The Nest Acid Attack Survivors: వారి కోసం... ఒక చిన్న ప్రయత్నం
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:45 AM
‘‘యాసిడ్ దాడిలో బాధితులైన మహిళలు శారీరకంగా ఎంతో బాధ అనుభవిస్తారు. అయితే, తమ రూపం వికృతంగా మారిందనే వేదన... శారీరకమైన బాధకన్నా పెద్ద నరకం. తమను తాము అద్దంలో చూసుకోవడానికి కూడా వారు...
అతివల అందాన్ని రెట్టింపు చేసే బ్యూటీ సెలూన్లు ప్రతి చోటా ఉన్నాయి. కానీ ‘ది నెస్ట్’ అన్నిటికన్నా విలక్షణం. యాసిడ్ దాడి బాధితులకు అక్కడ ప్రత్యేక సౌందర్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ‘‘ఇది బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిన్న ప్రయత్నం’’ అంటున్నారు దాని వ్యవస్థాపకురాలైన అడ్వకేట్ హరితా మెహతా.
‘‘యాసిడ్ దాడిలో బాధితులైన మహిళలు శారీరకంగా ఎంతో బాధ అనుభవిస్తారు. అయితే, తమ రూపం వికృతంగా మారిందనే వేదన... శారీరకమైన బాధకన్నా పెద్ద నరకం. తమను తాము అద్దంలో చూసుకోవడానికి కూడా వారు భయపడుతూ ఉంటారు. వీధుల్లోకి వచ్చి జనం ముందు తిరగడానికి ఇష్టపడరు. తమను తామే బందీలుగా చేసుకుంటారు. ఈ విషయాన్ని చాలా దగ్గరగా గమనించాను. నేను ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిని. మహిళా హక్కుల కార్యకర్తను కూడా. పలు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశాను. ‘ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్’ (డిసిడబ్ల్యు)తో కలిసి పని చేశాను.
కావలసింది సానుభూతి కాదు....
మహిళలపై అత్యాచారాల కేసుల్లో వివరాలు సేకరించడానికి ఎయిమ్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు... యాసిడ్ బాధిత మహిళల దుస్థితిని ప్రత్యక్షంగా చూశాను. వారి రోదనలు నన్ను తీవ్రంగా కదిలించాయి. మెహెర్ ఫౌండేషన్ ద్వారా వారికి సాయం అందించేదాన్ని. బాధితులతో మాట్లాడినప్పుడు...ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. వారికి కావలసింది సానుభూతి కాదు. నిజానికి అది వారిని మరింత కుంగదీస్తోంది. ఈ ప్రపంచంలో ఎక్కడా తమకు స్థానం లేదనే నిరాశలో ఉన్న ఆ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడం, సమాజంలో హుందాగా జీవించడానికి వీలు కల్పించడం, అంతకన్నా ముఖ్యంగా దాడుల్లో దెబ్బతిన్న తమ రూపాల పట్ల ఉన్న న్యూనతను తొలగించడం ముఖ్యం అని గ్రహించాను. అలా ‘ది నెస్ట్’ ఏర్పాటుకు బీజం పడింది.

అందానికి నిర్వచనం...
ఢిల్లీలో ఇటీవల నేను ఏర్పాటు చేసిన ఈ బ్యూటీ సెలూన్ అన్ని విధాలుగానూ విలక్షణమైనది. ఇందులో అందరికీ సేవలు అందిస్తాం. అయితే యాసిడ్ బాధిత మహిళలకు బ్యూటీ, వెల్‌నెస్ సేవలన్నీ ఉచితం. ఇది కేవలం సెలూన్ కాదు... ఒక ఆశ్రయం. అనవసరమైన చూపులు వారి మీద ప్రసరించకుండా... వ్యక్తిగత వివిఐపి గదుల్లో సేవలు అందుకోవచ్చు. అద్దం ముందు ఎలాంటి సంకోచం లేకుండా కూర్చోవచ్చు. వారి హుందాతనానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. సేవలు అందించేవారు వారిని ఎంతో గౌరవంగా చూస్తారు. ఇక్కడ అందానికి నిర్వచనం ఆకట్టుకొనే రూపం కాదు... ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యం. ‘సమాజంలో మేమూ భాగమే’ అనే భావన వారిలో కలిగించడమే మా ధ్యేయం. సెలూన్ ద్వారా వచ్చే లాభాలను యాసిడ్ దాడి బాధితుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నది నా ఆలోచన. దీని గురించి తెలిసి వనరులు సమకూర్చడానికి కొందరు ముందుకు వస్తున్నారు. సహానుభూతి, సమ్మిళితత్వం ద్వారా అందాన్ని పునర్నిర్వచించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి నేను చేపట్టిన ఈ చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాలు ఇస్తుందనే నమ్మకం నాకుంది.’’
ఇవీ చదవండి: