కర్మసాక్షికి మాసానికో పేరు
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:56 AM
మాఘమాసాన్ని సూర్యుడికి ఇష్టమైన మాసంగా పూర్వులు పేర్కొన్నారు. ఈ మాసంలో, ప్రధానంగా ఆదివారం సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయనే విశ్వాసం...
తెలుసుకుందాం
మాఘమాసాన్ని సూర్యుడికి ఇష్టమైన మాసంగా పూర్వులు పేర్కొన్నారు. ఈ మాసంలో, ప్రధానంగా ఆదివారం సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయనే విశ్వాసం ఉంది. సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి. అవి: ధాత, అర్యమా, మిత్ర, అరుణ, ఇంద్ర, వివస్వాన్, త్వష్టా, విష్ణు, అంశు, భగ, పూషా, పర్జన్య. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో... ‘ద్వాదశాదిత్యులు’గా ఆయన సంచరిస్తాడు.
ద్వాదశాదిత్యులను ఏయే మాసంలో ఎలా ధ్యానించాలో వివరించిన శ్లోకాలు శైవాగమంలో ఉన్నాయి.
ధాత: ధాతా కృతస్థలీహేతిర్వాసుకీరథకృన్మునే, పులస్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ, ధాతా శుభస్య మే దాతా భూయో భూయోపి భూయసామ్, రశ్మిజాలసమాశిష్టస్తమస్తోమవినాశనః
భావం: ‘‘ధాత, కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్, పులస్త్య, తుంబురులు అనే ఏడుగురు ‘మధు’ అనే పేరున్న మేష మాసాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. కోటి కిరణాల సమూహంతో... చిమ్మ చీకట్ల గుంపులను నాశనం చేసే ధాతృ నామధేయుడైన సూర్యుడు నాకు మళ్ళీ మళ్ళీ అధికమైన శుభాన్ని ఇచ్చుగాక’’ అని చైత్ర మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
అర్యమా: అర్యమా పులహోథోర్జో ప్రహేతిః పుంజకస్థలీ, నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవం, మేరుశృంగాంతరచరః కమలాకరబాంధవః, ఆర్యమాస్తు సదా భూత్యై భూయస్యై ప్రణతస్య చ
భావం: ‘‘అర్యమ, పులహ, ఊర్జ, ప్రహేతి, పుంజకస్థలి, నారద, కచ్చనీరులనే ఏడుగురు ‘మాధవ మాసం’ అనే పేరున్న వృషభ మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. మేరు పర్వత శిఖరాగ్రంపై సంచరించే, కమలాల బంధువైన అర్యముడనే సూర్యునికి తలవంచి నమస్కరిస్తున్న నాకు అత్యధికమైన సంపదలు లభించుగాక’’ అని వైశాఖ మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
మిత్ర: మిత్రోత్రిః పౌరుషేయోథ తక్షకో మేనకా హాహాః, రథస్వన ఇతి హైతే శుక్లమాసం నయంత్యమీ, నిశానివారణపటురుదయాద్రికృతాశ్రయః మిత్రోస్తు మమ మోదాయ తమస్తోమవినాశనః
భావం: మిత్ర, అత్రి, పౌరుషేయ, తక్షక, మేనక, హాహా, రథస్వనులనే వారు ‘శుక్ల’ అనే పేరున్న మిధున మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. రాత్రిని దూరం చేస్తూ, వెలుగొందుతున్న దేహంతో చీకట్ల సమూహాన్ని నాశనం చేస్తూ ఉదయ పర్వతాన్ని ఆశ్రయించి ఉదయిస్తున్న మిత్రుడనే పేరున్న సూర్యుడు నాకు సంతోషాన్ని ఇచ్చుగాక’’ అని జ్యేష్ట మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
అరుణ: వసిష్టో హ్యరుణో రంభా సహజన్యస్తథా హుహూః, శుకశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ, సూర్యస్యందనమారూఢ అర్చిర్మాలీ ప్రతాపవాన్, కాలభూతః కామరూపో హ్యరుణస్సేవ్యతే మయా
భావం: ‘‘వశిష్ట, అరుణ, రంభ, సహజన్య, హుహూ, శుక, చిత్రస్వనులనే వారు ‘శుచి మాసం’ అనే పేరు గల కర్కాటక మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. రథంపై కూర్చొని, కిరణాల మాలతో ప్రతాపశాలియైున, కాలభూతుడు, కాలస్వరూపుడు అయిన అరుణుడనే సూర్యుణ్ణి నేను సేవిస్తున్నాను’’ అని ఆషాఢ మాసంలో ఈ సూర్యుణ్ణి ధ్యానించాలి.
