Share News

సంక్లిష్టత నుంచి సరళతవైపు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:56 AM

ఆధునిక ప్రపంచంలో... సంక్లిష్టత మనల్ని తరచుగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆధునాతన సాంకేతికత, క్లిష్టమైన సిద్ధాంతాలు, జీవనశైలుల్లో ఆడంబరాన్ని పురోగతికి చిహ్నాలుగా..

సంక్లిష్టత నుంచి సరళతవైపు

యోగా

‘‘అత్యున్నత స్థితిని పొందగలిగే విధానం సరళమైనది, సహజమైనది. అది సంక్లిష్టమైన అభ్యాసాల ద్వారా కాదు, హృదయంలో సంభవించే సహజసిద్ధమైన పరివర్తన ద్వారా లభిస్తుంది.’’

- బాబూజీ మహరాజ్‌

ఆధునిక ప్రపంచంలో... సంక్లిష్టత మనల్ని తరచుగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆధునాతన సాంకేతికత, క్లిష్టమైన సిద్ధాంతాలు, జీవనశైలుల్లో ఆడంబరాన్ని పురోగతికి చిహ్నాలుగా తరచూ భావిస్తాం. అయితే, వైద్యుడిగా, ధ్యానాన్ని సాధన చేసేవ్యక్తిగా నా ప్రయాణం గురించి తిరిగి ఆలోచించుకుంటే... ప్రకృతి ఎల్లప్పుడూ సరళత్వం వైపే ప్రయాణిస్తూ ఉంటుందనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే, సరళమైన దాన్ని సంక్ష్లిష్టం చేసేది మనిషి మనసే. మనిషి మనసు అద్భుతమైన ఒక సాధనం. అది ప్రపంచాన్ని అసాధారణమైన పద్ధతుల్లో విశ్లేషించగలదు, శోధించగలదు, వ్యాఖ్యానించగలదు. జీవితాన్ని మరింత సంక్లిష్టంగా మార్చే దిశగా మనల్ని తరచుగా నడిపించేది కూడా ఆ విశ్లేషణాత్మక శక్తే.

శరీరం చెప్పే అందమైన పాఠం

చాలా సరళమైన వాస్తవాలతో కూడిన సందర్భాలకు మనం సంక్లిష్టమైన వివరణల్ని సృష్టిస్తూ ఉంటాం. నేను వైద్య రంగంలో ఈ ధోరణిని తరచుగా గమనిస్తూ ఉంటాను. మామూలు జీవన శైలి మార్పులతో ఎదుర్కోగలిగే అనారోగ్యాలకు క్లిష్టమైన చికిత్సలను, విస్తృతమైన ప్రక్రియలను రోగులు కొన్నిసార్లు ఆశిస్తారు. అదేవిధంగా, జీవితంలో ఆనందం పొందాలంటే ఆడంబరంతో కూడిన విజయాలు అవసరమని మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఆ ఆనందం అనేది సరళత, సమతుల్యత, అంతర్గతమైన స్పష్టతల్లో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆలోచనల పొరల్ని నిర్మించడాన్ని మనసు ఆస్వాదిస్తూ ఉంటుంది, కానీ ఆ పొరల్ని సున్నితంగా తొలగించడంలోనే జ్ఞానం ఉంటుంది. సరళత్వానికి సంబంధించిన అత్యంత అందమైన పాఠం ఒకటి మానవ శరీరమే బోధిస్తుంది. మనం తినే ప్రతి భోజనం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్ల సంక్లిష్టమైన మిశ్రమం. ఈ సంక్లిష్ట పదార్థాలను అమైనో ఆసిడ్లు, గ్లూకోజ్‌, కొవ్వు ఆమ్లాలు లాంటి సరళమైన అణువులుగా జీర్ణ వ్యవస్థ ఎంతో ఓపికతో విడగొడుతుంది. దీనివల్ల మన శరీరం వాటిని గ్రహించగలదు, ఉపయోగించగలదు. తద్వారా ప్రకృతి ఒక లోతైన సూత్రాన్ని ప్రదర్శిస్తోంది: సంక్లిష్టతను సరళత్వం స్థాయికి తగ్గించినప్పుడు జీవితం చక్కగా పని చేస్తుంది. వైద్యశాస్త్రం కూడా ఇదే దిశలో పరిణామం చెందింది.


