Share News

మీ రక్షణ కవచం మీరే

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:07 AM

సోహా అలీఖాన్‌... క్రికెట్‌ దిగ్గజం పటౌడీ... నటి షర్మిలా ఠాగూర్‌ తనయ... హీరో సయీఫ్‌ అలీఖాన్‌ సోదరి... స్టార్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ వదిన... ఈ నేపథ్యం ఆమెను ప్రపంచానికి పరిచయం చేసి ఉండవచ్చు. కానీ ఆ...

మీ రక్షణ కవచం మీరే

సెలబ్‌ టాక్‌

సోహా అలీఖాన్‌... క్రికెట్‌ దిగ్గజం పటౌడీ... నటి షర్మిలా ఠాగూర్‌ తనయ... హీరో సయీఫ్‌ అలీఖాన్‌ సోదరి... స్టార్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ వదిన... ఈ నేపథ్యం ఆమెను ప్రపంచానికి పరిచయం చేసి ఉండవచ్చు. కానీ ఆ ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తూనే తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. నటిగానే కాకుండా ఇల్లాలిగా, రచయితగా, పాడ్‌కాస్టర్‌గా విలక్షణమైన పాత్రల్లో ఒదిగిపోయిన సోహాకు చేసే పనిలో, మాట్లాడే మాటలో స్పష్టత ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె... నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను మహిళలు ఎలా అధిగమించాలో తన అనుభవాలను ఉదహరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.

‘‘మనం మనలా ఉండాలంటే ఆత్మస్థైర్యం, ధైర్యం కావాలి. సామాజిక మాధ్యమాలు లేని యుగంలో నేను పెరిగాను. సూపర్‌స్టార్లతో కలిసి ఎదగడం అనేది ఒక రకమైన ఒత్తిడితో కూడుకున్నది. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి చదువు నాకు ఒక ఆసరాగా నిలిచింది. కానీ నాటి రోజులతో పోలిస్తే ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్ల ప్రపంచంలో జీవించడమనేది మరింత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే నేటి తరం ఎవరెవరినో చూసి వారిలా ఉండాలనే ఒత్తిడికి లోనవుతోంది. ఆ క్రమంలో మనలోని అంతర్గత తేజస్సును మనమే మసకబార్చుకొంటాము. ‘నేనంటే ఇది’ అని చెప్పగలగడానికి చాలా ధైర్యం కావాలి.

హృదయం చెప్పింది వినండి...

  • మీరు పదేళ్లపాటు భారత జట్టు కెప్టెన్‌గా ఉండబోరని, లేదా జాతీయ అవార్డు గ్రహీత నటుడిని కాలేమని గ్రహించినప్పుడు ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని నేను అనుకొంటున్నాను. మన శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలుసుకోకుండా ఎవరితోనో పోటీపడితే నష్టపోయేది మనమే.

  • ఏదిఏమైనా సంతోషంగా జీవించడంపై దృష్టి పెట్టండి. మీకు ఆనందం కలిగించే పనులే చేయండి. ‘ఇది చేయండి... అది చేయండి’ అని చెప్పే సమూహానికి ఆత్మస్థైర్యంతో ఎదురు నిలిచి, మీ హృదయం చెప్పేది వినండి. నేను అదే చేశాను. చేస్తున్నాను. నేను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నా. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’లో మాస్టర్స్‌ చేశాను. నా విద్యా నేపథ్యంవల్ల మా కుటుంబంలో నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఎందుకంటే మా అమ్మ, అన్నయ్య యూనివర్సిటీకి వెళ్లలేదు. మా నాన్న ఆక్స్‌ఫర్డ్‌లో చదివినా... ఎప్పుడూ క్రికెట్‌ మైదానంలోనే ఉండేవారు. అలాగని తమ కలల్ని సాకారం చేసుకోవడానికి ఇవేవీ వాళ్లకు అవరోధం కాలేదు. కారణం... వారు వారి మనసు చెప్పింది విన్నారు.


కనిపించని భారం...

