జ్ఞానం... ఒక సహజ ప్రక్రియ
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:05 AM
ఈ యుగంలో మనిషి ప్రతిదీ వేగంగా పొందాలని కోరుకుంటున్నాడు. కొన్ని క్షణాల్లో సమాచారం, కొన్ని నిముషాల్లో నిర్ణయాలు, కొద్ది రోజుల్లో ఫలితాలు కావాలనుకొనే మనస్తత్వం పెరిగింది. కానీ...
సహజయోగ
ఈ యుగంలో మనిషి ప్రతిదీ వేగంగా పొందాలని కోరుకుంటున్నాడు. కొన్ని క్షణాల్లో సమాచారం, కొన్ని నిముషాల్లో నిర్ణయాలు, కొద్ది రోజుల్లో ఫలితాలు కావాలనుకొనే మనస్తత్వం పెరిగింది. కానీ ఈ వేగాన్ని ఆధ్యాత్మికత ఏమాత్రం అంగీకరించదు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పుస్తకాలు కంఠస్తం చేస్తే కలిగేది కాదు, ఉపన్యాసాల ద్వారా సంపాదించేది కాదు, బలవంతంగా మనసులో నింపేది కాదు. అది సహజంగా జరిగే ఆంతరంగిక పరిణామం. ఈ సత్యాన్నే సహజయోగ వ్యవస్థాపకురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి సమగ్రంగా వివరించారు. సహజయోగ ద్వారా కలిగే దైవిక జ్ఞానం నెమ్మదిగా, నిశ్శబ్దంగా మనలో ప్రవేశిస్తుందనీ, కానీ శాశ్వతంగా ఉంటుందని ఆమె చెప్పారు. అందుకోసం మహాకవి సంత్ జ్ఞానేశ్వర్ మాటలను ఉపమానంగా తీసుకున్నారు. ఆయన మాటల ప్రకారం... పూల రేకులు నేల మీద పడినప్పుడు ఎలాంటి శబ్దాన్ని చెయ్యవు. భూమిని అవి గాయపరచవు. మృదువుగా, సహజంగా నేలమీద వాలిపోతాయి. కానీ వాటి పరిమళం మాత్రం చుట్టూ వ్యాపిస్తుంది. అలాగే మనసు సిద్ధంగా ఉన్నప్పుడు, హృదయం వినయంతో నిండినప్పుడు దైవిక జ్ఞానం మనలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది. తనంతట తానే వికసిస్తుంది. అందుకే నిజమైన ఆధ్యాత్మిక పరివర్తన బయటకు కనిపించే మార్పు కాదు. అది అంతరంగంలో ప్రారంభమై... క్రమంగా వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిమళింపజేసే జీవన ప్రక్రియ.
ఆత్మజ్ఞానానికి ప్రతీక
భారతీయ సాహిత్యంలో చకోర పక్షికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది పున్నమి చంద్రుడి వెన్నెలను అమృతంగా భావించి, దాన్నే ఆస్వాదిస్తుందని కవులు వర్ణించారు. దీన్ని సంత్ జ్ఞానేశ్వర్ తన రచనవో ఉదహరించారు. ఇక్కడ చంద్రుడు ఆత్మకు సంకేతం. చంద్రకాంతి అంటే దైవిక చైతన్యం. ఆ వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షిలా... సాధకుడు కూడా దైవిక చైతన్యాన్ని అనుభవిస్తూ జీవించాలి. అప్పుడు జ్ఞానం అనేది బాహ్యంగా వినిపించే మాటగా కాకుండా... అంతరంగంలో శాశ్వతంగా నిలిచే అనుభవంగా మారుతుంది.
పరివర్తన కావాలి
నేటి ప్రపంచంలో సమాచారానికి కొదవ లేదు. వేలాది పుస్తకాలు, లక్షలాది వీడియోలు, అనేక ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మనిషి అంతరంగంలో శాంతి తగ్గుతోంది. ఎందుకంటే సమాచారం పెరగడం వేరు, జ్ఞానం వికసించడం వేరు. సహజయోగ చెప్పేది కూడా ఇదే. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మెదడులో నిలిచిపోయే సిద్ధాంతం కాదు. అది మన నాడీ వ్యవస్థల్లో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో మన ఆత్మను ప్రతిబింబించే జీవన విధానం. శ్రీమాతాజీ మాటల్లో చెప్పాలంటే... దైవిక జ్ఞానం మనలో ప్రవేశించినప్పుడు దాన్ని బయటకు ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అది మన ప్రవర్తనలో వ్యక్తమవుతుంది. మన మాటల్లో సహనం పెరుగుతుంది. మన నిర్ణయాల్లో వివేకం కనిపిస్తుంది. మన ముఖంలో ప్రశాంతత ప్రతిఫలిస్తుంది. మన సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. అలవాట్లలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇది అంతరంగ పరివర్తన ద్వారా సహజంగా కలిగే ఫలితం.
తొందరపాటు పనికిరాదు
విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు. శిశువు ఒక్క రోజులో పెద్దవాడు కాలేడు. ప్రకృతిలో ప్రతి వికాసానికి సమయం అవసరం. అదే విధంగా ఆధ్యాత్మికమైన ఎదుగుదల కూడా ఒక క్రమంలో జరుగుతుంది. తొందరపడే మనసు ఫలితాల కోసం వెతుకుతుంది. సహనంతో ఉండే మనసు అనుభవాన్ని ఆస్వాదిస్తుంది. సహజయోగ ఈ సహనాన్నే నేర్పుతుంది. జ్ఞానం అనేది సంపాదించేది కాదు... సహజంగా వికసించేది. ఆందోళన, ఒత్తిడి, పోటీ, అసహనం పెరుగుతున్న ఈ కాలంలో మనిషికి అత్యంత అవసరమైనది... అంతరంగ ప్రశాంతత. ఈ ప్రశాంతత బాహ్యమైన విజయాలతో రాదు. మనలోని చైతన్యం మేల్కొన్నప్పుడు మాత్రమే లభిస్తుంది. నిజమైన జ్ఞానం శబ్దం చెయ్యదు. అది పువ్వు పరిమళంలా నిశ్శబ్దంగా వ్యాపిస్తుంది. చంద్రకాంతిలా మృదువుగా మన హృదయాన్ని తాకుతుంది.
కాలక్రమేణా మన ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మార్చి.. మనల్ని మరింత ప్రేమ, ప్రశాంతత, సమతుల్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