Sankranti Recipes: సంక్రాంతి రుచులు..!
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:44 AM
సంక్రాంతి పండక్కి మనం అరిసెలు, సకినాలు, నువ్వుల ఉండలు లాంటి ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. మనలాగే ఇతర రాష్ట్రాలవారు కూడా ప్రత్యేకమైన సంప్రదాయ వంటలు చేస్తుంటారు. వాటిలో కొన్ని మీకోసం...
సంక్రాంతి పండక్కి మనం అరిసెలు, సకినాలు, నువ్వుల ఉండలు లాంటి ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. మనలాగే ఇతర రాష్ట్రాలవారు కూడా ప్రత్యేకమైన సంప్రదాయ వంటలు చేస్తుంటారు. వాటిలో కొన్ని మీకోసం...

దాల్ బాఫ్లా (మధ్యప్రదేశ్)
కావాల్సిన పదార్థాలు
కంది పప్పు- ముప్పావు కప్పు, పసుపు- ఒక చెంచా, ఉప్పు- తగినంత, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- అర కప్పు, గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు, బొంబాయి రవ్వ- అర కప్పు, బేకింగ్ సోడా- అర చెంచా, చక్కెర- అర చెంచా, పెరుగు- అర కప్పు, నెయ్యి- పది చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, వాము- ఒక చెంచా, ఇంగువ- పావు చెంచా, అల్లం తరుగు- ఒక చెంచా, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, పచ్చి మిర్చి- రెండు, కారం- అర చెంచా, నిమ్మ రసం- ఒక చెంచా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
ఒక గిన్నెలో కంది పప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నిండా నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానిన కందిపప్పు, అర చెంచా పసుపు, తగినంత ఉప్పు, టమాటా ముక్కలు వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. అయిదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ మీద నుంచి దించాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి పప్పును గరిటెతో మెత్తగా మెదపాలి. స్టవ్ మీద చిన్న గిన్నెపెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో ఒక చెంచా జీలకర్ర, ఇంగువ, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు, కారం వేసి.. ఈ పోపు మిశ్రమాన్ని పప్పులో కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపి మూతపెట్టి ఉంచాలి.
వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, చక్కెర, పెరుగు వేసి చెంచాతో బాగా కలపాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో ఒక చెంచా జీలకర్ర, అర చెంచా పసుపు, వాము వేసి అవి వేగిన తరువాత గోధుమపిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఆపైన పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి. దీనిపైన తడిగుడ్డ కప్పి పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత పిండిని చిన్న ముద్దలుగా చేసి మధ్యలో నొక్కి బిళ్లల మాదిరి చేయాలి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి సగానికిపైగా నీళ్లు పోసి మరిగించి ఆపైన పిండి బిళ్లలు వేసి పావుగంటసేపు ఉడికించాలి. బిళ్లలు పైకి తేలిన తరువాత వాటిని పళ్ళెంలోకి తీయాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. తరువాత ఉడికించిన పిండి బిళ్లలు పరిచి పైన మూత పెట్టాలి. వీటిని చిన్న మంట మీద రెండువైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారుచేసిన బాఫ్లాలను నెయ్యి, పప్పుతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

ఆటెకి పిన్ని (పంజాబ్)
చీకావాల్సిన పదార్థాలు
బాదాం- 50 గ్రా, జీడిపప్పు- 50 గ్రా, వాల్‌నట్స్- 50 గ్రా, కిస్‌మిస్‌లు- 50 గ్రా, గోధుమ పిండి- 300 గ్రా, నెయ్యి- 200 గ్రా, గోంద్- 100 గ్రా, కర్బూజ గింజలు- 50 గ్రా, శొంఠి- 10 గ్రా, యాలకుల పొడి- 5 గ్రా, చక్కెర పొడి- 200 గ్రా
తయారీ విధానం
గోంద్ పలుకులను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. బ్లెండర్‌లో బాదాం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్‌మిస్‌లు వేసి కచ్చాపచ్చాగా బ్లెండ్ చేయాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నెయ్యి, గోధుమ పిండి వేసి బాగా కలుపుతూ చిన్న మంట మీద దోరగా వేయించాలి.
తరువాత గోంద్ పొడి, కర్బూజ గింజలు వేసి కలపాలి. ఆపైన డ్రై ఫ్రూట్స్ పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వేసి కలిపి అయిదు నిమిషాలు వేయించి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అందులో చక్కెర పొడి వేసి కలిపి లడ్డూలు చుట్టాలి. ఇలా తయారుచేసిన ఆటె కి పిన్ని పది రోజుల వరకు నిల్వ ఉంటుంది.

గిలా పిఠా (అసోం)
కావాల్సిన పదార్థాలు
బియ్యప్పిండి- ఒక కప్పు, బెల్లం తురుం- ముప్పావు కప్పు, మంచినీళ్లు- పావు కప్పు, బేకింగ్ సోడా- చిటికెడు, యాలకులు- మూడు, నెయ్యి- ఒక చెంచా, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బెల్లం తురుం వేసి మంచినీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తరువాత బేకింగ్ సోడా వేసి కలిపి మరో వెడల్పాటి గిన్నెలోకి వడబోయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా మెత్తగా కలపాలి. అరచేతికి కొద్దిగా నూనె రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గుండ్రని బిళ్లల్లా చేయాలి. ఈ బిళ్లలను ఒక పళ్లెంలో పేర్చి అవి ఆరిపోకుండా పైన తడిగుడ్డ కప్పాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. అందులో కొన్ని కొన్ని బిళ్లలు వేస్తూ చిన్న మంట మీద రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇవి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. తింటుంటే అరిసెలను గుర్తుకు తెస్తాయి.