సరళమైన జీవితానికి మూడు సూత్రాలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:01 AM
మానవులుగా మనం దాదాపు ఎల్లప్పడూ మూడు కార్యకలాపాల్లో ఏదో ఒక దానిలో నిమగ్నమై ఉంటాం. అవి: ఆలోచన, అర్థం చేసుకోవడం, పని చేయడం. గాఢ నిద్రలో తప్ప... మన మనస్సులు నిరంతరం...
యోగా
మానవులుగా మనం దాదాపు ఎల్లప్పడూ మూడు కార్యకలాపాల్లో ఏదో ఒక దానిలో నిమగ్నమై ఉంటాం. అవి: ఆలోచన, అర్థం చేసుకోవడం, పని చేయడం. గాఢ నిద్రలో తప్ప... మన మనస్సులు నిరంతరం అనుభవాలను విశ్లేషిస్తూ, వాటిని వ్యాఖ్యానిస్తూ, కార్యాచరణలోకి అనువదిస్తూ ఉంటాయి. ఈ మూడు శక్తులు వేరువేరుగా ఉండవు. అవి నిరంతరం పరస్పర ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ‘సరైన ఆలోచన, సరైన అవగాహన, నిజాయితీతో కూడిన వైఖరి జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఎందుకంటే మనం చెత్తను పోగు చేయడం మానేస్తాం’’ అని నా పూజ్య గురువు, ‘హార్ట్‌ఫుల్‌నెస్’ గ్లోబల్ గైడ్ ఒకసారి వ్యాఖ్యానించారు. ఈ వాక్యంలో ఒక పరిపూర్ణ జీవన సత్యం ఉంది.
వివేకమైన ఆలోచన
ఆలోచించడం అనేది మనసుకు ఉన్న అత్యంత చురుకైన సామర్థ్యం. అది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. సరైన ఆలోచన అంటే కేవలం సానుకూలమైన ఆలోచన మాత్రమే కాదు... వాస్తవాలు, స్పష్టత, సమతుల్యత, అందరి క్షేమం కోరుతూ ఆలోచించడం. ఛాతీ నొప్పితో బాధపడే రోగులను ఒక హృద్రోగ వైద్య నిపుణుడిగా నేను తరచుగా చూస్తూ ఉంటాను. ఊహాగానాల మీద ఆధారపడే వైద్యుడు వెంటనే అది గుండె పోటు అని నిర్ధారించి, రోగిని అనవసరమైన ఆందోళనకు, పరీక్షలకు గురి చెయ్యవచ్చు. మరోవైపు... సరైన ఆలోచన విశాల దృక్పథంతో మొదలవుతుంది. అది రోగి చరిత్రను జాగ్రత్తగా సేకరిస్తుంది. రోగిని నిష్పక్షపాతంగా పరిక్షిస్తుంది. ఆ పరీక్షల ఫలితాలను తార్కికంగా విశ్లేషిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. రోగిని, వైద్యుణ్ణి... వారిద్దరూ నివారించుకోగలిగే తప్పుల నుంచి సరైన ఆలోచన కాపాడుతుంది. ఇదే సూత్రం వైద్య రంగానికి ఆవల కూడా ఉంటుంది. నిత్య జీవితంలో, అనేక అపార్థాలు వాస్తవాల వల్ల కాకుండా... ఊహాగానాలు, పక్షపాతం లేదా భావోద్వేగాల మీద ఆధారపడిన తప్పుడు ఆలోచనల వల్ల తలెత్తుతాయి. కాబట్టి సరైన ఆలోచన వివేకవంతమైన జీవనానికి పునాది.
సరైన అవగాహన
సరైన ఆలోచన సమాచారాన్ని సేకరిస్తుంది. సరైన అవగాహన దానికి అర్థాన్ని ఇస్తుంది. ప్రతి వ్యాధికి ప్రయోగశాల నివేదికలకు మించిన కథ ఒకటి ఉంటుందని వైద్యశాస్త్రం మాకు బోధించింది. ఇద్దరు రోగులకు ఒకే రకమైన కరోనరీ బ్లాకేజ్‌లు ఉండవచ్చు. కానీ వారి భయాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత ప్రాధాన్యతలు పూర్తి భిన్నంగా ఉండవచ్చు. సరైన అవగాహన ఉన్న వైద్యుడు కేవలం యాంజియోగ్రామ్‌కు చికిత్స చెయ్యరు, వ్యక్తికి చికిత్స చేస్తారు. ఉదాహరణకు రోగి తాలూకు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోకుండా... సాంకేతికంగా పరిపూర్ణమైన చికిత్సా విధానాన్ని సిఫార్సు చెయ్యడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. శాస్త్రీయ ఆధారాలను కరుణ, నైతిక విలువలు, వ్యక్తిగత పరిస్థితులతో సమతుల్యం చెయ్యడానికి సరైన అవగాహన వైద్యుడికి వీలు కల్పిస్తుంది. అది జ్ఞానాన్ని వివేకంగా మారుస్తుంది. అదే విధంగా జీవితంలో సరైన అవగాహన... వ్యక్తుల్ని వారి మాటలు ప్రవర్తనలకు అతీతంగా అభినందించడానికి మనకు సాయపడుతుంది.
వైఖరిలో నిజాయితీ
సరైన ఆలోచన, సరైన అవగాహన మనసును సిద్ధం చేస్తే... నిజాయితీతో కూడిన వైఖరి మన ప్రతి చర్యనూ తీర్చిదిద్దుతుంది. నిజాయితీతో కూడిన వైఖరి అద్భుతమైన అంతర్గత స్వేచ్ఛకు దోహదం చేస్తుంది. ఆ తరువాత... గోప్యమైన ఉద్దేశాలను కానీ, రాజీపడిన నిర్ణయాలను కానీ సమర్ధించుకోవాల్సిన అవసరం ఉండదు. సమగ్రతే మార్గదర్శక సూత్రంగా మారడం వల్ల పని తేలిక అవుతుంది. ‘చెత్తను పోగు చేయవద్దు’ అని చెప్పడంలో మా గురువు ఉద్దేశం ఇదేనేమో!
నిజమైన రహస్యం
సరైన ఆలోచన... వాస్తవాన్ని మనం స్పష్టంగా గ్రహించేలా చేస్తుంది. సరైన అవగాహన... వాస్తవాన్ని వివేకంగా వ్యాఖ్యానించడానికి మనకు సాయపడుతుంది. నిజాయితీతో కూడిన వైఖరి మన ప్రతిస్పందన మన మనస్సాక్షికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. ఈ మూడు సూత్రాలు కలిసినప్పుడు... జీవితం సరళంగా మారుతుంది. నిర్ణయాలు తేలిక అవుతాయి. సంబంధాలు ఆరోగ్యకరంగా, పని అర్థవంతంగా మారుతాయి. అనవసరమైన భారాలను మనసు క్రమంగా వదిలించుకుంటుంది. హృదయం తేలికతనాన్ని అనుభవిస్తుంది. బహుశా ఆనందమయమైన జీవితం తాలూకు నిజమైన రహస్యం... సవాళ్ళు లేకపోవడం కాదు... తప్పుడు ఆలోచన, దోషపూరితమైన అవగాహన, అప్రమాణికమైన చర్యల ద్వారా అంతర్గతంగా పోగైన చెత్త లేకపోవడం. సరైన, ఆలోచన, సరైన అవగాహన, నిజాయితీతో కూడిన వైఖరిని పెంపొందించుకుంటే... మనం వృత్తి నిపుణులుగా మాత్రమే కాదు... ఉత్తమ మానవులుగా కూడా ఎదుగుతాం.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!