హరిదాస ఉద్యమకర్త
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:58 AM
‘శాస్త్రాలు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, భక్తి ప్రజల భాషలో పలకాలి’ అని పరితపించిన భాగవతోత్తముడు శ్రీపాదరాజులు. ఆ భావనతోనే ఆయన కన్నడ భాషలో దేవర నామాలను రచించారు....
విశేషం
‘శాస్త్రాలు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, భక్తి ప్రజల భాషలో పలకాలి’ అని పరితపించిన భాగవతోత్తముడు శ్రీపాదరాజులు. ఆ భావనతోనే ఆయన కన్నడ భాషలో దేవర నామాలను రచించారు. ‘శ్రీరంగ విఠల’ అంకిత నామంతో రచించిన కీర్తనలు భక్తి, తత్త్వం, వైరాగ్యాల అద్భుత సమన్వయం. అదే పరంపరలో వ్యాసరాజులు, పురందరదాసు, కనకదాసు తదితర మహనీయులు వెలుగొందారు. అందుకే హరిదాస సాహిత్య చరిత్రలో శ్రీపాదరాజుల పేరు హరిదాస ఉద్యమకర్తగా, ఆద్యగురువులలో ఒకరిగా నిలిచిపోయింది.
బాలుడి సందేశం
ద్వైత వేదాంత మార్గంలో శ్రీ వ్యాసరాజ తీర్థుల స్థానం అద్వితీయం. ‘న్యాయమృత’, ‘చంద్రిక’, ‘తర్కతాండవం’ అనే మూడు బృహద్గ్రంఽథాలను రచించి... మధ్వ సిద్ధాంత వైభావాన్ని అద్భుత రీతిలో ప్రకాశింపజేసిన ఆ మహామేధావి వెనుక నిలిచిన గురువు శ్రీపాదరాజులు. ఒక మామూలు బాలుడు యతిగా మారిన ఆయన కథ ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీమధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు, ముళబాగిలు మఠాధిపతి స్వర్ణవర్ణతీర్థులు ఒకసారి మహనీయుడైన పురుషోత్తమతీర్థులను కలుసుకోడానికి అబ్బూరు బయలుదేరారు. మార్గమధ్యంలో... అబ్బూరు ఇంకా ఎంతదూరంలో ఉందో కనుక్కుందామని తన పల్లకి ఆపించారు. మైదానంలో గోవులతో ఆడుకుంటున్న కొందరు పిల్లలు వారికి కనిపించారు. వారిలో నాలుగైదేళ్ళ బాలుడి ముఖంలో అసాధారణ తేజస్సును స్వర్ణవర్ణతీర్థులు గమనించారు. లక్ష్మీనారాయణ అనే పేరున్న ఆ బాలుణ్ణి ‘‘అబ్బూరు ఇంకా ఎంత దూరంలో ఉంది?’’ అని అడిగారు. ‘‘నన్ను చూడండి, సూర్యుణ్ణి చూడండి. గోవులను చూడండి. మీకే తెలుస్తుంది’’ అని గమ్మత్తుగా జవాబిచ్చి ఆ కుర్రాడు తుర్రుమన్నాడు. అక్కడ ఉన్నవారందరూ నివ్వెరపోయారు. ‘‘సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేము అయిదారేళ్ళ పసివాళ్ళం. గోవులు మాతో ఉన్నాయి. అంటే ఊరికి అత్యంత సమీపంలో ఉన్నాం’’ అంటూ ఆ బాలుడు ఇచ్చిన సందేశం జ్ఞాని అయిన స్వర్ణవర్ణతీర్థులుకు అర్థమయింది. ఆ బాలుడి తేజస్సు, వినయం, మేధాశక్తి ఆయనను ఆశ్చర్యపరచింది. అతడు భవిష్యత్తులో ధర్మరక్షణకోసం గొప్ప సేవ చేస్తాడని గుర్తించారు. తన సన్నిధికి తీసుకువచ్చారు.
శ్రీపాదరాజ బిరుదు....
లక్ష్మీనారాయణుడి గురుకుల జీవితం ఆరంభమైంది. వేదాలు, వ్యాకరణం, మీమాంస, న్యాయం, వేదాంతం... ఇలా ఏ శాస్త్రమైనా అత్యంత వేగంతో గ్రహించేవాడు. లోతుగా అవగాహన చేసుకొనేవాడు. చిన్న వయసులోనే అతను సన్యాస దీక్ష స్వీకరించి, యతి జీవనంలో ప్రవేశించాడు. కానీ అతణ్ణి ప్రత్యేకంగా నిలబెట్టినది శాస్త్రజ్ఞానంతో కూడిన భక్తి. ఎక్కడికి వెళ్ళినా భగవన్నామమే ప్రధానం. లక్ష్మీనారాయణుణ్ణి వెంటబెట్టుకొని... ఆయన విద్యాగురువైన శ్రీ విభుదేంద్ర తీర్థులు రాయచూరు సమీపంలో ఉన్న కొప్పర లక్ష్మీ నరసింహ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఉత్తరాది మఠానికి చెందిన యతిశ్రేష్టుడు రఘునాథ తీర్థులుకు శిష్యుణ్ణి పరిచయం చేశారు. ఆయన సమక్షంలో ‘శ్రీమన్న్యాయసుధ’ గ్రంథాన్ని గురువు ఆనతి మేరకు లక్ష్మీనారాయణ తీర్థులు అనువాదం చేశారు. అది విన్న రఘునాథతీర్థులు ఎంతో సంతోషపడి... ‘శ్రీపాదరాజ’ అనే బిరుదును ప్రసాదించారు. ఆ రోజునుంచి ఆ బిరుదుతోనే ఆయన ప్రసిద్ధులయ్యారు. ఆయన ఖ్యాతి నలు దిక్కులకూ వ్యాపించింది. సాళువ నరసింహరాయలు లాంటి రాజులు కూడా ఆయన శిష్యులయ్యారు. రాజ్యపాలనలో పాటించాల్సిన ధర్మాలను పాలకులకు ఆయన ఉపదేశించారు. ముళబాగిలు క్షేత్రాన్ని గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దారు. దేశం నలుమూలల నుంచి వేలాదిమంది విద్యార్థులు వచ్చి ఆయన దగ్గర శాస్త్రాధ్యయనం చేసేవారు.
ఎన్నెన్నో మహిమలు...
శ్రీపాదరాజుల చేసిన మహిమలు అనేకం. ఆయన శిష్యుడైన శ్రీవ్యాసరాయలు ఒకసారి గుహలో కూర్చొని అధ్యయనం చేస్తూ ఉండగా... ఒక పాము వచ్చి చుట్టుకుంది. అది చూసిన తోటివారు శ్రీపాదరాజులకు చెప్పగా, ఆయన వచ్చి, పాముతో దాని భాషలో మాట్లాడి పంపేశారని ‘శ్రీపాదరాజుల స్తోత్రం’లో ప్రస్తావన ఉంది. ఆ గుహను ఇప్పటికీ ముళబాగిలు క్షేత్రంలో చూడవచ్చు. ఆయన జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన మహత్తు... అధికారం వల్ల కాదు, సంపదతో కాదు, జ్ఞానంతో కూడిన వినయం వల్ల వస్తుంది. బాల్యంలో మొదలైన ఆయన ఆధ్యాత్మిక జీవితం గురుభక్తి, విద్యాపిపాస, భగవద్భక్తి వల్ల మహాయతి స్థానానికి చేరింది. ఆయన భక్తులకు ఆదర్శం. శాస్త్రానికి దీప్తి. మానవతకు మార్గదర్శి.
( శ్రీ మధ్వ ప్రచార పరిషత్ )
(28న జ్యేష్ట శుద్ధ చతుర్దశి...
శ్రీపాదరాజుల పుణ్యతిథి)
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!