ట్రెండింగ్‌లో ఉన్న ఎంబీఏ స్పెషలైజేషన్లు
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:14 AM
మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ)కి సంబంధించి ఇటీవలి కాలంలో కొన్ని స్పెషలైజేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఎంబీఏలో చేరేందుకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ కొద్ది రోజుల్లో...
మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ)కి సంబంధించి ఇటీవలి కాలంలో కొన్ని స్పెషలైజేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఎంబీఏలో చేరేందుకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ కొద్ది రోజుల్లో చేపట్టనున్న నేపథ్యంలో భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కల్పనా సాహు స్పెషలైజేషన్స్ విషయంలో ఏమి చెబుతున్నారో చూద్దాం.
సమకాలీన బిజినెస్ వాతావరణంలో సరైన ఉపాధే కాదు, కెరీర్‌పరంగా పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఎంబీఏలో స్పెషలైజేషన్ ఎంపిక చేసుకోవాలి. నేటి పరిశ్రమల్లోని అవసరాలకు అనుగుణంగా సంబంధిత మేనేజీరియల్ పరిజ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవవనరులు అవసరం అవుతున్నారు.
బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. డేటా నిర్దేశిత నిర్ణయాల వైపు నేటి సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ట్రెండ్స్ ఫోర్‌కాస్టింగ్ నుంచి వివిధ కార్యకలాపాల గరిష్ఠీకరణ, మెరుగైన వ్యూహాత్మక ప్లానింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. ఈ విషయాలపై పట్టు ఉన్న అభ్యర్థులకు పరిశ్రమ నుంచి మంచి వేతనాలతో ఆపర్లు లభిస్తున్నాయి.
ఫైనాన్స్ మరొకటి. ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్‌టెక్)తో కలగలిసిన నేపథ్యంలో దీనికి డిమాండ్ పెరిగింది. డిజిటల్ పేమెంట్స్, బ్లాక్‌చెయిన్, ఆటోమేటెడ్ ఇన్వె్‌స్టమెంట్ సిస్టమ్స్‌తో ఫైనాన్షియల్ రంగంలో చాలా మార్పులు త్వరిగతిన చోటుచేసుకున్నాయి. దాంతో ఈ రంగంలో సరికొత్త జాబ్స్ వస్తున్నాయి. ఆ క్రమంలో ఫైనాన్షియల్ నైపుణ్యానికి తోడు టెక్నాలజీపై పట్టు ఉన్న అభ్యర్థులు అవసరమవుతున్నారు.
మార్కెటింగ్‌లో డిజిటలీకరణ ఆరంభమై చాన్నాళ్ళయింది. ఇవాల్టి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. సోషల్ మీడియా స్ట్రాటజీ, బ్రాండ్ మేనేజ్‌మెంట్, కన్జూమర్ అనలిటిక్స్ తెలియాలి. ఆన్‌లైన్ వ్యాపారం ఎక్కువైంది. కస్టమర్ కేంద్రీకృత విధానాలూ పెరిగాయి. వీటన్నింటిపై అవగాహన, ప్రాక్టికల్ అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే మార్కెటింగ్ రంగంలో నేడు రాణించగలరన్నది వాస్తవం.
గ్లోబలైజేషన్, ఈ కామర్స్‌లో వృద్ధి, లాజిస్టిక్స్ - ఇన్వెంటరీ సిస్టమ్స్ సమర్థ నిర్వహణ అవసరమైన నేపథ్యంలో ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌కూ ప్రాధాన్యం పెరిగింది. కొవిడ్ సహా అంతర్జాతీయంగా ఇటీవలి చోటుచేసుకున్న సంక్షోభాల ఫలితంగా దీని అవసరం మరింతగా ఎక్కువైంది. మాన్యుఫాక్చరింగ్, రిటైల్ రంగాల్లో ఈ కామర్స్ విస్తృతి పెరిగింది. అలాగే లాజిస్టిక్స్ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఈ స్పెషలైజేషన్ ప్రత్యేకతకు దారితీసింది.
సంప్రదాయ పరిధిలోకే వచ్చే మరొక స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్. టాలెంట్ అనలిటిక్స్, ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్, లీడర్‌షిప్ డెవల్‌పమెంట్, ఆర్గనైజేషనల్ కల్చర్, పీపుల్ సెంట్రిక్ వర్క్‌ప్లేసుల నిర్వహణ క్లిష్టంగా మారాయి. నేటి హెచ్‌ఆర్ పర్సన్‌కు ఈ నైపుణ్యాలు, సంబంధిత పరిజ్ఞానం చాలా అవసరమవుతోంది. సపోర్ట్ ఫంక్షన్‌గా ఉన్న హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. నాలెడ్జ్ కేంద్రీకృత సంస్థల్లో ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ కల్చర్, లీడర్‌షిప్ డెవల్‌పమెంట్‌కు ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఉత్పాదకత మెరుగుదల సాధ్యమవుతుంది. ఒకప్పటిలా అటెండెన్స్, సెలవులు, జీతభత్యాల నిర్వహణకే పర్సనల్ విభాగం పరిమితం కావడం లేదు.
వీటికి తోడు మరికొన్ని స్పెషలైజేషన్లకు సైతం ప్రాధాన్యం లభిస్తోంది. ఆటోమేషన్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ నిర్దేశిత వ్యూహాలను పరిశ్రమలు అనువర్తించుకుంటున్న నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ కూడా ముఖ్యంగా మారింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్స్ తెలిసిన మేనేజర్లు మాత్రమే టెక్నాలజీ, బిజినెస్ మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చగలుగుతారు.
ఆంత్రప్రెన్యూర్‌షిప్ - ఇన్నోవేషన్ కూడా ఎదుగుతోంది. సొంతంగా వెంచర్లను ఆరంభించే వ్యక్తులు పెరగుతున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ పెరుగుతోంది. క్రియేటివిటీకి తోడు రిస్క్ తీసుకోవడం, ఇన్నోవేషన్ ఇక్కడ ప్రధానం.
సస్టయినబుల్ ప్రాక్టీసె్‌సకు ప్రాధాన్యం పెరిగింది. దరిమిలా సస్టయినబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ కూడా ముఖ్యమైన స్పెషలైజేషన్‌గా మారింది. సామాజిక అంచనాలకుతోడు ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్(ఈఎ్‌సజీ) ప్రమాణాలను అందుకోవాల్సిన అవసరం కలగటమే ఇందుకు కారణం.
ఇవే కాకుండా హెల్త్‌కేర్, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా ప్రత్యేక రంగాలుగా వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచీకరణతో ఎదురయ్యే సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మానవవనరులకూ మంచి డిమాండ్ ఏర్పడుతోందన్న విషయాన్ని గ్రహించాలి.
టెక్నాలజీ విస్తృతి ఫలితంగా వివిధ సంస్థల ప్రాధాన్యాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్స్(ఫిన్‌టెక్ సహా), మార్కెటింగ్(ప్రత్యేకించి డిజిటల్ మార్కెటింగ్), ఆపరేషన్స్ అండ్ సప్లయి చైన్ మేనేజ్‌మెంట్, ఏఐ మేనేజ్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ సంబంధిత స్పెషలైజేషన్లకు నేడు ఎనలేని డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆసక్తులకు తోడు జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండ్, పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ చదివే విద్యార్థులు స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..