వారికోసం ‘శ్రద్ధ’గా
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:46 AM
శ్రద్ధా అగర్వాల్‌కు చదువంటే ప్రాణం. కానీ వినికిడి శక్తి లేకపోవడంవల్ల విద్యార్థినిగా ప్రతి దశ ఒక యుద్ధంలాగే సాగింది. ఆ కష్టం ఇంకెవరూ పడకూడదనే నిశ్చయంతో బధిర...
శ్రద్ధా అగర్వాల్‌కు చదువంటే ప్రాణం. కానీ వినికిడి శక్తి లేకపోవడంవల్ల విద్యార్థినిగా ప్రతి దశ ఒక యుద్ధంలాగే సాగింది. ఆ కష్టం ఇంకెవరూ పడకూడదనే నిశ్చయంతో బధిర విద్యార్థుల కోసం ఒక కొత్త వేదికను ఆమె ఆవిష్కరించారు. సంజ్ఞలు, ఆంగ్ల వివరణలు సమాంతరంగా కనిపిస్తూ... వారి అవగాహన మెరుగుపరిచేలా తన ‘సైన్‌సేతు’ను శ్రద్ధ తీర్చిదిద్దారు.
‘‘దీన్ని అవసరమైనవారందరికీ చేర్చాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నారు ఇరవై మూడేళ్ళ శ్రద్ధ.
‘‘నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోని చెన్నైలో. పుట్టుకతోనే నాకు వినికిడి లోపం ఉంది. దానివల్ల బాల్యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నాకు చదువంటే ప్రాణం. బాల విద్యాలయలో ప్రాథమిక విద్యాభ్యాసం నాకు మంచి పునాది వేసింది. కానీ సాధారణ పాఠశాలలో చేరాక... ఆ వాతావరణం నాకు దిగ్ర్భాంతిని, వేదనను కలిగించింది. తరగతిలో ఏకైక బధిర విద్యార్థిని నేనే. నా తోటి విద్యార్థుల్లా పాఠాలను త్వరగా అర్థం చేసుకోవడం ఎంతో కష్టంగా ఉండేది. బోర్డు మీద ఉన్నవి నోట్‌బుక్‌లో వేగంగానే రాసుకొనేదాన్ని. కానీ టీచర్ల పెదవుల కదలికని బట్టి పాఠాలు అర్థం చేసుకోవడం, వారు చెబుతున్నవి రాసుకోవడం నాకు అతి పెద్ద సవాలు. మళ్ళీ చెప్పాలని టీచర్లను పదేపదే అడగాల్సి వచ్చేది. వేరే పిల్లల నోట్సులు అడగాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఇచ్చేవారు, మరికొన్నిసార్లు విసుక్కొనేవారు. నాలాంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అనువైన బోధన పాఠశాలల్లో నాకు కనిపించలేదు. అయినా పట్టుదలతో కృషి చేశాను. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీలో చేరాను. అక్కడ నాలాంటివారికి మెరుగైన సదుపాయాలు ఉంటాయనుకున్నాను. కానీ అక్కడా నోట్సుల విషయంలో అదే ఇబ్బంది. ఈ పరిస్థితులు... బధిరులను కలుపుకొని పోయే విద్యావ్యవస్థ ఆవశ్యకతను నాకు ప్రతి దశలోనూ గుర్తు చేస్తూనే ఉన్నాయి.
ఆ మథనం నుంచి...
మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత... వినికిడి సమస్యలు ఉన్న ఎంతోమందిని కలుసుకున్నాను. తమకు ఉన్న లోపం కారణంగా అడుగడుగునా సవాళ్ళు ఎదుర్కొంటున్న వారి కథలు నన్ను కలవరపెట్టాయి. ఇది వ్యక్తిగతమైన సమస్య కాదనీ, వైకల్యాలు ఉన్నవారిని తమతో కలుపుకోవడానికి సిద్ధపడని వ్యవస్థలో ఉన్న సమస్య అని గుర్తించాను. ‘దీన్ని అధిగమించడం కోసం ఏం చేయాలి?’ అని నాలో జరిగిన మథనం నుంచి పుట్టినదే ‘సైన్‌సేతు’. ‘సైన్’ అంటే సంజ్ఞ, ‘సేతు’ అంటే వారధి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎ్‌సఎల్), ఇంగ్లీష్... ఈ రెండూ కలిసి ఉండే ఒక ప్లాట్‌ఫారమ్‌గా దాన్ని రూపొందించాను. మన విద్యా వ్యవస్థ ఎక్కువగా పాఠ్యభాగాలు, మౌఖిక బోధన, బట్టీ పట్టడం మీద ఆధారపడి ఉంటుంది. వినికిడి శక్తి ఉన్న పిల్లలకు సహజంగానే భాషాపరమైన పునాది ఏర్పడుతుంది. తమకు అనువైన బోధన పద్ధతులు లేకపోవడంతో చాలామంది బధిర విద్యార్థులు పదో తరగతివరకైనా చదవలేకపోతున్నారు. స్వతహాగా కొన్ని వాక్యాలు రాయలేకపోతున్నారు. తమకు తెలిసిన (సంజ్ఞల) భాషలో వారు నేర్చుకోకపోవడమే దీనికి కారణం.

మార్గదర్శకత్వం
వివిధ అంశాలను వివరించడం కోసం భారతీయ సంకేత భాషను ప్రాథమిక మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా ‘సైన్‌సేతు’ మార్పు తీసుకువస్తుంది. సంజ్ఞలతో కూడిన వీడియోలు, ఫొటోలు, సరళమైన అర్థాల ద్వారా ఆంగ్ల పదాలను బధిరులైన పిల్లలు నేర్చుకుంటారు. తద్వారా వారిలో అవగాహన బలవంతంగా రుద్దినట్టు కాకుండా సహజంగా ఏర్పడుతుంది. కథలు, ఆటల రూపంలో పాఠాలుంటాయి. పెదవుల కదలికను తేలికగా గుర్తించగలిగే సంభాషణలు, దృశ్యాలు, సంజ్ఞలతో వీటికి రూపకల్పన చేశాం.
ఉదాహరణకు... ఒక పిల్లాడు కథల పుస్తకాన్ని తెరుస్తాడు, సంజ్ఞా భాషలో ఒక వ్యక్తి ఆ కథను వివరిస్తూ ఉంటారు. దానికి సమానమైన అర్థంలో ఆంగ్ల వాక్యాలు మరోవైపు కనిపిస్తూ ఉంటాయి. ఒక పదం సరిగ్గా తెలియకపోతే, ఆ పదం మీద క్లిక్ చేయవచ్చు. తక్షణమే సంజ్ఞల్లో దాని వివరణ, ఒక బొమ్మ కనిపిస్తాయి. ఇక... వాక్య నిర్మాణం, పద సంపద, వ్యాకరణం గురించి అవగాహన కల్పించేలా దృశ్యపరమైన, వినోదాత్మకమైన ఆటలు, పాటలు ఉంటాయి. ఈ అంశాలు బాగా అర్థమవుతున్నాయా? ఇంకా ఏవైనా మార్పులు చేయాలా?... లాంటి వివరాలతో పిల్లలు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వవచ్చు.
తల్లిదండ్రులు, టీచర్లకు...
బధిరులైన పిల్లలకు బోధనలో సాయపడే విధంగా తల్లిదండ్రులు, టీచర్లకు సంజ్ఞాభాషలో మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నాం. ఇప్పటికే కొన్ని పాఠశాలలు, సంస్థలు, తల్లితండ్రుల సంఘాలు మా ‘సైన్‌సేతు’ సేవలను వినియోగిస్తున్నాయి. ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. పలు సంస్థల నుంచి పురస్కారాలు కూడా లభించాయి. ‘సైన్‌సేతు’ను మరింత మెరుగుపరిచి, బధిరులైన వారందరికీ అందుబాటులోకి తేవాలనేది నా లక్ష్యం. ఆ దిశగా కృషి చేస్తున్నాను.’’
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..