మీరు వెతికేది మిమ్మల్నే
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:23 AM
భగవంతుణ్ణి చేరాలంటే గొప్ప పాండిత్యం కావాలనో, కఠినమైన సాధనలు చేయాలనో, సన్యాసిలా జీవించాలనో చాలామంది అనుకుంటారు. కానీ నిజం దీనికి పూర్తి భిన్నంగా...
చింతన
భగవంతుణ్ణి చేరాలంటే గొప్ప పాండిత్యం కావాలనో, కఠినమైన సాధనలు చేయాలనో, సన్యాసిలా జీవించాలనో చాలామంది అనుకుంటారు. కానీ నిజం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రతి మనిషిలో సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరు గొర్రెల కాపరి కావచ్చు, ఒకరు పండితుడు కావచ్చు, మరొకరు సన్యాసి కావచ్చు... కానీ దైవానుభూతి అందరికీ సాధ్యమే.
సామీప్యానికి కొలమానం
‘భగవంతుడికి దగ్గరగా ఉన్నామా? లేదా?’ అనేది తెలుసుకోవడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. మీరు హృదయపు లోతుల్లో ఆనందంగా ఉన్నట్టయితే... భగవంతుడికి దగ్గరగా ఉన్నారు. గాఢమైన దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు దగ్గరగానే ఉంటారు. మనం ప్రపంచాన్ని ‘మంచి-చెడు, ఒప్పు-తప్పు, వెలుగు-చీకటి’ అంటూ విభజించుకోవడం అలవాటు చేసుకున్నాం. కానీ ఈ విభజన నిజం కాదు. అన్నీ ఒకే ఒక అనంతమైన శాశ్వతమైన సత్యంలో భాగాలే. ఈ సత్యానికి శివుడు ప్రతీక. ఆయన అత్యంత వ్యక్తిగతుడు. అదే సమయంలో సర్వవ్యాపకుడు కూడా. కనిపించేదీ శివుడే, కనిపించనిదీ శివుడే. రాత్రి దీనికి అద్భుతమైన ఉదాహరణ. చీకట్లో అనంతమైన ఆకాశం, అనేక నక్షత్రాలు, బ్రహ్మాండమైన విస్తృతి కనిపిస్తాయి. రాత్రి మనల్ని అక్కున చేర్చుకుంటుంది. శాంతింపజేస్తుంది. ధ్యానం, సమాధి స్థితి కూడా ఇంతే. మనం మనసు లోతుల్లోకి దిగినప్పుడు నిజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది శివరాత్రి తాలూకు భావన. లోపల మేల్కొని ఉండడం, మనలోనే విశ్రాంతి పొందడం. భగవంతుడి సాక్షాత్కారం కాలంతోనో, అర్హతతోనో కాదు... తీవ్రమైన తపనద్వారా కలుగుతుంది. ‘నేను ఏమీ కాదు, నాకు ఏదీ అవసరం లేదు’ అని అంతర్గతంగా అర్థం చేసుకున్నప్పుడు... హృదయంలో అపూర్వమైన ఒక ఆప్యాయత పుడుతుంది. అదే ఆప్యాయత తపనను గాఢంగా చేస్తుంది. ‘కోరిక’ అనేది మెదడు చేసే కలకలం. ‘తపన’ అనేది హృదయం తాలూకు పిలుపు. మొత్తం బ్రహ్మాండాన్ని ప్రేమించగలిగినవాడే నిజమైన భక్తుడు. ఎవరినైనా చెడ్డవాడని అనడం చాలా సులభం. కానీ వాస్తవానికి చెడ్డవారెవరూ ఉండరు. మనుషులు చెడు పనులు చేయడానికి కారణం... అజ్ఞానం, బాధ, లోపలి గాయాలు. లోభం, ద్వేషంతో నిండిన మనసుకి గాఢమైన విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేనిచోట ధ్యానం ఉండదు. శాంతిని బయటినుంచి తెచ్చుకోలేం. అది లోపలినుంచే విస్తరిస్తుంది. అయితే శాంతమైన ఒక వ్యక్తి తన చుట్టూ శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తాడు.
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
ప్రతి మనిషీ యోగే...
ఒకే ఒక్క మంత్రం... ఓం నమఃశివాయ... మనసును తేలిక చేస్తుంది. భయాలు కరిగిపోతాయి. అలసట తొలగిపోతుంది. లోపల ఆనందం కలుగుతుంది. శివుడు సత్యం. శివుడు చైతన్యం. శివుడు ఆనందం. యోగికి ఇవన్నీ కథలు కావు... ప్రత్యక్ష అనుభవాలు. మరో సత్యం ఏమిటంటే... ప్రతి మనిషీ యోగే. ఆ సంగతి అతనికి గుర్తుచేయాలి అంతే. భగవంతుణ్ణి సంతోషపెట్టామా? అసంతృప్తికి గురిచేశామా? అనే ఆందోళన వదిలెయ్యండి. భగవంతుడు బయట కూర్చున్న శక్తికాదు. ఆయన మనలోనే ఉన్నాడు. చుట్టూ ఉన్నాడు. మనం వదిలేయడం నేర్చుకుంటేనే... దేన్నయినా పొందగలం. మనస్సు విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అర్థమవుతుంది... ‘మనం వెతుకుతున్నది మనల్నే’ అని.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు