‘కాదు’ అనడం ఒక కళ
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:59 AM
‘కాదు’ అనేది ఒక సరళమైన, శక్తిమంతమైన పదం. దైనందిన జీవితంలో మనలో చాలామంది ఈ పదంతో సతమతమవుతూ ఉంటాం. మర్యాద కోసం, ఇతరులను బాధపెడతామనే...
యోగా
‘కాదు’ అనేది ఒక సరళమైన, శక్తిమంతమైన పదం. దైనందిన జీవితంలో మనలో చాలామంది ఈ పదంతో సతమతమవుతూ ఉంటాం. మర్యాద కోసం, ఇతరులను బాధపెడతామనే భయంతో, సహకరిస్తున్నట్టు కనిపించాలనే కోరికతో... మన మనసు, హృదయం నిశ్శబ్దంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ.. తరచుగా ‘అవును’ అని అనేస్తూ ఉంటాం. మొదట్లో ఈ అలవాటు నిరపాయకరంగానే కనిపిస్తుంది. కానీ కాలం గడిచేకొద్దీ, అయిష్టంగా చెప్పే ‘అవును’ అనే ప్రతి మాటా అంతర్గతంగా ఒక సూక్ష్మమైన సంఘర్షణను సృష్టిస్తుంది. ఎందుకంటే మనం బయటకు వ్యక్తపరిచే ప్రతి భావం... ప్రతిసారీ మనం అంతరంగంలో సరైనదని అనుకున్నది కాకపోవచ్చు. ఈ నిశ్శబ్ద సంఘర్షణ మనలో పేరుకుపోతుంది. అది మన మనసును, భావోద్వేగాలను, చివరికి భౌతికమైన హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ‘కాదు’ అని చెప్పడం తిరస్కరణను ప్రదర్శించడం కాదు... అది స్వీయ అవగాహనకు, భావోద్వేగ సమతుల్యతకు, అంతర్గతమైన నిజాయితీకీ సంబంధించిన చర్య.
ఆ భారం నిజమైనదే...
వైద్యపరంగా, రోగుల శారీరక లక్షణాలు వారి భావోద్వేగపరమైన పోరాటాలను ప్రతిబింబించేలా ఉండడం అసాధారణం కాదు. ఒకసారి మధ్యవయస్కుడైన వృత్తి నిపుణుడ్ని నేను కలిశాను. అతని గుండెకు చేసిన పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నా... నిరంతరం ఛాతీలో అసౌకర్యంతో బాధపడుతున్నారు. అతను తన జీవన శైలి గురించి వివరించారు. నిరంతరం బాధ్యతలను స్వీకరించడం. అభ్యర్థనలను అరుదుగా తిరస్కరించడం. పనిలో, ఇంట్లో ఎదురయ్యే ఒత్తిళ్ళను మౌనంగా భరించడం లాంటివి దానిలో భాగాలు. అతని గుండె పరీక్షల ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నా... మనసు అలిసిపోయింది. తన భావోద్వేగ పరిమితులను అతను ఎప్పుడో నిర్లక్ష్యం చేశారు. భావోద్వేగపరమైన ఒత్తిడికి, హృదయ సంబంధమైన ఆరోగ్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఆధునిక హృద్రోగశాస్త్రం గుర్తించింది. దీర్ఘకాలికమైన ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. హృదయ స్పందన రేటును అధికం చేస్తుంది. శరీరాన్ని ఒత్తిడి హార్మోన్లతో నింపేస్తుంది. కొన్నిసార్లు మనం గుండె నొప్పి అని పిలిచేది కేవలం కవితాత్మక వ్యక్తీకరణ కాదు... ఆ భారాన్ని గుండె నిజంగానే అనుభవిస్తుంది. చాలామంది కొన్ని సూక్ష్మమైన మానసిక భయాల కారణంగా ప్రతిదాన్నీ అవునని అంగీకరిండానికి అలవాటుపడతారు. ఆ భయాలు... తిరస్కరణకు గురిఅవుతామనే భయం, విభేదాల భయం, ఇతరులను నిరాశపరుస్తామనే భయం. సామరస్యాన్ని కాపాడుకోవాలనే కోరిక క్రమంగా మన స్వప్రయోజనాన్ని అధిగమిస్తుంది. కానీ మన అంతరాత్మ వాణిని నిరంతరం మనం అణచివేస్తున్నప్పుడు... మనసు ఒత్తిడికి లోనవుతుంది, సంబంధాలు సమతుల్యత కోల్పోవచ్చు. దయతో మొదలైన ఈ వ్యవహారం నెమ్మదిగా అలసటగా, అసంతృప్తిగా రూపాంతరం చెందుతుంది.