ఇంద్ర: ఇంద్రో విశ్వావసుశ్శ్వేతా ఇలాపుత్రస్తథాంగిరాః, ప్రమ్లోచా రాక్షసశ్శర్యో నభోమాసం నయంత్యమీ, సహస్రరశ్మిసంవీతమింద్రం వరదమాశ్రయే, శిరసా ప్రణమామ్యద్య శ్రేయోవృద్ధిప్రదాయకం
భావం: ‘‘ఇంద్ర, విశ్వావసు, శ్రోతా, ఇలాపుత్ర, అంగీరస్, ప్రమ్లోచా, రాక్షస, శర్యులనే వారు ‘నభస్’ అనే సింహ మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. వేయి కిరణాలతో కూడిన వరప్రదాయకుడైన ఇంద్రుడనే సూర్యుణ్ణి ఆశ్రయిస్తున్నాను. నాకు శ్రేయస్సును కలిగించే సూర్యుడికి తలవంచి నమస్కరిస్తున్నాను’’ అని శ్రావణ మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
వివస్వాన్: వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో నృగుః. అనుమ్లోచా శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ, జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసమ్, నభోగృహమహాదీపం వివస్వంతం నమామ్యహమ్
భావం: ‘‘వివస్వాన్, ఉగ్రసేన, వ్యాఘ్ర, ఆసారణ, భృగు, అనుమ్లోచా, శంఖపాలులనే వారు ‘నభస్య’ అనే పేరున్న కన్యా మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. జగన్నిర్మాణకర్తగా అన్ని దిక్కులా తన తేజస్సును పంచుతూ, ఆకాశమనే ఇంటిలో పెద్ద దీపమై నిలిచిన వివస్వాన్ సూర్యుడికి నేను నమస్కరిస్తున్నాను’’ అని భాద్రపద మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
త్వష్ట: త్వష్టా ఋచీకో రక్షశ్చ కంబలాఖ్యస్తిలోత్తమా, బ్రహ్మరాతోథ శతజిద్ధృతరాష్ట్ర ఇషంబరః, త్వష్టా శుభాయ మే భూయాచ్ఛిష్టావలినిషేవితః, నానాశిల్పకరో నానాధాతురూపః ప్రభాకరః
భావం: ‘‘త్వష్ట, ఋచీక, రక్షస్, కంబల, తిలోత్తమ, బ్రహ్మరాత, శతజిత్, ధృతరాష్ట్ర, ఇషంబరులనే వారు తులా మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. వీరు మనకు సుఖాన్ని ఇచ్చుగాక. సజ్జన సమూహం సేవలు అందుకుంటూ, అనేక రకాల శిల్పనిర్మాణకర్త అయిన, నానావిధ ధాతు రూపమై ప్రభను కలిగించే త్వష్ట సూర్యుడు నా శుభానికి కారణం అవుగాక’’ అని ఆశ్వయుజ మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
విష్ణు: విష్ణురశ్వతరో రంభా సూర్యవర్ణాశ్చ సత్యజిత్, విశ్వామిత్ర మహాప్రేత ఊర్జమాసం నయంత్యమీ, భానుమండలమధ్యస్థం వేదత్రయనిషేవితమ్, గాయత్రీప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహమ్
భావం: ‘‘విష్ణు, అశ్వతర, రంభ, సూర్యవర్చస్, సత్యజిత్, విశ్వామిత్ర, మహాప్రేతలనే వారు ‘ఊర్జ మాసం’ అనే పేరు గల వృశ్చికమాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. సూర్య మండలం మధ్యలో ఉండి, ఋగ్యజుస్సామములనే మూడు వేదాలతో సేవలందుకుంటూ, గాయత్రీ మంత్రంతో వ్యక్తమవుతున్న విష్ణు సూర్యునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను’’ అని కార్తిక మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
