Share News

భక్తి మార్గదర్శి

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:51 AM

వేదాలు, ఉపనిషత్తులు, స్మృతుల ఆధారంగా తత్త్వాన్ని నిరూపించిన శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం... తత్త్వవాదంగా ప్రసిద్ధి చెందింది. సదా శ్రీహరి సేవలో తరించే శ్రీవాయుదేవుల మూడో అవతారమే...

భక్తి మార్గదర్శి

వేదాలు, ఉపనిషత్తులు, స్మృతుల ఆధారంగా తత్త్వాన్ని నిరూపించిన శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం... తత్త్వవాదంగా ప్రసిద్ధి చెందింది. సదా శ్రీహరి సేవలో తరించే శ్రీవాయుదేవుల మూడో అవతారమే శ్రీ మధ్వాచార్యులు. ఋగ్వేద సూక్తం అయిన ‘బళిత్తా సూత్రం’, ‘కూర్మపురాణం’లోని ప్రమాణాలు దీన్ని స్పష్టం చేస్తాయి. 1238లో విజయదశమినాడు... పాజక అనే గ్రామంలో శ్రీమధ్వాచార్యులు జన్మించారు. పరశురామ పవిత్ర క్షేత్రాల్లో అదొకటి.

బాలుడు కాదు... లోకేశ్వరుడు

మగ సంతానాన్ని కోరుకుంటూ మధ్యగేహభట్టు, వేదవతి దంపతులు ఉడిపిలోని అనంతేశ్వరస్వామిని సేవించారు. వారికి మగబిడ్డ జన్మించాడు. అతనికి ‘వాసుదేవ’ అని నామకరణం చేశారు. వాసుదేవుడు నెలల బిడ్డగా ఉన్నప్పుడు... అతని తల్లిదండ్రులు ఉడిపిలో అనంతేశ్వరుడి సంక్రమణోత్సవం ముగించుకొని, తోటి గ్రామస్తులతో కలిసి అడవిలోంచీ ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఆలస్యంగా బయలుదేరారు. అర్ధరాత్రి అయింది. దట్టమైన అడవి, క్రూర జంతువుల శబ్దాలు భయం కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండి ఆ గుంపులో ఒకరు ఆర్తనాదం చేస్తూ... రక్తం కక్కుకొని కింద పడ్డారు. అది భూతం చేష్ట అని వాళ్ళకు అర్థమైంది. అవి సాధారణంగా శిశువులను పీడిస్తాయని వాళ్ళకి తెలుసు. కానీ బాలుడైన వాసుదేవుడు సురక్షితంగా ఉన్నాడు. ‘ఈ రోజు మా పుణ్యం బాగుంది’ అని వాళ్ళు అనుకున్నంతలో... రక్తం కక్కుకొని పడిపోయిన వ్యక్తిలో ప్రవేశించిన భూతం ‘‘ఈ అడవి మాది. ఈ సమయంలో మేము తిరుగుతూ ఉంటామని తెలిసీ ఇంతటి సాహసం ఎందుకు చేశారు? మీకు ప్రాణహాని చేయలేదంటే దానికి కారణం ఈ బాలకుడి సామర్థ్యం. ఇతడు సామాన్యుడు కాదు, లోకేశ్వరుడు’’ అని చెప్పి, తొలగిపోయింది. అప్పుడు వారికి అర్థమయింది... ‘ఈ బిడ్డ బతికింది మా వల్ల కాదు, మేము జీవించి ఉండడానికి కారణం ఈ బిడ్డే’ అని. ఇది బాల మధ్వుల మహిమ.


