Share News

ధర్మ సంస్థాపనార్థాయ...

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:41 AM

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ జననం, దానికి పూర్వం, అనంతరం జరిగిన సంఘటనలు ఎంతో ఆసక్తికరమైనవి. అప్పుడే పుట్టిన శిశువు... అంతలోనే భగవత్‌ స్వరూపంగా...

ధర్మ సంస్థాపనార్థాయ...

భాగవతం

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ జననం, దానికి పూర్వం, అనంతరం జరిగిన సంఘటనలు ఎంతో ఆసక్తికరమైనవి. అప్పుడే పుట్టిన శిశువు... అంతలోనే భగవత్‌ స్వరూపంగా దర్శనమిచ్చి తన అవతార పరమార్థాన్ని వెల్లడించిన ఘట్టం అపూర్వం.

దేవకీ వసుదేవుల వివాహం వైభవంగా జరిగిన తరువాత... తన గారాల చెల్లెలిని అత్తవారింట్లో దిగబెట్టేందుకు స్వయంగా కంసుడే బయలుదేరాడు. బావామరుదుల సరస హాస్యోక్తుల మధ్య రథం సాగుతోంది. కొంత దూరం వారు ప్రయాణించిన తరువాత... ‘‘దేవకి అష్టమ గర్భాన నిన్ను సంహరించేవాడు పుట్టబోతున్నాడు... జాగ్రత్తా!’’ అని కంసుణ్ణి ఆకాశవాణి హెచ్చరించింది. కంసుడు తుళ్ళిపడ్డాడు. గుండె పగులుతున్నట్టు అనిపించింది. తల తిరిగింది. కళ్ళు నిప్పు కణికలయ్యాయి. గాయపడిన చిరుతపులిలా భయంకరంగా అరిచాడు. దేవకీ వసుదేవులు గజగజ వణికిపోయారు. రథాన్ని కంసుడు వెనక్కు మళ్ళించాడు. దేవకీ వసుదేవులను తన ఉద్యానవనంలో ఒక గదిలో బంధించాడు.

శిశు వధ

ఆ తరువాత కంసుడికి కంటి మీద కునుకు లేదు. విందులు లేవు, వినోదాలు లేవు. విలాసాలు లేవు. విశ్రాంతి లేదు. రాచకార్యాల నిర్వహణ అసలే లేదు. కళ్ళు మూసినా, తెరచినా చెల్లెలి కడుపున పుట్టబోయే అష్టమగర్భవాసుడే కళ్ళముందు కదులుతున్నాడు. ‘‘క్రీడించండి. వినోదించండి. మీకు పుట్టే ప్రతి బిడ్డను నాకు అప్పగించండి. నా కత్తికి వాళ్ళు బలికావాలి’’ అని కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉండగా దేవకీ వసుదేవులను శాసించేవాడు. ‘‘నాయనా! ఇది తప్పురా! చెల్లెలినీ, బావనూ బంధించడం, బాధించడం నీకు తగదురా!’’ అని చెప్పినందుకు తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా చెరసాలలో పెట్టాడు. దేవకి కన్న ఆరుగురు పసికందులను కంసుడు నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. దేవకి వలవల విలపిస్తున్నా, బావ ప్రాధేయపడుతున్నా లక్ష్యపెట్టలేదు. ఆరుగురి తలలు అతని కత్తి వేటుకు తెగి, నెత్తుటి ముద్దలై కింద పడ్డాయి.

పసి బిడ్డల నెత్తురు వరదలై ఉద్యానవనాన్ని ముంచెత్తింది. ఆ శిశు మరణాలను తలచుకుంటూ అదే పనిగా విలపించి, విలపించి... రెండు కన్నీటి చుక్కలను కూడా ఆ దంపతులు మిగుల్చుకోలేకపోయారు.


