రూపాలు అనంతం లీలలు అపారం
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:24 AM
ఆలయాలలో మనకు శివుడు సాధారణంగా లింగ రూపంలో కనిపిస్తాడు. కానీ శివరూపాలు అనంతం. శివలీలలు అపారం. ఆగమశాస్త్రాలు పలు రూపాలను వివరించాయి. ఆ రూపాల ఆధారంగా శివలీలల గురించి...
తెలుసుకుందాం
ఆలయాలలో మనకు శివుడు సాధారణంగా లింగ రూపంలో కనిపిస్తాడు. కానీ శివరూపాలు అనంతం. శివలీలలు అపారం. ఆగమశాస్త్రాలు పలు రూపాలను వివరించాయి. ఆ రూపాల ఆధారంగా శివలీలల గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రతి శివరూపం వెనుక ఒక పురాణ గాథ ఉంది. ప్రతి గాథలోనూ శివతత్త్వ మహత్తు నిండి ఉంది. ఆ రూపాలు పరవశింప చేస్తాయి. ఆ గాథలు తన్మయత్వం కలిగిస్తాయి. అభీష్ట వరదాయకాలైన ఈ శివరూపాల్ని ధ్యానించినా, ఈ గాథల్ని స్మరించినా శివానుగ్రహం తప్పక కలుగుతుందనేది పెద్దల మాట. ఆ రూపాలలో కొన్ని:
శ్రీ లింగమూర్తి: శివరూపం అనగానే గుర్తుకువచ్చేది శివలింగం. ‘లిం’ అంటే సృష్టి, ‘గం’ అంటే లయం. ఈ చరాచర సృష్టి ఎక్కడినుంచి మొదలవుతుందో, తిరిగి దేనిలో కలిసిపోతుందో అదే శివలింగం. శివలింగం పరమేశ్వరుడైతే, పీఠం పార్వతీదేవి రూపం. కాబట్టి అది శివశక్తుల సమష్టి రూపం. అంతేకాదు, ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి ఉన్నారు. భూమిలో ఉండే నలుచదరపు భాగం బ్రహ్మగా, పీఠంలోని ఎనిమిది పలకలు విష్ణువుగా, పైన మనకు దర్శనమిచ్చే గుండ్రటి భాగం శివరూపంగా గ్రహించినవారికి శివలింగం ఆంతర్యం అర్థమవుతుంది.
శ్రీలింగోద్భవమూర్తి: పూర్వం ఒకసారి బ్రహ్మ, విష్ణువు తామే గొప్పవారమని ఒకరితో ఒకరు కలహించుకున్నారు. వారి గర్వం పోగొట్టడానికి శివుడు ఆది, అంతం లేని అగ్నిస్తంభంలా దర్శనమిచ్చాడు. ఆ శివలింగం మొదలు కనుక్కోడానికి శివుడు వరాహంగా, తుదిభాగాన్ని దర్శించడానికి బ్రహ్మ హంసగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు శివుడు ఆ లింగం నుంచి (లింగోద్భవమూర్తిగా) ఉద్భవించాడు. బ్రహ్మను వేదాధిపతిగా, విష్ణువును తనతో సమానమైన దైవంగా అనుగ్రహించాడనేది ఐతిహ్యం.
శ్రీకల్యాణ సుందరమూర్తి: పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని కష్టాలు పెడుతూ పీడించసాగాడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడి వల్లనే తనకు మరణం కలగాలని బ్రహ్మ నుంచి వరం కూడా పొందాడు. రోజురోజుకూ పెరిగిపోతున్న అతని ఆగడాలను అరికట్టాలని అందరూ శివుణ్ణి వేడుకున్నారు. లోకకల్యాణం కోసం హిమవంతుడి కుమార్తె పార్వతీదేవిని శివుడు పరిణయం చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ వివాహంలో స్వామి ‘కల్యాణసుందరమూర్తి’గా దర్శనం ఇచ్చాడు.
