంధర్ అనే నాయనార్ చేతిలో సంగీత సాధనమైన తాళాలు ధరించి ఉంటారు. కన్నప్ప విగ్రహం తన కంటిని పొడుచుకుంటున్నట్టు ఉంటుంది. శివాలయాలను శుభ్రపరిచే కైంకర్యంలో ఉండే తిరునావుక్కరుసు నాయనార్ చేతిలో కుంచెను పోలిన దండాన్ని అమర్చుతారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయినప్పటికీ... తన ఇద్దరు భార్యలతో కలిసి ఉన్న తన విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తుల్లా అంజలి ముద్రతో ప్రతిష్ఠించుకున్నారు. మధుర నాయక రాజుల విగ్రహాలను మీనాక్షి దేవాలయంలో చూడవచ్చు. తంజావూరు ఆలయంలో రాజరాజ చోళుని విగ్రహం సర్వాభరణాలతో... పొడవాటి కత్తిని ధరించి ఉంటుంది.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి, 9440525788
ఇవి కూడా చదవండి..
సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..