కంసుడికి మృత్యుభయం

ఋతువు మారింది. దేవకీ వసుదేవుల కలయికను ప్రకృతి ప్రేరేపించింది. దేవకిని వసుదేవుడు దగ్గరకు తీసుకున్నాడు. దేవకి దూరంగా జరిగింది. ‘‘కడుపుకోతను భరించలేను. ఇప్పుడు మరొక బిడ్డను కని... వాడిని కూడా మా అన్నకు బలి ఇచ్చి బతకలేను. వద్దు స్వామీ... వద్దు’’ అంటూ అరచేతుల్లో ముఖం దాచుకొని పెద్దగా ఏడ్చింది. అప్పుడు వచ్చాడు కంసుడు. ‘‘వీల్లేదు. ఏడో బిడ్డను, ఎనిమిదో బిడ్డను కూడా కనవలసిందే. నీ ఎనిమిదో సంతానం వల్ల నాకు ప్రాణహాని ఉంది. వాడో, నేనో తేలాలి’’ అని గర్జించి, వెనుతిరిగాడు. దేవకిని వసుదేవుడు ఓదార్చాడు. శ్రీహరి ఆదేశం మేరకు... దేవకీ గర్భాన ఉన్న ఏడో బిడ్డను యోగమాయ తీసి, వసుదేవుని పెద్ద భార్య రోహిణి గర్భాన ఉంచింది. స్వామి ఆజ్ఞ ప్రకారం తాను వెళ్ళి, నందుని భార్య యశోద గర్భాన జన్మించింది. ఆమే దుర్గ, భద్రకాళి. మరోవైపు... ‘నన్ను చంపేవాడు దేవకి గర్భాన అష్టమ పుత్రుడిగా జన్మిస్తాడని అశరీరవాణి పలికిన మాట నిజం కాబోతోందా?’... ఈ ఆలోచనతో కాళ్ళ కింద నేల, నెత్తి మీద నింగి విరిగి పడుతున్నట్టు, ఉరుములూ మెరుపులూ లేకుండా చిక్కటి చీకటి కమ్ముకుంటున్నట్టూ అనిపించింది కంసుడికి. అతణ్ణి అనుమానం ఆవహించింది. మృత్యుభయంతో వణికిపోయాడు.

దేవదేవుడి జననం

జగదేకవంద్యుడు, జగదోద్ధారకుడు అయిన కృష్ణదేవుడు... దేవకి కడుపున పుట్టబోతున్నాడని తెలుసుకున్న బ్రహ్మ రుద్రాది దేవతలందరూ దివి నుంచి భువికి దిగి వచ్చారు. దేవకిని అనునయిస్తూ ‘‘తల్లీ! కంసాది దుష్టులను సంహరించడానికీ, సాధు జనులను రక్షించడానికీ పరాత్పరుడూ, పరంధాముడూ అయిన శ్రీమహావిష్ణువు నీకు కుమారుడిగా పుట్టబోతున్నాడు. నువ్వు భాగ్యశాలివి’’ అని దీవించారు. శ్రీకృష్ణుడు పుట్టే సమయం ఆసన్నమయింది. భూమండలమంతా మంగళకరంగా, మనోహరంగా ఉంది. పక్షులు మధురంగా పాడుతున్నాయి. గోవులు మోరలెత్తి ‘‘అంబా’’ అంటూ ప్రేమగా పిలుస్తున్నాయి. చెట్ల సందుల్లోంచీ దూసుకువస్తున్న చల్లగాలులు దేవకికి ప్రశాంతతను ప్రసాదించి... హేలగా జోల పాడుతున్నప్పుడు.. ఆమె గర్భాన దేవదేవుడు ఉదయించాడు. అప్పుడే పుట్టిన ఆ శిశువు... అంతలోనే దివ్య తేజస్సుతో, చతుర్భుజాలలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి, నీలమేఘఛాయతో మెరిసిపోతూ తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. దేవకీ వసుదేవులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ‘‘నాయనా! నీ అన్నలందరినీ క్రూరంగా వధించిన కంసుడు నిన్నేం చేస్తాడోనని భయంగా ఉంది. నీ రూపాన్ని ఆ రాక్షసుడికి కనిపించకుండా చెయ్యి తండ్రీ’’ అని దేవకి ప్రార్థించింది.


నిజరూప దర్శనం

‘‘అమ్మా! భయపడకు. నేను అధర్మాన్ని అణచడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, మానవలోక ఉద్ధరణకు వచ్చాను. పూర్వం నువ్వు పృశ్ని అనే పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ దంపతులు. మీరు పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేసినప్పుడు... నేను మీకు ప్రత్యక్షమయ్యాను. నేను మూడుసార్లు మీకు బిడ్డనై పుట్టాలని వరం కోరుకున్నారు. ఆ విధంగానే నేను మొదట పృశ్నిగర్భుడు అనిపించుకున్నాను. ఆ తరువాత... మీరు అదితి కశ్యపులయ్యారు. అప్పుడు మీ గర్భాన నేను వామనుడినై జన్మించాను. ఇప్పుడు మళ్ళీ మీకు తనయుడినై పుట్టాను. మీకు ఇచ్చిన వరం సంపూర్ణమయింది. ఇదే మీకు ఆఖరి జన్మ. మీకు పూర్వజన్మ స్మృతి కలగాలని... నా నిజరూప దర్శనం ఇచ్చాను. నన్ను పుత్రుడిగా కాకుండా పరబ్రహ్మంగా తెలుసుకొని ధ్యానించండి’’ అని... తనను చెరసాల నుంచి తప్పించే మార్గం కూడా చెప్పాడు. అంతలోనే... మళ్ళీ అప్పుడే పుట్టిన బిడ్డడిగా మారిపోయాడు.

ప్రయాగ రామకృష్ణ

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 04:41 AM