తేనెలూరే అభిరుచి
ABN , Publish Date - Apr 29 , 2026 | 02:50 AM
మంచి జీతం... సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలిపెట్టి... కష్టమని తెలిసినా తేనె సాగు చేపట్టారు. అమెరికాలో వ్యవసాయం చేస్తున్న అక్క స్ఫూర్తితో... అంకుర సంస్థను స్థాపించి అభిరుచికి...
విభిన్నం
మంచి జీతం... సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలిపెట్టి... కష్టమని తెలిసినా తేనె సాగు చేపట్టారు. అమెరికాలో వ్యవసాయం చేస్తున్న అక్క స్ఫూర్తితో... అంకుర సంస్థను స్థాపించి అభిరుచికి పట్టం కట్టారు. సవాళ్లను స్వీకరించి... ఒడుదొడుకులను అధిగమించి... మరికొంత మంది మహిళలకు ఉపాధి మార్గమయ్యారు. విభిన్న రంగంలోకి అడుగిడి... అందరి ప్రశంసలు అందుకొంటున్న యువతి... కూచిపూడి కృష్ణవేణితో ‘నవ్య’ మాటామంతి.
‘‘అందరిలా చదువు కాగానే నేనూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వెంట పరుగెత్తా. రెండేళ్లు ఐటీలో పని చేశా. కానీ సంతృప్తినివ్వలేదు. అందుకే ఆ కొలువు వద్దనుకుని బయటకు వచ్చేశాను. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే నాకు వ్యవసాయంపై మక్కువ కలిగింది. మా పొలంలోనే సేంద్రియ సాగు చేసి లాభసాటి వ్యవసాయాన్ని మా నాన్నకు బహుమతిగా ఇవ్వాలనుకున్నా. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది! గుంటూరు జిల్లా తెనాలిలో ఓ చిన్న ఇంట్లో మా నివాసం. నాన్న కూచిపూడి బసవపున్నయ్య. అమ్మ వెంకటేశ్వరమ్మ. ఐదుగురు సంతానంలో నలుగురు అక్కచెల్లెళ్లం. నాన్న మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి, మమ్మల్ని అందరినీ ప్రయోజకులను చేశారు. ఆయన పడ్డ కష్టానికి ఫలితంగా ఐదుగురం సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాం.
ఆ ఇష్టంతోనే...
నాకు మొదటి నుంచీ ఆర్గానిక్ సాగుపై ఇష్టం ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అది కుదరలేదు. ఇంజినీరింగ్ అయ్యాక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల అతి కష్టం మీద పని చేశాను. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో... ఎప్పుడు పోతుందో తెలియని సందిగ్ధంలో... రోజుకొక గండంలా గడుపుతున్న నా సహచరులను ఎందరినో చూశా. ఉద్యోగం ఉన్నా భరించలేని ఒత్తిడి. ఇలాంటి కొలువుల్లో కొనసాగడం నావల్ల కాదని ఐటీ నుంచి బయటకు వచ్చేశాను. తర్వాత చెన్నైలోని ఓ అగ్రీ కంపెనీలో చేరాను. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక కొటేషన్ నన్ను బాగా అకట్టుకుంది. ‘ఒకవేళ భూమిపై నుంచి తేనెటీగలు కనుమరుగైపోతే, మానవుడు జీవించటానికి కేవలం నాలుగు సంవత్సరాల ఆయుష్షు మాత్రమే మిగిలి ఉంటుంది’... అనేది కొటేషన్. అంటే తేనెటీగలు లేకపోతే మొక్కలలో పరాగ సంపర్కం ఉండదని, మొక్కలు లేకపోతే జంతువులు, మానవుడి మనుగడ భూమిపై ఉండదనేది దాని అర్థం. ఇప్పటికే తుమ్మెదలు చాలావరకు అంతరించిపోయాయి. తేనెటీగలే ఫల సాయానికి కీలకంగా మారాయి. వీటిని కూడా కాపాడుకోలేకపోతే రేపటి రోజున మా నాన్న లాంటి రైతులు ఏమైపోతారనే ఆందోళన మొదలయింది. దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతోనే... ఆ ఉద్యోగం కూడా వదిలేసి తేనె పరిశ్రమ పెడదామని నిర్ణయించుకున్నా.

సోదరి స్ఫూర్తితో...
