తం సూర్యం ప్రణమామ్యహమ్
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:39 AM
Tam Sūryam Praṇamāmyaham Ratha Saptami and the Glory of Sun Worship
25న రథ సప్తమి
సూర్యుడు ప్రత్యక్ష దైవం. లోకసాక్షి, కర్మసాక్షి కూడా. ఆకాశంలో భగభగమండే అగ్నిగోళంలా కనిపించే సూర్యుడు... విగ్రహరూపంలోకి వచ్చేసరికి చాలా చక్కగా కనిపిస్తాడు. సప్తాశ్వాలను పూర్చిన రథం మీద నిలబడి, రెండు చేతులతో తామర పూలను పట్టుకొని... ప్రచండమైన వెలుగులతో దర్శనమిస్తాడు.
మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంప్రదాయాలలో ఆరాధనలు అందుకొనే ఏకైక దైవం సూర్యుడు. ఆయనను సనాతన ధర్మం విశేషంగా కీర్తించింది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అన్ని శాస్త్రాల్లో సూర్య భగవానుడి స్తుతులు కనిపిస్తాయి. అనాదిగా ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్న సూర్య భగవానుణ్ణి విగ్రహ రూపంలో... సామాన్యశకానికి కొద్ది కాలం నుంచి మాత్రమే శిల్పాలుగా మలిచారు. ఈ సూర్య శిల్పం తొలి రూపం.... పద్మం మధ్యలో విప్పారిన ఆయన ముఖంతో కనిపిస్తుంది. ఆ తరువాత సంపూర్ణ రూపంలో నిలబడి, ఒకే చక్రం ఉన్న రథం మీద ప్రయాణిస్తూ, రెండు చేతులతో రెండు వికసిత పద్మాలను పట్టుకున్నట్టు రూపుదిద్దుకుంది. అనంతరం రథంపై ఆసీనుడైన సూర్యభగవానుడి విగ్రహాలు కూడా వచ్చాయి. ‘సప్తాశ్వ రథమారూఢం’... అడు గుర్రాలను పూన్చిన రథం మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ ఏడు గుర్రాలు ఏడు వర్ణాలలో ఉంటాయి. మనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలు ఆ ఏడు గుర్రాల నుంచే వచ్చాయంటారు. ఒకే చక్రంతో ఉండే ఆ రథానికి ‘చైత్రరథం’ అనే పేరు కూడా ఉంది. అందుకే సూర్యుణ్ణి ‘చిత్రరథ స్వామి’ అంటారు.
రూప వర్ణనం
సాధారణంగా ప్రతిమలలో స్థిత (నిలబడిన) రూపంలోని సూర్యుడు రెండు చేతులతో పద్మాలు పట్టుకొని ఉంటాడు. ఏడు గుర్రాలున్న రథాన్ని నడుపుతూ ఉంటాడు. సూర్యుడికి ఇరువైపులా ప్రతీహారులు నిలబడి ఉంటారు. తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ క్షేత్రాల్లోని సూర్యనార్ ఆలయంలో సూర్యుడు ఉషాదేవి, ఛాయాదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఉషాదేవి అసలు పేరు సంజ్ఞాదేవి. ఆమె విశ్వకర్మ కుమార్తె. సూర్యుడితో వివాహం జరిగాక... ఆయన వేడిని తట్టుకోలేక, తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి దూరంగా వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సూర్యుడు తన వేడిని విశ్వకర్మ సాయంతో తగ్గించుకున్నాడు. సతీసమేత సూర్యుని విగ్రహం కూడా స్థితరూపంలోనే, పద్మాలను పట్టుకొని దర్శనమిస్తుంది.
ఆరాధనా వ్యవస్థలు
జగద్గురు ఆదిశంకరాచార్యులు సువ్యవస్థితం చేసిన షణ్మతాలలో సౌరమతం ఒకటి. అది చాలా ప్రాచీనమైనది. ‘సౌరాగమం’ అనేది సూర్యారాధన విధానాలను తెలిపే ఆధార గ్రంథం. భవిష్యపురాణం కూడా సూర్యాలయ నిర్మాణం, ప్రతిష్ఠ తదితర అపూర్వమైన విషయాలను తెలియజేస్తుంది. సూర్య దర్శనంతో చక్కని ఆరోగ్యం, అప్రమేయ నాయకత్వ ప్రతిభ, విశేష కీర్తి లభిస్తాయి. సూర్యారాధనతో శారీరక రుగ్మతలు తొలగుతాయి. సకల గ్రహదోషాలు సమసిపోతాయి. సూర్యరశ్మి సోకిన ప్రతి మొక్కలోని ఆకులో పత్రహరితం ఎలా రూపుదిద్దుకుంటుందో... సూర్యుణ్ణి ఆరాధించినవారికి కూడా ఆశించిన ఫలితాలు అంతేవేగంగా దక్కుతాయనేది పెద్దల మాట. సూర్యుణ్ణి పన్నెండు మాసాలలో పన్నెండు రూపాల్లో పూజిస్తారు. ఈ రూపాలనే ‘ద్వాదశాదిత్యులు’ అంటారు. సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా... పన్నెండు మాసాలుగా విభజించే ఈ ఋతుచక్ర విధానాన్ని, సౌరమాన విధానాన్ని భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయి.
చారిత్రకంగా...
వేంగీ చాళుక్యుల కాలంలో... పెదవేగిలో చిత్రరథస్వామి పేరిట మొట్టమొదటి సూర్యాలయ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆ తరువాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు... ఇలా అనేక రాజవంశాల కాలంలో సూర్యుణ్ణి ఆలయాల్లో, ఆలయంలోని వివిధ భాగాల్లో చిత్రించారు. తదనంతరం నేరుగా సూర్యుడికి త్రికూటాల్లో ఒక ఆలయాన్ని, తదనంతరం స్వతంత్ర ఆలయాలను నిర్మించారు. తెలంగాణలోని హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని కాకతీయ మొదటి రుద్ర దేవుడు క్రీస్తుశకం 1163లో నిర్మించాడు. అందులో ఆదిత్య వాసుదేవ రుద్రేశ్వర ఆలయాలు ఉన్నాయి. ‘రుద్ర’ అంటే శివుడు, ‘వాసుదేవుడు’ అంటే విష్ణువు, ‘ఆదిత్యుడు’ అంటే సూర్యుడు. ఈ ముగ్గురికీ కలిపి నిర్మించిన త్రికూటాలయం అది. ఇక గుజరాత్‌లోని మోధేరా, ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి, ఒడిశాలోని కోణార్కలలో సూర్యుడికి స్వతంత్ర ఆలయాలు నిర్మితమయ్యాయి.
డి.యన్.వి. ప్రసాద్, స్థపతి, 9440525788
Also Read:
గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!
బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?