శ్రీచంద్రశేఖరమూర్తి: లోకానికి వెలుగును ఇచ్చే చంద్రుడు ఒకప్పుడు చీకటిలో మగ్గిపోయాడు. తన మామ దక్షప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల రోజురోజుకూ క్షీణించిపోయాడు. భయంకరమైన కుష్టువ్యాధితో బాధపడుతూ.... శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. శివానుగ్రహంతో నెలలో పదిహేను రోజులు పెరిగేటట్టు, పదిహేను రోజులు తరిగేటట్టు వరం పొందాడు. ఎప్పటికీ తరుగుదల లేని రేఖగా శివుని శిరస్సుపై ఉండే భాగ్యాన్ని కూడా పొందాడు. అప్పటినుంచి శివుడు ‘చంద్రశేఖరమూర్తి’గా పిలుపునందుకుంటున్నాడు.
శ్రీ గంగాధరమూర్తి: పూర్వం సగర చక్రవర్తి కుమారులు తమ యాగాశ్వం కోసం వెతుకుతూ... ముని శాపానికి గురై బూడిద కుప్పలుగా మారిపోయారు. వారికి ఉత్తమ గతులు కలగాలంటే దేవలోకంలో ఉన్న గంగ కిందికి దిగిరావాలి. అందుకోసం సగర చక్రవర్తి వంశస్థుడైన భగీరథుడు తీవ్ర తపస్సు చేశాడు. గంగ భూమిపైకి దూకితే దాన్ని నియంత్రించే శక్తి ఒక్క శివుడికే ఉందని తెలుసుకొని... ఆయనను ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన శివుడు గంగను తలపై ధరించాడు. భగీరథ ప్రయత్నం ఫలించింది. శివునికి ‘గంగాధరమూర్తి’ అనే నామం ప్రాప్తించింది.
శ్రీ సోమాస్కందమూర్తి: తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు తన రేతస్సును అగ్నిదేవుడికి ఇచ్చి కాపాడమన్నాడు. అతడు దాన్ని తట్టుకోలేక ఒక రెల్లుగడ్డి వనంలో వదిలిపెట్టాడు. ఆ శరవనంలోనే స్కందుడు జన్మించాడు. ఆరుగురు కృత్తికలు ఆయనను పెంచారు. అనంతరం నందీశ్వరుడు వచ్చి, స్కందుణ్ణి కైలాసానికి తీసుకొని వెళ్ళాడు. తన కుమారుణ్ణి దేవతల సేనానాయకుడిగా పరమశివుడు నియమించాడు. ఆ సందర్భంగా శివపార్వతులు... కుమారస్వామిని తమ మధ్యలో ఉంచుకొని అందరికీ దర్శనం ఇచ్చిన రూపమే ‘సోమాస్కందమూర్తి’ రూపం.
శ్రీహరిహరమూర్తి: హరిహరుల మధ్య భేదం లేదని తెలిపేందుకు శివుడు ఈ రూపాన్ని ధరించాడు. పూర్వం దేవతలు లోకం అశాంతిగా ఉందంటూ విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శాంతిని ఇచ్చేవాడు శంకరుడేనని విష్ణువు వారికి తెలిపాడు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అక్కడ వారికి శివదర్శనం కాలేదు. అప్పుడు దేవతలందరూ ఒక వ్రతం ఆచరించారు. చివరిగా విష్ణు హృదయంలోని అక్షయ లింగాన్ని కూడా ఆరాధించగా, వారికి పరమేశ్వరుడు... కుడివైపు శివుడు, ఎడమవైపు విష్ణువు కలిసి ఉన్న రూపంలో... శ్రీహరిహరమూర్తిగా దర్శనమిచ్చాడు.
డి.యన్.వి. ప్రసాద్, స్థపతి, 9440525788
శ్రీ అర్ధనారీశ్వరమూర్తి: పార్వతీపరమేశ్వరులిద్దరూ ఒకటేననీ, వేరువేరు కాదనీ తెలిపే రూపం అర్ధనారీశ్వర రూపం. పూర్వం భృంగి అనే భక్తుడు పార్వతీదేవిని విడిచిపెట్టి, శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. పార్వతీదేవి అవమానంతో అలిగి కైలాసాన్ని విడిచిపెట్టింది. గౌతమ మహర్షి ఆశ్రమంలో శివుడికోసం కఠిన వ్రతం ఆచరించి, శివుని శరీరంలో సగభాగాన్ని పొందింది. కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారు ఉండే ఈ రూపాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం