Share News

శనిదేవుడి రూపాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:13 AM

నవగ్రహాలలో ఏడవ గ్రహం... శని. ఆయన నిదానంగా నడుస్తాడు కాబట్టి ‘శనైశ్చరుడు’ అంటారు. సూర్యుడి కుమారుడు కాబట్టి ‘సౌరి’ అని, ఛాయాదేవి పుత్రుడు కనుక ‘ఛాయాత్మజుడు’ అని...

శనిదేవుడి రూపాలు

తెలుసుకుందాం

నవగ్రహాలలో ఏడవ గ్రహం... శని. ఆయన నిదానంగా నడుస్తాడు కాబట్టి ‘శనైశ్చరుడు’ అంటారు. సూర్యుడి కుమారుడు కాబట్టి ‘సౌరి’ అని, ఛాయాదేవి పుత్రుడు కనుక ‘ఛాయాత్మజుడు’ అని, ఏడు కిరణాలు ఉన్నవాడు కాబట్టి ‘సప్తాంశు’ అని, నల్లగా ఉండడం వల్ల ‘అసితుడు’ అని, ఒక కాలు కుంచితంగా ఉంచుతాడు కనుక ‘పంగు’ అని... ఇలా పలు పేర్లతో పిలుస్తారు. ఆయన యమధర్మరాజుకు అన్న. కాకి వాహనంగా ఉండే శనైశ్చరుడి చరిత్ర సుప్రసిద్ధమైనది. కానీ ఆయన రూప లక్షణాలు అంత సులభంగా గ్రంథాల్లో దొరకవు.

‘గ్రహయాగ తత్త్వం’ అనే గ్రంథం ప్రకారం... శనైశ్చరుడు కాశ్యప గోత్రోద్భవుడు. నవగ్రహాలలో సూర్యుని వెనుక వైపు ఉండి, పడమరను చూస్తూ ఉంటాడు. ఆయన దేహం నల్ల రంగులో ఉంటుంది. నల్లని వస్త్రాలతో, గద్దను వాహనంగా కలిగి ఉంటాడు. ఆయనకు నాలుగు చేతులు. కుడిచేతిలో బాణం, ఎడమ చేత వరద ముద్ర, పరహస్తాలలో శూలం, ధనస్సు ధరించి ఉంటాడు. కాగా... ‘పురాణాశ్చర్యార్ణవం’ అనే గ్రంథం ప్రకారం.. ఆయన బాణాసనంపై కూర్చొని ఉంటాడు. ఇంద్రనీలం లాంటి రంగులో ఉంటాడు. ఒంటికి కృష్ణ గంధాన్ని పూసుకుంటాడు. ఆభరణాలు నీల కాంతితో వెలుగుతూ ఉంటాయి. మకుటం, కేయూరం మొదలైన ఆభరణాలతో అలంకృతుడై ఉంటాడు. ఇంద్రనీలం ఆయనకు ప్రియమైన రత్నం. గాయత్రి ఆయన ఛందస్సు. నల్లని ధ్వజ పతకాన్ని, రథంలో అధిదేవతగా ప్రజాపతిని, ప్రత్యధిదేవతగా పద్మాన్ని కలిగి ఉంటాడు. శనిదేవుడు సాధారణంగా నాలుగు చేతులు కలిగి, ధనస్సు, బాణం, ఖడ్గం ధరించి, వరదముద్రతో ఉంటాడని కొన్ని గ్రంథాలలో ఉంది. కానీ ఆయన కుడిచేత దండాన్ని ధరించి, ఎడమ చేతితో వరద ముద్ర చూపిస్తూ పద్మపీఠంపై నిలుచొని ఉంటాడని, ఒక కాలిని కుంచితంగా ఉంచుతాడని ‘కాశ్యప శిల్ప శాస్త్రం’ వివరించింది.


దండం, అక్షమాల

‘విష్ణుధర్మోత్తర పురాణం’ ప్రకారం... ఆయన ఒక చేతిలో దండాన్ని, వేరొక చేతిలో అక్షమాలను ధరించి, ఎనిమిది గుర్రాలు పూన్చిన ఇనుప రథాన్ని అధిరోహిస్తాడు. అన్ని గ్రంథాలు వరద ముద్రను వివరించగా... ‘శ్రీతత్త్వనిధి’ అనే గ్రంథం ప్రకారం ఆయన అభయముద్రతో దర్శనమిస్తాడు. ఆయన విగ్రహాన్ని ఇనుముతో తయారు చేయవచ్చు. ఎనిమిది నల్లటి గద్దలు లాగుతున్న రథం వాహనంగా కలిగి ఉంటాడు. ఆ రథంలో కూర్చొని మేరు పర్వతానికి ప్రదక్షిణ చేస్తాడు. శనైశ్చరుడి భార్య నీలావతి. ఆయనకు కుడివైపున ప్రజాపతి ఉంటాడు. ఎర్రని తామరపువ్వు మేనిఛాయతో, ఒకే ముఖంతో, నాలుగు చేతులలో అక్షమాల, సుక్‌స్రువం అనే ఆయుధం, కమండలం, పుస్తకాలు ధరించి, హంసపై కూర్చొని ఉంటాడు. ఆయనకు ఎడమవైపున ఎర్రని కనులతో, నల్లని దేహంతో, పాశం ధరించి, చూడడానికి భయంకరంగా ఉన్న యముడు ఉంటాడు.

భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన శని దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌. ఈ ఆలయంలో శని భగవానుడు స్వయంభువుగా... ఒక రాయి రూపంలో కొలువై ఉన్నాడు. మధ్య ప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో అత్యంత పురాతనమైన ఒక శని దేవాలయం ఉంది. అది రామాయణ కాలం నాటిదని, అక్కడి విగ్రహం ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని ఒక కథ ఉంది. ఢిల్లీలోని ఛతర్‌పూర్‌ శనిధామ్‌ ఆలయంలో... అత్యంత మహిమాన్వితమైన 20 అడుగుల ఎత్తైన శని దేవుడి విగ్రహం ఉంది. తమిళనాడులోని తిరునల్లార్‌ శనీశ్వర భగవాన్‌ ఆలయం... ప్రముఖ నవగ్రహ క్షేత్రాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోసి గ్రామంలో కోకిలవన శని దేవుని దేవాయం ఉంది. దీన్ని శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చిన ప్రదేశంగా భావిస్తారు. అక్కడ ఏడు శనివారాలు ఆవ నూనె సమర్పిస్తే శని దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలోని మెదక్‌ జిల్లా యెర్దనూరు గ్రామంలో 20 అడుగుల ఎత్తైన విగ్రహం ఉన్న శని దేవాలయం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని శ్రీమందేశ్వరస్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనది.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 06:13 AM