Share News

టెర్రకోటదే ట్రెండ్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:44 AM

ఒకప్పుడు విశేషంగా ప్రాచుర్యం పొందిన టెర్రకోట జ్యువెలరీ మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ ఆభరణాలను సహజమైన బంకమట్టితో తయారుచేసి ఆపైన కాల్చి రంగులు...

టెర్రకోటదే ట్రెండ్‌

ఒకప్పుడు విశేషంగా ప్రాచుర్యం పొందిన టెర్రకోట జ్యువెలరీ మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ ఆభరణాలను సహజమైన బంకమట్టితో తయారుచేసి ఆపైన కాల్చి రంగులు వేస్తారు. వీటిని చాలావరకు చేత్తో తయారుచేస్తారు కాబట్టి ప్రతి నగ వినూత్నంగా ఉంటుంది. వీటి తయారీలో ఎలాంటి రసాయనాలను వినియోగించరు. అందుకే పర్యావరణ పరిరక్షణకు, ఆర్గానిక్‌ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యమిచ్చే నేటి యువత ఈ టెర్రకోట ఆభరణాలను అమితంగా ఇష్టపడుతున్నారు. తక్కువ బడ్జెట్లో స్టయిల్‌గా కనిపించే అవకాశం ఉండడంతో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటున్నారు.

టెర్రకోట ఆభరణాల తయారీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా మెత్తటి బంకమట్టిని నీటితో తడిపి ముద్దలా చేస్తారు. రోలింగ్‌ పిన్‌, మోల్డ్స్‌, కుకీ కట్టర్ల సహాయంతో పూసలు, గుండ్లు, పెండెంట్లు, కమ్మలు, గాజులు, చోకర్స్‌ తయారుచేస్తారు. వీటిని బాగా ఎండబెట్టి గట్టిపడిన తరువాత ప్రత్యేకమైన బట్టీల్లో కాలుస్తారు. ఆపైన యాంటిక్‌ గోల్డ్‌, సిల్వర్‌, అక్రిలిక్‌ కలర్స్‌తో అందంగా పెయింట్‌ చేస్తారు.

టెర్రకోట నగలు చూడడానికి పెద్దగా కనిపించినప్పటికీ అసలు బరువుండవు. రోజంతా వేసుకుని ఉన్నప్పటికీ తేలిగ్గా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. సంప్రదాయ దుస్తులతోపాటు ఇండో వెస్ట్రన్‌, వెస్ట్రన్‌ డ్రెస్‌లపై సూటయ్యేలా పలు ఆధునిక డిజైన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దేవతల రూపాలు, ముగ్గులతో ఉన్న టెంపుల్‌ డిజైన్లు... పట్టు చీరలు, లంగా-ఓణీలు, లెహంగాలపై బాగుంటాయి. అందమైన పెయింట్లతో కూడిన కలంకారీ, మధుబని చోకర్స్‌, నెక్లెస్‌ సెట్లను కాటన్‌ చీరలు, కుర్తీలు, లాంగ్‌ ఫ్రాక్స్‌మీద పెట్టుకోవచ్చు. జ్యామితీ డిజైన్లు.. జీన్స్‌, ప్రింటెడ్‌ టాప్స్‌, జాకెట్స్‌పై చక్కగా సూటవుతాయి. పెద్ద సైజుల్లో ఉండే స్టేట్‌మెంట్‌ జుంకాలను మామూలు చీరలు, సింపుల్‌ డ్రెస్‌లపై పెట్టుకున్నా గ్రాండ్‌గా కనిపిస్తారు. యువతులు ఎక్కువగా యాంటిక్‌ గోల్డ్‌, మెటాలిక్‌ ఫినిషింగ్‌, బ్రైట్‌ ఎల్లో, రాయల్‌ బ్లూ, పీకాక్‌ గ్రీన్‌ కలర్స్‌తోపాటు మల్టీ కలర్‌ కాంబినేషన్లను ఎక్కువగా కొంటున్నారు.

పర్ఫ్యూమ్‌ లేదా సెంట్‌ స్ర్పే చేసుకునేటప్పుడు ఈ ఆభరణాలపై పడకుండా జాగ్రత్త వహించాలి. బంగారం, వెండి నగల మాదిరి వీటిని ఎక్కువ నీటితో శుభ్రం చేయకూడదు. తడిగుడ్డతో నెమ్మదిగా తుడిస్తే చాలు మురికి, ఇతరత్రా మరకలు తొలగిపోతాయి. మట్టితో చేసినవి కాబట్టి ఒకదానితో మరోటి తగిలినా, కింద పడినా పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని దూది లేదా కాగితాలు పరిచిన బాక్సుల్లో దాచుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 01:44 AM