Share News

ఇద్దరు దూతలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:45 AM

తన అనంతరం తన సందేశాన్ని లోకానికి వినిపించడానికి కొందరిని ఏసు క్రీస్తు ఎంపిక చేసుకున్నాడు. వారిని వివిధ ప్రదేశాలకు పంపాడు. వారే అపోస్తలులు. గ్రీకు భాషలో ‘అపోస్తలుడు’ అంటే...

ఇద్దరు దూతలు

దైవమార్గం

తన అనంతరం తన సందేశాన్ని లోకానికి వినిపించడానికి కొందరిని ఏసు క్రీస్తు ఎంపిక చేసుకున్నాడు. వారిని వివిధ ప్రదేశాలకు పంపాడు. వారే అపోస్తలులు. గ్రీకు భాషలో ‘అపోస్తలుడు’ అంటే ‘పంపినవాడు’, ‘దూత’ అని అర్థం. ఏసు శిష్యులందరూ అపోస్తలులే. కానీ అపోస్తలునిగా ఉండడానికి శిష్యుడే కాదని నిరూపించిన వ్యక్తి ఒకరున్నారు. అతను పౌలు. అపోస్తలులందరిలో పౌలు, పేతురు వయసులో పెద్దవారు. వీరిద్దరికీ కొన్ని సామ్యాలు ఉన్నాయి, తేడాలూ ఉన్నాయి. కానీ ఇద్దరు దూతల లక్ష్యం ఒక్కటే... ఏసు సువార్తను ప్రకటించడం.

పేతురు అసలు పేరు సీమోను. అతను క్రీస్తుతో కలిసి నడిచిన వ్యక్తి. గలలియా తీర నివాసి. ప్రభువు అతణ్ణి ‘సీమోను పేతురు’ అని పిలిచేవాడు. పేతురు యూదుడు. అతను క్రెస్త్రవానికి పునాదిరాయిలా నిలబడ్డాడు. చేపలు పట్టే క్రమంలో... ఏసు ఆహ్వానం మేరకు సముద్రతీరంలో ఆయనను వెంబడించాడు. అతను అచ్చమైన యూదుడు... పేతురు. క్రీస్తుకు అనుచరుడిగా... ప్రజలను క్రీస్తు బోధలవైపు మళ్ళించినవాడు. అతను గలగలా పారే సెలయేరు. క్రీస్తు కోసం అతను కారాగారానికి వెళ్ళాడు.

పౌలు అసలు పేరు సౌలు. ఏసు గురించి చాలాసార్లు విన్నా ఆయనకు ఎప్పుడూ తారసపడలేదు. కానీ అప్పటికి పరమాణువులా ఉన్న క్రైస్తవాన్ని పరలోకమంత ఎత్తుగా, సువిశాలంగా విస్తృతపరచి, ఔన్నత్యం కల్పించినవాడు పౌలు. దమస్సు మార్గంలో క్రీస్తు భక్తులను పట్టుకొని కొట్టే హింసాత్మక వైఖరి కలిగిన అతను... చివరకు దేవుని పిలుపు అందుకున్నాడు. అతను యూదుడు కాదు... పార్శీయుడు. స్వచ్ఛమైన యోధుడు. అతను కొండనుంచి ఉబికి వస్తున్న, ఎవరూ ఆపలేని ఒక మహా జలపాతం. పేతురు చేసినవి రెండు రచనలు కాగా... పౌలు దాదాపు 27 రచనలు చేశాడు.

పౌలు క్రీస్తుకోసం మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులోనే రచనలు చేశాడు. పేతురు, పౌలు... వీరిద్దరూ దాదాపు డెబ్భై ఏళ్ళ వయసు వరకూ సువార్తను బోధించారు. మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి తపించిన ఆదర్శమూర్తులుగా వీరు చరిత్రలో నిలిచారు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 10 , 2026 | 04:45 AM