అన్నిటికంటే వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పు మాత్రమే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. విశ్రాంతి దొరికినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నేడు దృష్టి సారించాల్సిన అంశం ఒక్కటే... చేసే పని. అది మినహాయిస్తే జీవితం క్షణం తీరిక లేకుండా సాగిపోతోంది. కూతురు ఇనాయా, భర్త కునాల్‌ ఖేము, అత్తమామలు, పిల్లల ఆటలు, స్కూల్లో పేరెంట్‌- టీచర్‌ మీటింగ్‌లు... ప్రశాంతమైన ఘడియ ఉండదు. చాలామంది మహిళలు కుటుంబంలో ఇప్పటికీ కంటికి కనిపించని అతి భారాన్ని మోస్తున్నారని అనిపిస్తుంది. నేను ‘ఆల్‌ ఎబౌట్‌ హర్‌’ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించడానికి గల ఏకైక కారణం... నాకు సామూహిక శక్తిపై ఉన్న నమ్మకం. ప్రజలంతా ఒకచోట చేరి, ఒక సురక్షితమైన ప్రదేశంలో, వడపోతలు లేకుండా, తీర్పులు ఇవ్వకుండా చర్చించుకోవడం. ఎవరైనా మీరు చెప్పేదానితో ఏకీభవించకపోయినా పరవాలేదు, కానీ అడ్డుకోకూడదు. అలాంటి వాతావరణానికి వేదిక నా పాడ్‌కాస్ట్‌.

స్పాంజి లాంటివారు...

  • ఇక పిల్లల విషయానికి వస్తే ఒక్కటి కచ్చితంగా చెప్పగలను... వారు స్పాంజి లాంటివారు. ఇంటి వాతావరణాన్ని, ఆ ఇంట్లో జరిగే ప్రతి అంశాన్నీ గ్రహిస్తారు. నా చిన్నప్పుడు మా అమ్మ షూటింగ్‌లకు వెళ్లే రోజులు ఇంకా గుర్తున్నాయి. నాన్న ఇంట్లో ఉండేవారు. ఒకవేళ అమ్మ సాయంత్రం వేళ షూటింగ్‌కు వెళ్లాలంటే నాన్న అనుమతి తీసుకోవాల్సివచ్చేది. ఉద్యోగం చేసే తల్లి అంటే కలలు కనే తల్లి అని, అంతేగానీ ఇంటిని, పిల్లలను పట్టించుకోని ఇల్లాలు కాదని అమ్మను చూశాకే అర్థమైంది. ఆ నీడలో పెరిగాను.

  • ఇనాయా చిన్నప్పుడు నేను షూటింగ్‌లు, లేదా మరేదైనా పనిపై వెళ్లాల్సివస్తే క్షమించమని తనను అడిగేదాన్ని. కానీ తరువాత మానేశాను. ‘ఎందుకంటే... చేస్తున్న పనిని నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని ఇనాయాకు చెప్పాను. అలాగే భవిష్యత్తులో నచ్చిన కెరీర్‌ను ఎంచుకొనే స్వేచ్ఛ తనకూ ఇస్తాను.

  • మన చుట్టూ ఉన్న మనుషులు, మన చెవుల్లో వినపడే స్వరాలు, మనల్ని ఉన్నత స్థితికి చేర్చే సమాజం... వీటన్నిటిపై నాకు నమ్మకం ఉంది. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది... మీ చుట్టూ ఎవరున్నా, ఎవరు ఏం చెప్పినా మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ సామర్థ్యం ఏమిటో మీకు తెలియాలి. ఆదర్శవంతంగా మీకు మీరే ఒక కోటగా మారాలి. మీకు మీరే రక్షకులు కావాలి.’’


అతిగా ఆలోచించవద్దు...

వయసు పెరగడం అనేది నేను ప్రతి రోజూ ఎదుర్కొనే సమస్య. ఎందుకంటే నాకు నా రూపం పట్ల ఎంతో మమకారం ఉంది. కారణం, ముఖంపై ముడతలు రావడం, చర్మం పొడిబారటం... వృద్ధాప్యంతో వచ్చే ఇలాంటివన్నీ అద్భుతంగా ఉన్నాయని ఎవరూ అనరు కదా. అయితే పరిశ్రమలో సర్వసాధారణమైన కాస్మొటిక్‌ సర్జరీలకు నేను వ్యతిరేకం. నన్ను అందరూ మా నాన్నలా ఉన్నావంటారు. అందుకు నేను గర్వపడతాను. ఆ రూపాన్ని నేను మార్చుకోవాలనుకోవాలని అనుకోవడంలేదు. ఇతరుల గుర్తింపు ఆశించేముందు ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం స్వీకరించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇది ఒక నిత్య పోరాటం.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 06:07 AM