అంశు: అథాంశః కశ్యపస్తార్క్ష్యః ఋతుసేనస్తతోర్వశీ, విద్యుచ్ఛత్రుర్మహాశంఖస్సహోమాసం నయంత్యమీ, సదా విద్రావణరథో జగన్మంగళదీపకః, మునీంద్రనివహస్స్తుత్యో భూతిదోంశుర్భవేన్మమ
భావం: ‘‘అంశ, కాశ్యప, తార్క్ష్య, ఋతుసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్రు, మహాశంఖులనే వారు ‘సహస్’ అనే పేరున్న ధనుర్మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఎల్లప్పుడూ రథాన్ని నడుపుతూ, జగత్తుకు మంగళకరమైన దీపాన్నిస్తూ, ఋషిశ్రేష్ఠుల సమూహం నుంచి స్తుతులను అందుకొనే అంశ సూర్యుడు నాకు సంపదలను ఇచ్చుగాక’’ అని మార్గశిర మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
భగ: భగస్ఫూర్జోరిష్టనేమిరూర్ణ ఆయుశ్చ పంచమః, కర్కోటకః పూర్వచిత్తిః పౌషమాసం నయంత్యమీ, తిథిమాసృతూనాం చ వత్సరాయనయోరపి, ఘటికానాం చ యః కర్తా భగో భాగ్యప్రదోస్తుమే
భావం: భగ, స్ఫూర్జ, అరిష్టనేమి, ఊర్ణ, ఆయుస్, కర్కోటక, పూర్వ చిత్తులనే వీరు ‘పౌష మాసం’ అనే పేరున్న మకర మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. తిథి, మాస, ఋతు, వర్ష, అయన, ఘటికాలనే వాటికి కారకుడైన భగ సూర్యుడు నాకు భాగ్యాలను ఇచ్చుగాక’’ అని పుష్య మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి..
పూష: పూషా ధనంజయో ధాతా సుషేణస్సురుచిస్తథా, ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ, పూషా తోషాయ మే భూయాత్సర్వపాపాపనుత్తయే, సహస్రకరసంవీతస్సమస్తాశాంతరాంతరః
భావం: పూషా, ధనంజయ, ధాత, సుషేణ, సురుచి, ఘృతాచి, గౌతములనే వారు ‘తపో మాసం’ అనే కుంభ మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. సహస్ర కిరణాలతో అన్ని దిక్కులా వ్యాపించిన పూషా సూర్యుడు మన పాపాలన్నిటినీ దూరం చేసి, సంతోషాన్ని ఇచ్చుగాక’’ అని మాఘ మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
పర్జన్య: క్రతుర్వర్చా భరద్వాజః పర్జన్యస్సేనచిత్తథా, విశ్వశ్చైరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ, ప్రపంచం ప్రతపన్ భూయో వృష్టిభిర్హాదయస్పునః, జగదానందజనకః పర్జన్యః పూజ్యతే మయా
భావం: క్రతు, వర్చస్, భరద్వాజ, పర్జన్య, సేనచిత్, విశ్వ, ఐరావతులనే వారు ‘తపస్య’ అనే పేరున్న మీన మాసాన్ని ముందుకు తీసుకువెళ్తారు. తన కిరణాలతో ప్రపంచాన్ని కాలుస్తూ, అధిక వర్షాలు కురిపించి లోకాన్ని సంతోషపరుస్తూ, జగత్తుకు ఆనందాన్ని ఇచ్చే పర్జన్య సూర్యుణ్ణి నేను పూజిస్తున్నాను’’ అని ఫాల్గుణ మాసంలో సూర్యుణ్ణి ధ్యానించాలి.
డి.యన్.వి. ప్రసాద్, స్థపతి, 9440525788
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు