Share News

కాలం సాక్షిగా

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:27 AM

కాలం మనకు కనిపించదు. కానీ అది ఆగదు, వెనుతిరగదు. అది మన నవ్వుల్ని చూస్తూ పోతుంది. మన కన్నీళ్ళను లెక్క చెయ్యదు. మనల్ని అది పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. మనిషి కాలాన్ని...

కాలం సాక్షిగా

సందేశం

కాలం మనకు కనిపించదు. కానీ అది ఆగదు, వెనుతిరగదు. అది మన నవ్వుల్ని చూస్తూ పోతుంది. మన కన్నీళ్ళను లెక్క చెయ్యదు. మనల్ని అది పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. మనిషి కాలాన్ని గడియారంలో చూస్తాడు. కానీ కాలం మనిషిని జీవితంతో కొలుస్తుంది. విశ్వాసంతో ఉండడం, సత్కార్యాలు, సత్యోపదేశం, సహనబోధ చేసేవారు తప్ప మిగిలిన మానవులందరూ కాలం సాక్షిగా నష్టపోతారని దివ్య ఖుర్‌ఆన్‌ గ్రంథం హెచ్చరించింది. మనం చేసేవాటికి కాలం సాక్షి. ఇక్కడ నష్టం అంటే ఇహలోకానికి చెందిన ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, బంధుత్వపరమైన, కీర్తిప్రతిష్టలు, ఆస్తిపాస్తులకు సంబంధించిన నష్టం కాదు, అది పరలోక నష్టం. మరణానంతర జీవితానికి సంబంధించిన నష్టం.

విశ్వాసం అంటే దైవం పైనా, దివ్య గ్రంథాల పైన ఉండే సంపూర్ణ విశ్వాసం. ఇది జీవితంలోని అన్ని అంశాల్లో ప్రతిఫలించాలి. అలాగే విశ్వాసంతో పాటు మనిషి ఎల్లప్పుడు సత్కార్యాలు చేయడం ముఖ్యం. దివ్య ఖుర్‌ఆన్‌లో ధర్మం, అధర్మం, ఆజ్ఞలు, అగోచరాలు, గత చరిత్ర అనే అయిదు అంశాలు ఉన్నాయి. దేని విషయంలో ఎలా వ్యవహరించాలనే విచక్షణతో వ్యవహరించడమే సత్కార్యం. సత్యోపదేశం అంటే... ఇహ, పర జీవితాలకు ఉపయుక్తమైన మాటలను బోధించడం. సహనబోధ అంటే... సహనంగా ఉండాలని చెప్పడం. సత్యోపదేశం చేసిన వ్యక్తి మీద కొన్ని సందర్భాల్లో కష్టాలు విరుచుకుపడతాయి. సంపాదనలో వెలితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సహనం అత్యవసరం అవుతుంది. కాబట్టి సహనాన్ని బోధించాలి.

‘‘మీకు పలు రకాల పరీక్షలు ఎదురవుతాయి. ఆ స్థితిలో మీరు సహనం, నమాజ్‌ల ద్వారా సహాయం పొందండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. కాబట్టి మనిషి తన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా... నష్టం నుంచి కాపాడుకోవడానికి దైవం పట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశాల హృదయంతో సత్కార్యాలు ఆచరించాలి. అందరి మేలు కోరుతూ సత్యోపదేశం చేయాలి. పరస్పర సహనాన్ని బోధించే లక్షణాన్ని కలిగి ఉండాలి. వీటన్నిటినీ మనలో కలిగించాలని దైవాన్ని ప్రార్థిద్దాం.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి..

సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..

కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..

Updated Date - Jan 30 , 2026 | 05:27 AM