ఆచితూచి అడుగేస్తేనే ఫ్రెషర్లకు మంచిది!
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:04 AM
సరికొత్త ఆలోచనలకు వేదికలుగా స్టార్టప్స్ నిలుస్తాయి. వీటిని అంకుర సంస్థలు లేదంటే ప్రారంభ సంస్థలు అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరడమంటే ఎక్కువ రిస్క్‌తో కూడిన వ్యవహారమే...
స్టార్టప్స్
సరికొత్త ఆలోచనలకు వేదికలుగా స్టార్టప్స్ నిలుస్తాయి. వీటిని అంకుర సంస్థలు లేదంటే ప్రారంభ సంస్థలు అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరడమంటే ఎక్కువ రిస్క్‌తో కూడిన వ్యవహారమే. కెరీర్ ప్రాధాన్యాలు, రిస్క్‌పరంగా సహనస్థాయి మధ్య ఊగిసలాటగా స్టార్టప్ ఎంపిక ఉంటుంది. ప్రయోజనం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కెరీర్ ఆరంభంలోనే స్టార్ట్‌పలను ఎంచుకోవడంలో ఉండే లాభ నష్టాలను వ్యూహాత్మకంగా చూద్దాం.
మంచి ఉద్యోగానికే ఎవరైనా ప్రాధాన్యం ఇస్తారు. అందులో సందేహించాల్సింది కూడా ఏమీ లేదు. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే స్టార్ట్‌పలో చేరాల్సి వస్తుంది. ముఖ్యంగా..
స్టార్ట్‌ప్సలో ఒకదాని తరవాత మరొకటిగా అన్నట్టు జాబ్ రోల్ ఉండదు. ఇందులో చేరిన వ్యక్తులు ఒకే సమయంలో పలు పాత్రలు పోషించాలి. వివిధ బాధ్యతలను అందులో కొన్ని ముఖ్యమైనవి కూడా చేపట్టాల్సి వస్తుంది. పనిచేస్తూనే నేర్చుకోవాలి. సంస్థ వ్యవస్థాపకులు, టీమ్‌లోని ఇతర సభ్యుల సహకారంతో నైపుణ్యాలను పెంచుకోవాలి.
బృందం చిన్నది కావడంతో సంస్థకు అందించే సేవలు స్పష్టంగా కనిపిస్తాయి. విజయం - అపజయం కళ్ళ ముందే కనిపిస్తుంది. కంపెనీపై మీ పని ప్రభావం ఉంటుంది. అదే పెద్ద కంపెనీలైతే మీ పని గుర్తింపులోకి రాదు.
ఒకటిన్నర నుంచి రెండేళ్ళలో ఎదుగుదల కనిపిస్తుంది. అదే కార్పొరేట్ సంస్థల్లో మూడు నుంచి అయిదేళ్ళకుగాని ఒక ప్రమోషన్ రాకపోవచ్చు. స్టార్టప్స్‌లో పనితీరే ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలోనే కెరీర్‌పరంగా పురోగతికి అవకాశం ఉంటుంది.
స్టార్ట్‌ప్సలో చాలా వరకు సర్దుబాటుకు లేదా అనువైనవిధంగా పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరస్పర సహకారం, లక్ష్య నిర్దేశిత సంస్కృతి ఉంటుంది. సహచరులు, సంస్థ అధినేతలతో వృత్తిపరంగా బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు. కెరీర్ మొత్తానికి బాసటగా నిలుపుకోనూవచ్చు.
మార్కెట్ వాస్తవికత, సవాళ్ళు
గత ఏడాది ట్రెండ్‌ను చూస్తే ఫ్రెషర్లకు అవకాశాలు తక్కువే అని చెప్పాలి. కొవిడ్ ముందునాటి పరిస్థితులతో పోల్చుకుంటే భారీ టెక్ కంపెనీల్లో అయిదు శాతం వరకు అవకాశాలు తగ్గాయి. మొత్తంగా ఏడు శాతం మంది ష్రెషర్లకు స్టార్టప్స్ అవకాశాలు కల్పిస్తున్నాయి. 2019 నుంచి ఫ్రెషర్ల నియామకాలను పరిశీలిస్తే 30 శాతం మేర తగ్గింది.
తక్షణం ఉత్పత్తిని అందించే అనుభవజ్ఞులకు ఎంప్లాయిర్స్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే ఫ్రెషర్లకు క్యాచ్-22ని సృష్టిస్తోంది. అంటే జాబ్ వస్తే అనుభవం, అనుభవం ఉంటే జాబ్ అన్న పరిస్థితిని కల్పిస్తోంది. ఏఐతో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. జూనియర్లు ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. జెన్ జెడ్‌ని నియమించుకునే కంటే ఏఐని ఉపయోగించుకుంటే మంచిదన్న అభిప్రాయం కొందరు ఎంప్లాయిర్లలో వ్యక్తమవుతోంది.
