Share News

మధ్వ తత్త్వ ప్రకాశకుడు

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:02 AM

ఆగస్టు 3న శ్రీ జయతీర్థుల ఆరాధన శ్రీమధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైత వేదాంతం భారతీయ తాత్త్విక సంప్రదాయంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందింది. అయితే ఆ సిద్ధాంతాన్ని...

మధ్వ తత్త్వ ప్రకాశకుడు

విశేషం

ఆగస్టు 3న శ్రీ జయతీర్థుల ఆరాధన శ్రీమధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైత వేదాంతం భారతీయ తాత్త్విక సంప్రదాయంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందింది. అయితే ఆ సిద్ధాంతాన్ని అత్యంత సూక్ష్మంగా, యుక్తిపూర్వకంగా, ప్రామాణికంగా ప్రపంచానికి వివరించి, అజేయంగా నిలిపిన మహనీయుడు శ్రీజయతీర్థులు. మధ్వ సిద్ధాంతం మహా సముద్రమైతే... దానిలోని ముత్యాలను వెలికి తీసి ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథకర్త. ఆయనను ‘టీకారాయలు’, ‘న్యాయ సుధాకర’, ‘సర్వతంత్ర స్వతంత్ర తార్కిక చింతామణి’ అని ప్రస్తుతిస్తారు.

శ్రీజయతీర్థులు మహారాష్ట్రలోని మంగళవేడ (మంగళవేడా) సమీపంలో... ఒక రాజ కుటుంబంలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ధోండూపంత్‌ (ధోండోపంత్‌) యవ్వనంలో రాజ సుఖాలను అనుభవిస్తున్న ఆయనను పూర్వజన్మ సంస్కారబలం వైరాగ్య మార్గంలో నడిపించింది. ఒకసారి గుర్రం మీద కిందికి వంగి నదిలో నీరు తాగుతున్న ధోండూపంత్‌ను చూసిన శ్రీఅక్షోభ్యతీర్థులు... శ్రీమధ్యాచార్యుల కాలంలో సేవ చేసిన ఒక ఎద్దు ఈ జన్మలో ధోండూపంత్‌గా జన్మించినట్టు గుర్తించారు. ఆ వృషభం ప్రతిరోజూ శ్రీమధ్వాచార్యుల గ్రంథాలను మోసి సేవచేసేది. ఆ సేవాఫలమే ఈ జన్మలో మహాజ్ఞానరూపంగా వికసించింది. తదుపరి కాలంలో ధోండూపంత్‌ సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి... శ్రీజయతీర్థులయ్యారు.

అద్వితీయ గ్రంథం న్యాయసుధ

సుమారు ఇరవైకి పైగా అమూల్యమైన గ్రంథాలను శ్రీజయతీర్థులు రచించారు. వాటిలో న్యాయసుధ, తత్త్వప్రకాశిక, ప్రమేయదీపిక, న్యాయవివరణ, ప్రామాణపద్ధతి, వాదావళి, ఉపాధిఖండన, మాయావాదఖండన, విష్ణుతత్త్వ నిర్ణయటీకా, గీతాభాష్యటీకా, బ్రహ్మసూత్రభాష్యటీకా, ఉపనిషద్భాష్యటీకాలు ముఖ్యమైనవి. ఈ గ్రంథాల ద్వారా ద్వైత సిద్ధాంతానికి అఖండమైన తాత్త్విక పునాది ఏర్పడింది. ‘సుధా వా పఠనీయా, వసుధా వా పాలనీయ...’ అనే ప్రసిద్ధమైన నానుడి ఒకటి మాధ్వ మఠాలలో తరచూ వినిపిస్తుంది. అంటే... ‘న్యాయ సుధను అధ్యయనం చేయాలి. లేకుంటే భూమిని పాలించే రాజు కావాలి’ అని అర్థం. ఆ రెండిటికీ అసాధారణమైన సామర్థ్యం అవసరమన్నది దీనిలోని భావం. మధ్వ సిద్ధాంతాన్ని గ్రహించాలంటే శ్రీజయతీర్థుల అనుగ్రహం తప్పనిసరి. న్యాయసుధ కేవలం ఒక వ్యాఖ్యానం కాదు... ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, తర్కం, మీమాంస, వ్యాకరణం తదితర శాస్త్రాల సమన్వయంతో రూపొందిన సమగ్ర గ్రంథం. నేటికీ మాధ్వ విద్యార్థి శాస్త్రాధ్యయనంలో ప్రవేశిస్తే... అతని ఉండే మహా గ్రంథం న్యాయసుధ. అన్ని శాస్త్రాలు చదివి, చివరగా శ్రీమన్యాయసుధను అధ్యయనం చేసిన విద్యార్థికి.. అంతిమ పరీక్ష జరిగాక... అతను సుధా పండితుడై విద్యాపీఠం నుంచి బయటకు వస్తాడు. శాస్త్రాధ్యయనం, పాఠ ప్రవచనాలు, సమాజంలో ధర్మ జాగృతి లక్ష్యంగా తన జీవనాన్ని శ్రీహరిసేవలో గడుపుతాడు.


