కర్తవ్య పథంలో
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:40 AM
దేశం పట్ల ప్రేమ... దాన్ని రక్షించుకొనే సైనికురాలిని కావాలన్న దృఢ సంకల్పం... ఆమెను సీఆర్‌పీఎఫ్ వైపు నడిపించాయి. జమ్ముకశ్మీర్ రజౌరీ జిల్లా నుంచి అత్యున్నత...
న్యూస్ మేకర్
దేశం పట్ల ప్రేమ... దాన్ని రక్షించుకొనే సైనికురాలిని కావాలన్న దృఢ సంకల్పం... ఆమెను సీఆర్‌పీఎఫ్ వైపు నడిపించాయి. జమ్ముకశ్మీర్ రజౌరీ జిల్లా నుంచి అత్యున్నత అంతర్గత భద్రతా దళంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చాయి. సిమ్రన్ బాల... అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె కెరీర్‌లో ఇప్పుడు మరో మైలు రాయి. కర్తవ్య పథ్‌లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ పురుషుల బృందానికి నాయకత్వం వహించే అరుదైన గౌరవం 26 ఏళ్ల సిమ్రన్‌కు దక్కింది.
జనవరి 26... గణతంత్ర దినోత్సవంనాడు ఢిల్లీలోని కర్తవ్యపథ్... మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. అక్కడ నిర్వహించే మార్చ్‌ఫా్‌స్టలో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) దళానికి సిమ్రన్ బాల నాయకత్వం వహించనున్నారు. గతంలో సీఆర్‌పీఎఫ్ మహిళా అధికారులు పరేడ్‌లో తమ బృందాలను ముందుండి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ 140 మందికి మించిన, పూర్తిగా పురుషులతో కూడిన భారీ బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కానుంది.
సిమ్రన్ స్వస్థలం జమ్ముకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా. ‘ది ల్యాండ్ ఆఫ్ కింగ్స్’గా పేరున్న ఈ జిల్లా... మొఘలుల కాలంనాటి కట్టడాలు, కేసరీహిల్స్ పర్యాటక ప్రాంతాలకు నిలయం. సాంస్కృతిక వైవిధ్యం దీని మరో ప్రత్యేకత. ఇలాంటి వాతావరణంలో పెరిగిన సిమ్రన్‌కు చిన్నప్పటి నుంచి దేశం పట్ల అమితమైన ప్రేమ. పుట్టి పెరిగిన ప్రాంతం... భిన్నత్వంలో ఏకత్వం చాటుకున్న దేశం... ఇవే ఆమెకు స్ఫూర్తి. అందుకే ఒక సిపాయిగా దేశానికి సేవలు అందించాలనుకున్నారు. జమ్ములోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. అనంతరం యూపీఎ్‌ససీ నిర్వహించిన ‘సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్’ పరీక్ష రాసి అర్హత సంపాదించారు.
శిక్షణలో మేటి...
గురుగ్రామ్‌లోని సీఆర్‌పీఎఫ్ అకాడమీలో సిమ్రన్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ సమయంలో పబ్లిక్ స్పీకింగ్ సబ్జెక్ట్‌లో అసమాన ప్రతిభ కనబరిచారు. ‘బెస్ట్ ఆఫీసర్ ఇన్ ట్రైనింగ్’ అవార్డును అందుకున్నారు. విశేషమేమిటంటే... రజౌరీ జిల్లా నుంచి దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళంలో ఆఫీసర్ ర్యాంకులో చేరిన మొట్టమొదటి మహిళగా సిమ్రన్ చరిత్ర సృష్టించారు.
ఆరంభంలోనే సవాళ్లు...
మూడు లక్షలకు పైగా సిబ్బంది గల సీఆర్‌పీఎఫ్ అత్యున్నత అంతర్గత భద్రతా దళం. నక్సల్, ఉగ్రవాద, తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు నిర్వహించడం సీఆర్‌పీఎఫ్ ప్రధాన విధులు. అడుగడుగునా సవాళ్లతో కూడుకున్న ఈ దళంలో భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తారు సిమ్రన్. గత ఏడాది ఏప్రిల్‌లో ఆమె ఇందులో చేరారు. తొలి పోస్టింగ్... ఛత్తీ్‌సగఢ్ ‘బస్తారియా’ బెటాలియన్‌లో. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం ఏర్పాటైన ప్రత్యేక దళం. ఇందులో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ... అధికారుల ప్రశంసలు అందుకున్నారు సిమ్రన్. ఆమె సేవలు గుర్తించి ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ బృందానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం కల్పించారు. దీంతోపాటు ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్‌ఎ్‌సబీ), సీఆర్‌పీఎఫ్ నుంచి మహిళా ‘డేర్ డెవిల్స్’ బృందాలు బుల్లెట్ బైక్‌లను నడుపుతూ కవాతులో పాల్గొంటాయి. 2020 రిపబ్లిక్ డేలో కూడా ఈ మహిళా బృందాలు ఇదేతరహా ఫీట్‌ను ప్రదర్శించి అబ్బుర పరిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..