తండ్రిని మించిన తనయుడు

ఒకసారి మధ్యగేహభట్టు ఒక పురాణ శ్లోకాన్ని వివరించే క్రమంలో... కొన్ని వందల వృక్షాల పేర్లను వివరించాడు. శ్రోతల్లో ఒకరైన వాసుదేవుడు... మరొకసారి వివరించాలని తండ్రిని ప్రార్థించాడు. మధ్యగేహుడు మళ్ళీ చక్కగా వివరించాడు. అప్పుడు బాలుడైన వాసుదేవుడు ‘‘తండ్రీ! ఈసారి కూడా మీరు మూల శ్లోకంలో ఉన్న ‘లికుచ’ అనే శబ్దాన్ని వివరించలేదు’’ అని అడిగాడు. నిజానికి మధ్యగేహభట్టుకు ఆ పదానికి అర్థం తెలుసు. కానీ ఎలా వివరించాలో తెలీదు. తప్పుగా వివరిస్తే గ్రంథాపచారం అవుతుందని బుద్ధి పూర్వకంగానే దాన్ని వదిలేశాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు వాసుదేవుణ్ణి దాని అర్థం చెప్పాలని కోరగా, అతను దాన్ని వివరించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కుమారుడి అసాధారణ ప్రతిభను గమనించిన మధ్యగేహ భట్టు... అతణ్ణి తిల్లాయ అనే గురువు దగ్గరకు విద్యాభ్యాసం కోసం పంపించాడు. కానీ అతను గురుకులంలో చాలా తక్కువగా కనిపించేవాడు. ఎక్కువగా ఆటపాటలతో గడిపేవాడు. ఒకసారి గురువు అతణ్ణి పిలిచి... సరిగ్గా అధ్యయనం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అన్నీ నేర్చుకుంటున్నానని వాసుదేవుడు చిరునవ్వుతో చెప్పాడు. అంతకుముందు చెప్పిన పాఠాలు అప్పజెప్పాలని గురువు అడిగితే... వాటినే కాదు, తనకు ఆయన నేర్పని మహానారాయణోపనిషత్తును కూడా స్వరయుక్తంగా, ముగ్ధమనోహరంగా చెప్పాడు. ఆ శిష్యుడు సామాన్యబాలుడు కాదని గురువుకు అర్థమయింది.


సర్వమూల గ్రంథాలు

పదకొండేళ్ళ వయసులో... ఉడిపిలో వాసుదేవుడికి శ్రీ అచ్యుత ప్రేక్షకులు సన్యాస ఆశ్రమాన్ని ప్రసాదించి, ‘పూర్ణప్రజ్ఞ’ అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులు గంగా స్నానం చేయాలని అనుకుంటే.... గంగాదేవే అక్కడికి వచ్చింది. ఆ జలాశయమే ఉడిపిలో ఇప్పటికీ ఉన్న మధ్వసరోవరం. ఆ తరువాత కొద్దికాలంలోనే పూర్ణప్రజ్ఞులకు శ్రీఅచ్యుత ప్రేక్షకులు పీఠాధిపత్యాన్ని ఇచ్చి, ‘ఆనంద తీర్థులు’ అనే నామాన్ని ప్రసాదించారు. గురువు ఆదేశం ప్రకారం పలు ప్రాంతాల్లో ఆనందతీర్థులు సంచరించి, దుర్వాదులను ఓడించి, దిగ్విజయ యాత్ర చేశారు. తన గ్రంథాల్లో మొదటిదైన ‘గీతాభాష్యా’న్ని బదరీనారాయణుడికి సమర్పించారు. శ్రీమధ్వాచార్యులుగా ప్రసిద్ధులయ్యారు. ఆయన రాసిన 37 గ్రంథాలు సర్వమూల గ్రంథాలుగా పేరు గాంచాయి. ‘శ్రీహరే సర్వోత్తముడు’, ‘జగత్తు సత్యం’ తదితర అంశాలు ప్రధానంగా ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, అక్షోభ్య తీర్థులు, మాధవ తీర్థులు అనే నలుగురు శిష్యులతో ఆయన ప్రారంభించిన మధ్వ సిద్ధాంత పరంపర అనే మణిహారంలో శ్రీ జయతీర్థులు, శ్రీ వ్యాసరాయలు , శ్రీ వాదిరాజులు, శ్రీ రాఘవేంద్ర స్వామి లాంటి ఎందరో మహాయతులు, విద్వన్మణులు ప్రకాశించారు. ఆయన స్థాపించిన ఉడిపి అష్టమఠాలు, తదనంతరం ఏర్పడిన శ్రీ ఉత్తరాదిమఠం, శ్రీ వ్యాసరాయమఠం, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లాంటివి శ్రీమధ్వాచార్యుల వారు ప్రతిపాదించిన భక్తి మార్గాన్ని వారి బోధనలకు అనుగుణంగా సమాజానికి అందజేసి, సనాతన ధర్మ పరిరక్షణలో చేస్తున్నాయి. ‘భగవంతుని యందు మాహాత్మ్య జ్ఞానంతో చేసే స్నేహమే భక్తి’ అని శ్రీమధ్వాచార్యులు తెలిపారు. అటువంటి భక్తిని దైవం పైన, గురువుల పట్ల చూపిస్తే... వారి అనుగ్రహానికి పాత్రులం కాగలం.

శ్రీ మధ్వ ప్రచార పరిషత్‌

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 03:51 AM