ఆచార్యులకు మార్గదర్శి

ద్వైత వేదాంతానికి ప్రపంచఖ్యాతి తెచ్చిన వారు శ్రీవ్యాసరాయలు. ఆయన శ్రీజయతీర్థుల వ్యాఖ్యానాలను తన రచనలకు ప్రామాణికంగా స్వీకరించారు. శతాధిక గ్రంథకర్త అయిన శ్రీ విజయేంద్రతీర్థులు... టీకాచార్యుల వ్యాఖ్యానాలను ఆధారంగా తీసుకొని మరింత విశదీకరణ చేశారు. శ్రీజయతీర్థులను ‘టీకాచార్యులు’ అని అత్యంత భక్తితో శ్రీరాఘవేంద్రస్వామి స్మరించి, వారి వ్యాఖ్యానాలను అనుసరించి అనేక గ్రంథాలు రచించారు. శ్రీజయతీర్థుల అసాధారణ తార్కిక ప్రతిభను శ్రీవాదిరాజస్వాములు ప్రశంసిస్తూ ‘‘ఆయన వ్యాఖ్యానాలు ద్వైత వేదాంతపు దృఢమైన కోట’’ అని అభివర్ణించారు. అంతేకాదు... జయతీర్థుల తార్కిక శక్తిని ఇతర వేదాంత సంప్రదాయాల పండితులు సైతం గౌరవించారు. శ్రీజయతీర్థుల ప్రతిభకు ముగ్ధులై... అద్వైత సంప్రదాయానికి చెందిన విద్వన్మణి శ్రీవిద్యారణ్యులు ఆయన గ్రంథాలను పట్టపుటేనుగుపై ఊహించారు. అప్పయ్యదీక్షితులు ప్రత్యర్థి సిద్ధాంతానికి చెందినవారైనా... ఆయన అసాధారణ పండిత్యాన్ని గౌరవించినట్టు కథలున్నాయి. సురేంద్రనాథ్‌ గుప్తా, బి.ఎన్‌.కె.శర్మ, కె.టి.పాండురంగి, ఎస్‌.ఎన్‌సుబ్బారావు తదితర ఆధునిక సంస్కృత పండితులు, తత్త్వశాస్త్ర చరిత్రకారులు కూడా భారతీయ తర్క సంప్రదాయంలో అగ్రశ్రేణి వ్యాఖ్యాతగా శ్రీజయతీర్థులను ప్రస్తుతించారు. గురుభక్తి జీవితాన్ని మార్చగలదని, వినయం లేకుండా విద్య ఫలించదని, శాస్త్రాధ్యయనం భక్తితో కూడి ఉండాలని, తర్కం భగవద్విశ్వాసానికి విరోధం కాదని, దానికి బలాన్ని ఇస్తుందని, సత్యాన్వేషణ జీవిత పరమార్థమని, ఐశ్వర్యం కన్నా జ్ఞానం, జ్ఞానం కన్నా గురుకృప గొప్పవని, గురుకృపకు మూలం భగవదానుగ్రహమేననీ శ్రీజయతీర్థులు తన వ్యాఖ్యానాల ద్వారా, జీవితం ద్వారా మానవాళికి సందేశాన్ని ఇచ్చారు. శ్రీజయతీర్థుల మూల బృందావనం కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా మలఖేడ్‌లో ఉంది. అది ఒకప్పుడు రాష్ట్రకూటుల రాజధానిగా వెలుగొందిన చారిత్రక పుణ్యక్షేత్రం.

శ్రీమధ్వ ప్రచార పరిషత్‌

9440258841

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 02:02 AM