విషయం నాన్నతో పాటు అమెరికాలో ఉన్న నా సోదరి రాజ్యలక్ష్మికి చెప్పాను. తను అక్కడ కొద్దిపాటి భూమిలో సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తోంది. తనే నాకు స్ఫూర్తి. పూర్తి స్థాయి అవగాహన కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కె.మోహనరావును, హనీబీ రైతు సంఘాలను కలిశాను. తెనాలికి తిరిగివచ్చి రూ.1.5 లక్షలతో 200 తేనె పెట్టెలు తీసుకున్నా. అయితే ఆ పెట్టెలను అమర్చటం చాలా కష్టం. సీజన్‌ను బట్టి నువ్వులు, పొద్దుతిరుగుడు, మామిడి, వేప, కుంకుడు లాంటి పంటలు సాగు చేసే ప్రాంతాలకు పెట్టెలను ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి మార్చాల్సి ఉంటుంది. వాటిని తరలించటం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో తేనె పరిశ్రమలో అనుభవం ఉన్న రైతు శ్రీనివాసరావు సహాయం తీసుకున్నాను. పెట్టెలు పెట్టాక ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వేసినప్పుడు కష్టమంతా ఆవిరైపోయేది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెనెటీగలను తినే పక్షులు ఎక్కువగా వచ్చేవి. వాటి నుంచి ఈగలను కాపాడుకోవటం కూడా ఒక సవాల్‌గా నిలిచింది. ఇబ్బందులు ఎదురైనా పట్టుదలగా ప్రయత్నించాను.
నాణ్యమైన ఉత్పత్తి...
యూరోపియన్ రకానికి చెందిన ‘ఎపిస్ మెల్లిఫెరా’రకం ఈగలను ఎంపిక చేసుకున్నాం. వీటివల్ల నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేయగలిగాం. ఇవి ఒక్క సీజన్‌లో ఒక్కో బాక్సు ద్వారా 4 నుంచి 5 కేజీల తేనెను అందిస్తాయి. అయితే ఏ లేబుల్ లేకుండా అందిస్తే... స్వచ్ఛమైన తేనెకు, కల్తీ తేనెకు తేడా తెలియదు. జనం నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందాలనే ఆలోచనతో ‘బీవీకే’ బ్రాండ్‌తో తేనె సీసాలు మార్కెట్‌లోకి తీసుకొచ్చా. నేచురల్ రా హనీ, వైల్డ్ ఫారెస్ట్ హనీ, పుట్ట తేనె రకాలను మార్కెట్ చేసున్నాం. ఏపీలోని విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, శ్రీశైలం, మదనపల్లితో పాటు తెలంగాణ, కేరళలోని కొన్ని అటవీ ప్రాంతాల గిరిజనులతో ఒప్పందం చేసుకున్నాం. వారి సహకారంతో స్వచ్ఛమైన పుట్ట తేనె అందిస్తున్నాం.
లక్ష్యం... ప్రపంచ స్థాయి...
నా బ్రాండ్‌పై ఒక నమ్మకాన్ని కలిగించేందుకు స్వచ్ఛతపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. నాణ్యతాప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నందుకుగానూ తమిళనాడుకు చెందిన సంస్థ... ‘సింగప్పెన్ అవార్డు’తో గౌరవించింది. దీంతోపాటు మంత్రులు, ఇతర ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు అందుకున్నా. ప్రస్తుతం మా బ్రాండ్‌ను వెబ్‌సైట్‌తో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. డిసెంబర్‌లో ‘తెనాలి డబుల్‌హార్స్’ అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్‌తో ఒప్పందం చేసుకున్నాం. మా బ్రాండ్ ద్వారా తేనె ఒక్కటే కాకుండా సేంద్రియ పద్ధతిలో పండిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేయాలని అనుకొంటున్నా. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు
కూడా ఎగుమతి చేసే స్థాయికి సంస్థను తీసుకువెళ్లాలనేది నా లక్ష్యం.’’
తిరుమలశెట్టి శేషగిరిరావు, తెనాలి
ఫొటోలు: బిరుదురాజు విజయరాజు
మంచి తేనెకు గడువు ఉండదు
చాలామందికి తెలియని విషయం ఏంటంటే... తేనెకు ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉండదు. ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే అంత మంచిదనేది శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నా. మేము కూడా తేనె తీశాక కనీసం 8 నెలలు నిల్వ ఉంచాకే మార్కెట్‌లోకి పంపుతాం. ఎందుకంటే... అప్పటికప్పుడు తీసిన తేనెలో ఔషధ గుణాలు అంతగా ఉండవు. ఇక్కడ ఆర్గానిక్ తేనె, కల్తీ తేనె అనేవి కూడా ఉండవు. అంతా స్వచ్ఛమైన తేనే. తేనెటీగ తేనె సేకరించే సమయంలో పుష్పాలపై వాలేప్పుడే రసాయనాల వాసనలు గుర్తించి, ఆ పుష్పాలపై అసలు వాలవు. ఒకవేళ రసాయనాలు పిచికారి చేసిన పుష్పాల నుంచి తేనె ఏదైనా ఈగ సేకరించి తీసుకువెళ్లినా, బాక్సులోకి రానివ్వవు.
ఇవి కూడా చదవండి..
రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా
పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