హృదయం... చైతన్య కేంద్రం
‘కాదు’ అని చెప్పడం అంటే కరుణకు దూరం కావడం కాదు. అది సమయం, శక్తి, భావోద్వేగ స్పష్టత అనే మూడు అమూల్యమైన వనరులను కాపాడుతుంది. ఆలోచనాత్మకంగా చెప్పే ‘కాదు’ అనే మాట... మన ఆరోగ్యం, మన ప్రాధాన్యతలు, మన మనశ్శాంతి లాంటి నిజంగా ముఖ్యమైన వాటికి అర్థవంతంగా ‘అవును’ అని చెప్పడానికి వీలు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన హద్దులు బంధాలను బలహీనపరచవు. నిజాయితీ, పరస్పర గౌరవం ద్వారా వాటిని బలపరుస్తాయి. హృదయం కేవలం భౌతిక అవయవం మాత్రమే కాదనీ, అది లోతైన చైతన్య కేంద్రం కూడాననీ ధ్యాన సంప్రదాయాలు మనకు గుర్తుచేస్తాయి. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యాన సాధన చేసేవారు... తమలోని సూక్ష్మమైన స్వరాన్ని వినడం నేర్చుకుంటారు. ఆ అంతర్గత ప్రదేశం నుంచి తీసుకొనే నిర్ణయాలు అప్రయత్నంగా వస్తాయి, సమతుల్యంగా ఉంటాయి. మనం భయం వల్ల దేన్నీ అంగీకరించం, అహంకారం వల్ల దేన్నీ తిరస్కరించం. హృదయం సరళంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు... నిర్ణయాలు అప్రయత్నంగా తీసుకోగలుగుతాం. దేన్ని అంగీకరించాలో, దేన్ని తిరస్కరించాలో హృదయానికి సహజంగానే తెలుస్తుంది.
సమతుల్యతవైపు ప్రయాణం
నిజమైన కళ తిరస్కరించడంలో కాదు... సున్నితమైన నిజాయితీలో ఉంది గౌరవప్రదమైన తిరస్కరణలో స్పష్టత, గౌరవం, ప్రశాంతత అనే మూడు లక్షణాలు ఉంటాయి. ‘ఇది ముఖ్యమైనదని నేను అర్థం చేసుకోగలను. కానీ బహుశా ఇప్పుడే దీన్ని చెయ్యలేకపోవచ్చు’ అనేది ఒక సాధారణమైన స్పందన. ఇది గౌరవం, సామరస్యం... ఈ రెండిటినీ కాపాడుతుంది. అంతిమంగా ‘కాదు’ అనడం నేర్చుకోవడం... అంతర్గత సమతుల్యతవైపు సాగే ఒక ప్రయాణం. మన చర్యలు మన నిజమైన ప్రాధాన్యతల్ని ప్రతిబింబించినప్పుడు.... మనసు తేలిక అవుతుంది, హృదయం దాని సహజసిద్ధమైన ప్రశాంతతను తిరిగి పొందుతుంది. సంబంధాలనేవి నిశ్శబ్దమైన ఆబ్లిగేషన్ మీద కాకుండా... నిజాయితీ మీద నిర్మితమవుతాయి... కాబట్టి మరింత ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.‘ కాదు’ అనేది మనకు, ఇతరులకు కూడా చెప్పగలిగే అత్యంత కరుణామయమైన, ప్రశాంతమైన, గౌరవప్రదమైన పదం. దానివల్ల మన అంతర్గత సమతుల్యత కాపాడుకుంటాం. తద్వారా... నిశ్శబ్దంగా హృదయశాంతిని కూడా కాపాడుకుంటాం.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News