Share News

సోనియా మెచ్చిన ‘భలే’చరీ

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:44 AM

రాజకీయ వేదికలపై ఎప్పుడూ నిరాడంబరమైన కాటన్‌ లేదా హ్యాండ్లూమ్‌ చీరల్లో కనిపించే సోనియాగాంధీ ఇటీవల తన పుస్తకావిష్కరణ వేడుకలో....

సోనియా మెచ్చిన ‘భలే’చరీ

రాజకీయ వేదికలపై ఎప్పుడూ నిరాడంబరమైన కాటన్‌ లేదా హ్యాండ్లూమ్‌ చీరల్లో కనిపించే సోనియాగాంధీ ఇటీవల తన పుస్తకావిష్కరణ (బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌) వేడుకలో అరుదైన ‘బాలూచరీ’ పట్టు చీరలో మెరిశారు. పశ్చిమ బెంగాలీ సంప్రదాయ ‘బూటేదార్‌ గోలానీ బాలూచరీ’ చీర ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది.

కథలు చెప్పే ‘బాలూచరీ’ కళ: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ సంప్రదాయ పట్టుచీరల ప్రత్యేకత వాటి కొంగు (పల్లు)పైనే ఉంటుంది. ఒక కథాచిత్రంలా పురాణ ఇతిహాసలు లేదా సంప్రదాయ దృశ్యాలను చేనేత కార్మికులు కొంగుపై అద్భుతంగా నేస్తారు.

పుట్టినిల్లు ముర్షిదాబాద్‌: బాలూచరీ చీరలు మొదట ముర్షిదాబాద్‌ జిల్లాలోని ‘బాలూచర్‌’ గ్రామంలో పురుడుపోసుకున్నాయి. ప్రస్తుతం బంకురా జిల్లాలోని ‘బిష్ణుపూర్‌’ ఈ చీరల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉంది. కొన్ని రకాల బూటేదార్‌ చీరలను వారణాసిలోనూ నేస్తున్నారు.

అరుదైన ‘గోలానీ’ నేత విధానం: చీరపై డిజైన్లు (బూటీలు) వేయడంలో ‘చలానీ’, ‘గోలానీ’ అనే రెండు పద్ధతులుంటాయి. ‘చలానీ’లో అదనపు దారం చీర ఒక చివరి నుంచి మరో చివరి వరకు సాగుతుంది. కానీ ‘గోలానీ’ పద్ధతిలో ప్రతి బూటీకి విడిగా దారాన్ని ఉపయోగించి డిజైన్‌ ముగియగానే అక్కడే ముడివేస్తారు. దీనివల్ల చీర వెనుక భాగంలో దారాలు వేలాడటం గానీ, కత్తిరించడం గానీ ఉండదు. ఈ ప్రక్రియకు చాలా శ్రమ, సమయం అవసరం కావడంతో వీటి ధర కూడా ఎక్కువే.

కనుమరుగవుతున్న ‘బాక్స్‌ పల్లు’: గోలానీ నేయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల నేటి బాలూచరీ చీరల్లో సాధారణంగా సమాంతర కొంగు మాత్రమే వస్తోంది. కానీ సోనియాగాంధీ కట్టుకున్న చీరలో పాతకాలపు సంప్రదాయమైన ‘బాక్స్‌ పల్లు’ ఉంది. ప్రస్తుతం చాలా కొద్ది మగ్గాలపైనే వీటిని నేస్తున్నారు.


గోలానీ చీరను ఇలా గుర్తించవచ్చు

రంగుల బూటీలు: చీరపై ఒకే వరుసలో ఆకుపచ్చ, పసుపు, లేత పసుపు రంగుల బూటీలు ఉన్నాయి. ఒకే దారంతో నేసే చలానీ పద్ధతిలో మధ్యలో రంగు మార్చడం సాధ్యం కాదు. గోలానీలో మాత్రమే ఇది వీలవుతుంది.

మీనాకారీ అంచు: రెండు రంగుల మేళవింపుతో కూడిన మీనాకారీ బోర్డర్‌ కూడా గోలానీ పనితనానికి నిదర్శనం.

పల్లు మధ్య ఖాళీ: కొంగులోని బాక్స్‌ డిజైన్ల మధ్య ఖాళీ ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది. చలానీ పద్ధతిలో అయితే ఆ ఖాళీ గుండా దారం సాగుతూ కనిపిస్తుంది.

‘ధూప్‌ ఛాయా’తో కనువిందు: సోనియాగాంధీ కట్టుకున్న చీర నేయడానికి ఒకటి నీలం, మరొకటి రాణి పింక్‌ దారాలను వాడారు. బెంగాలీలో దీనిని ‘ధూప్‌ ఛాయా’ (ఎండనీడల కలయిక) అంటారు. ఈ రెండురంగుల కలయిక వల్ల చీర మొత్తం ఊదా రంగులో మెరుస్తూ.. కదిలినప్పుడల్లా నీలం, గులాబీ ఛాయలను అద్భుతంగా ప్రతిబింబిస్తోంది.

చారిత్రక నేపథ్యం: 18వ శతాబ్దంలో బెంగాల్‌ నవాబు ముర్షిద్‌ కులీఖాన్‌ (1717-1727) ప్రోత్సాహంతో ఈ కళ వెలుగులోకి వచ్చింది. 2011లో బిష్ణుపూర్‌ బాలూచరీ చీరలకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఇప్పుడు సోనియాగాంధీ ఈ అరుదైన చీరను ధరించడంతో బెంగాల్‌ చేనేత కళాకారుల నైపుణ్యానికి మరోసారి జాతీయ గుర్తింపు లభించింది.

కష్టకాలం నుంచి పునరుజ్జీవం

నిజానికి 20వ శతాబ్దం నుంచి బాలూచరీ చీరల ప్రాభవం తగ్గుతూ వస్తోంది. చవకైన ప్రత్యామ్నాయాలు రావడం, బనారసి బ్రొకేడ్‌ల ఆదరణ పెరగడంతో బాలూచరీ చీరలకు డిమాండ్‌ బాగా తగ్గింది. అయితే, ఆ తర్వాత ఈ కళను బతికించేందుకు ప్రత్యామ్నాయాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేత కార్మికులకు జాక్వర్డ్‌ మగ్గాలు, బనారసి జాలా పద్ధతలును పరిచయం చేశారు. దీనివల్ల క్లిష్టమైన డిజైన్లు, మోటిఫ్‌లను సులభంగా నేయడంతో పాటు వాటిని భద్రపరచడం సాధ్యమైంది. ఇప్పుడు సోనియాగాంధీ ఈ చీరను ధరించడంతో మళ్లీ బాలూచరీ చీరల గురించి చర్చ మొదలైంది.

ఈ వార్తలు కూడా చదవండి..
మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Updated Date - Nov 19 , 2026 | 03:45 AM