ఆధ్యాత్మిక సమాంతరత

వైద్యం ఉదాహరణే ఆధ్మాత్మికతకూ వర్తిస్తుంది. చాలా సంక్లిష్టమైన ఆచారకాండలు, కఠోరమైన తపస్సులు, మేధోపరమైన నైపుణ్యం అనేవి ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి అవసరమనేది చాలామంది నమ్మకం. కానీ అత్యున్నతమైన లక్ష్యానికి చేరే మార్గం సరళమైనదని గొప్ప ఆధ్యాత్మిక గురువులు మనకు పదేపదే గుర్తు చేస్తారు. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ సంప్రదాయంలో... అంతర్గతమైన ప్రయాణం ధ్యానం, శుద్ధి, ప్రార్థన లాంటి సహజసిద్ధమైన అభ్యాసాల మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానం ద్వారా మనస్సు తన సంక్లిష్టమైన పొరలను క్రమంగా తొలగించుకుంటుంది. ఆలోచనలు ప్రశాంతంగా మారుతాయి, భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి. హృదయం తన సహజసిద్ధమైన సరళతను మళ్ళీ పొందుతుంది. కచ్చితత్వం, క్రమశిక్షణ కలిగిన ఆలోచన తాలూకు విలువను వైద్యరంగంలో ప్రయాణం నాకు నేర్పింది. అయితే ధ్యానంలో నా ప్రయాణం కూడా... ‘జీవితంలో లోతైన సత్యాలు సరళమైనవి’

అనే అంతే ముఖ్యమైన మరో విషయాన్ని వెల్లడించింది. నేను ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు... మొదట్లో ఒక వైద్యుడికి ఉండే విశ్లేషణాత్మక దృక్పథంతో దాన్ని పరిశీలించాను. ప్రతిదాన్నీ మేధోపరంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేశాను. కానీ అంతర్గత పరివర్తన అనేది మేధోపరమైన సంక్లిష్టత ద్వారా రాదనీ, సరళత, చిత్తశుద్ధి, క్రమబద్ధమైన సాధన ద్వారా వస్తుందని ధ్యానం నాకు మెల్లగా స్పష్టం చేసింది. ధ్యాన సమయంలో అనుభవించే సరళత ఆధ్యాత్మిక జీవితానికే కాకుండా వృత్తికి సంబంధించిన అభ్యాసంలో కూడా స్పష్టతను తెస్తుందని నేను గ్రహించాను. మనసు సరళంగా, సమతుల్యతతో ఉన్నప్పుడు... నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, తాదాత్మ్యత గాఢంగా మారుతుంది, ఇతరులకు సేవచేసే సామర్థ్యం మెరుగుపడుతుంది.

బాబూజీ మహరాజ్‌

షాజాన్‌పూర్‌కు చెందిన రామ్‌చంద్ర ‘సహజమార్గం’- ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ సంప్రదాయంలో రెండో ఆధ్యాత్మిక గురువు. ఆయనను అందరూ ‘బాబూజీ మహారాజ్‌’ అని ప్రేమగా పిలుచుకుంటారు. అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి మేధోపరమైన సంక్లిష్టత కానీ, కఠోరమైన తపస్సులు కానీ అవసరం లేదనీ, సరళమైన, నిజాయితీ, నిబద్ధతతో కూడిన హృదయం ఉంటే చాలనేది ఆయన సందేశం. ఈనెల 30వ తేదీన ఆయన 127వ జయంతి.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 24 , 2026 | 04:56 AM