స్టార్ట్‌ప్సకు సంబంధించి ఫెయిల్యూర్ రేటు ఎక్కువ. జాబ్ భద్రత తక్కువ. క్లిష్టమైన తరుణంలో గంటలకొద్దీ పనిచేయాలి. కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే చాలా సందర్భాల్లో పది నుంచి ఇరవై శాతం మేర బేస్ జీతం తక్కువగా ఉంటోంది. వార్టన్ అధ్యయనం ప్రకారం రిక్రూట్ అయిన వారిలో 77 శాతం మంది స్టార్ట్‌పలను వదిలి వెళుతున్నారు.
అసలు ఎంపిక ఎలా?
స్టార్ట్‌పను ఎంచుకునేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సదరు స్టార్టప్ వ్యవస్థాపకులు ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఆర్థికంగా బలమైన, సుదీర్ఘ అనుభవం ఉన్న మెంటార్ల దగ్గర పని చేయడాన్ని విలువైన విషయంగా గుర్తించాలి. అసలు స్టార్టప్ ఏ దశలో ఉందన్నది తెలుసుకోవాలి. ఆరంభంలో ఉందా లేదంటే కొన్నాళ్ళుగా పనిచేస్తోందా అన్నది తెలుసుకోవాలి. ఇన్వెస్టర్ క్వాలిటీ, సంస్థ ఉత్పత్తి మార్కెట్‌కు పనికొచ్చేదా కాదా అన్నది చూడాలి. కంపెనీ సుదీర్ఘకాలిక లక్ష్యాన్ని మీ ఆశయంతో సరిపోల్చుకోవాలి.
లింక్డిన్ ఉపయోగించాలి. స్టార్టప్ ఈవెంట్లకు హాజరు కావాలి. అలూమ్నీ/వీసీ నెటవర్క్‌ను ఉపయోగించుకోవాలి.
నేరుగా కాంటాక్ట్ మంచిది. పోస్టింగ్ వరకు వేచి చూడకూడదు. స్టార్టప్ వ్యవస్థాపకులు, టీమ్ మెంబర్లను ఈ-మెయిల్స్ ద్వారా పరిశోధనతో కలగలిసిన సందేశాలతో కాంటాక్ట్ కావచ్చు. సంస్థకు తాముగా ఎలా అదనపు విలువ అవుతామో తెలియజేయవచ్చు.
డిమాండింగ్ స్కిల్స్ విషయంలో రాజీపడవద్దు. ఉదాహరణకు ఇప్పటి పోటీలో ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండాలి. అయోమయంలో ఉండొద్దు.
ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఎమర్జెన్సీ ఫండ్‌తో రంగంలోకి దిగితే చాలా మంచిది.
చేరిక మంచిదేనా?
స్టార్ట్‌ప్సలో చేరడం మంచిదే. అయితే కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. స్టార్ట్‌ప్సలోనే మొదటి జాబ్ అయిన పక్షంలో సొంతంగా మోటివేట్ కావాలి. అనువర్తన, అనిశ్చితిలోనూ సౌకర్యంగా ఉండగలగడం తెలియాలి. ప్రత్యేకించి ఒక ప్రాబ్లెమ్ లేదంటే పరిశ్రమలో పనిచేయాలన్న అనురక్తి కూడా తోడవ్వాలి. స్టార్టప్స్ ఎంపికలో వ్యూహత్మకంగా వ్యవహరించాలి. బలమైన ప్రాథమిక అంశాలకు తోడు బలమైన నాయకత్వం ఉన్న వాటిని ఎంచుకోవాలి.
జాబ్ భద్రత, నిర్దేశిత శిక్షణ, స్పష్టమైన ఎదుగుదల లేదా వర్క్ -
జీవితం మధ్య సమతూకం, సంప్రదాయ కార్పొరేట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లేదా మున్ముందు మరింత ప్రత్యేకీకరణ కోరుకునే వ్యక్తులు మాత్రం తప్పనిసరి అయితేనే స్టార్ట్‌ప్సను ఎంచుకోవాలి.
చివరగా ఒక్క విషయం. తాజా గ్రాడ్యయేట్లు అటు స్టార్టప్ ఇటు కార్పొరేట్ గ్రాడ్యుయేట్ స్కీమ్‌లపై సమాంతరంగా దృష్టిసారించడం మంచిది. నేర్చుకునేందుకు, ఎదుగుదలకు అవకాశాలు అనేవి పర్సనల్ రిస్క్ ప్రొఫైల్‌తో సరిపోల్చుకుని బాగా ఉంటేనే అడుగేయాలి. నిత్యనూతనంగా ఉండే స్టార్టప్ లేదంటే మార్కెట్లో స్థిరంగా ఉన్న సంస్థ అన్న రెంటిలో దేనివైపు మన మొగ్గు అన్నదే ముందే చూసుకుని అడుగేయడం చాలా మంచిది.
ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు
డైరెక్టర్, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప