Share News

ఆ తేజస్సే జగానికి ఆధారం

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:31 AM

సమస్త సృష్టికి ఆధారభూతుడు సూర్యభగవానుడు. ఆయన సముద్రాలలోని నీటిని తన ఉష్ణోగ్రతతో ఆవిరిగా మార్చి, మేఘాలను తయారు చేసి, వర్షాలు కురిసేలా చేస్తాడు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా...

ఆ తేజస్సే జగానికి ఆధారం

సహజయోగ

సమస్త సృష్టికి ఆధారభూతుడు సూర్యభగవానుడు. ఆయన సముద్రాలలోని నీటిని తన ఉష్ణోగ్రతతో ఆవిరిగా మార్చి, మేఘాలను తయారు చేసి, వర్షాలు కురిసేలా చేస్తాడు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పంటలు సస్యశ్యామలంగా పండేటట్టు చేసి, మనకు పోషణ అందిస్తాడు. సూర్యుడిలో ఉన్న మరో గొప్ప గుణం ఏమిటంటే... తను నిరంతరం మండుతూ సమస్త విశ్వానికి మేలు చేకూరుస్తాడు. ఇతరులకు ఆనందం కలిగిస్తాడు. ఇదంతా చేసేది తానేనని అనుకోకుండానే సమస్తం నిర్వహిస్తాడు. ఈ గుణాలను మనలో పెంపొందించుకుంటే అహంకారానికి తావు ఉండదు.

కృతజ్ఞతలు తెలిపేందుకే...

మన దేశంలో మాఘ మాసంలో శుద్ధ సప్తమి రోజున... సూర్యభగవానుడి జయంతిని జరుపుకొంటాం. దాన్ని ‘రథ సప్తమి’ అని పిలుస్తారు. ఇది ఆ మాసంలో ఏడవరోజు. సూర్యుడు తన ఏడు శక్తులతో లేదా ఏడు రంగులతో ఒక పెద్ద రథంపై ప్రయాణిస్తాడని పూర్వులు వర్ణించారు. సూర్యుణ్ణి సూర్య నారాయణుడిగా పూజించడం మన సంప్రదాయం. జనవరి నెలలో సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకూ దక్షిణ దిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు... తన దిశను మార్చుకొని ఉత్తర దిశలో సంచరించడం మొదలుపెడతాడు. సూర్యుడి గమనం మారడం వల్ల... వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో మనం సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే సూర్యుడి అనుగ్రహం లేకపోతే మానవాళికి మనుగడే లేదు.


సూర్యనాడి సమతుల్యత కోసం...

ఓం భాస్కరాయ విద్మహే, దివాకరాయ ధీమహి/ తన్నోసూర్యః ప్రచోదయాత్‌... అంటే ‘‘సూర్య భగవానుడి ప్రకాశాన్ని, తేజస్సును ధ్యానిస్తున్నాం. ఆ భగవంతుని తేజస్సు మన బుద్ధిని సన్మార్గంలో నడిపించు గాక’’ అని అర్థం. సూర్యుడి ప్రభావం మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ మీద కూడా ఉంటుంది. మనలో ఎడమ వైపు ఇడానాడి...అంటే చంద్రనాడి, కుడివైపు పింగళనాడి... అంటే సూర్యనాడి ఉంటాయి. సూర్యనాడి క్రియాశక్తిని, చంద్రనాడి ఇచ్ఛాశక్తిని సూచిస్తాయి. ఎప్పుడైతే మనం శక్తికి మించిన పని చేస్తామో లేదా అతిగా ఆలోచిస్తామో అప్పుడు శరీరంలో ఉష్ణం ఎక్కువై... సూర్యనాడి (పింగళనాడి) బలహీనమవుతుంది.మనలోని పింగళ నాడి లేక సూర్య నాడి అతిగా వేడెక్కినప్పుడు మనం కుడి పార్శ్వం అసమతుల్యత వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతాం. సహజయోగ సాధన ద్వారా కుడి పార్శ్వం లోని అధిక వేడిమిని మనం అదుపులోనికి తీసుకురాగలం. అధిక వేడిమి నుంచి ఈ సూర్య నాడిని సమతుల్య స్థితికి తీసుకురావాలంటే శ్రీ సూర్య దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Also Read:

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

Updated Date - Jan 23 , 2026 | 03:31 AM