Share News

శకటాసుర సంహారం

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:24 AM

నంద యశోదల ఇంట్లో వేడుకలు జరుగుతున్నాయి. పుణ్యస్త్రీలకు యశోద కానుకలు ఇస్తోంది. కవులను, పండితులను నందుడు సత్కరిస్తున్నాడు. పిల్లలకు వారు బహుమతులు పంచిపెడుతున్నారు. వ్రేపల్లె వాసులకు...

శకటాసుర సంహారం

భాగవతం

నంద యశోదల ఇంట్లో వేడుకలు జరుగుతున్నాయి. పుణ్యస్త్రీలకు యశోద కానుకలు ఇస్తోంది. కవులను, పండితులను నందుడు సత్కరిస్తున్నాడు. పిల్లలకు వారు బహుమతులు పంచిపెడుతున్నారు. వ్రేపల్లె వాసులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దానికోసం రకరకాల మధుర పదార్థాలతో నిండిన బండ్లు అనేకం నందుని ఇంటి ముందు ఆగి ఉన్నాయి. వాటితోపాటు పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గంటల శబ్దం చేసే రంగురంగుల బండ్లు కూడా ఉన్నాయి. అందంగా అలంకరించిన ఒక తొట్టెను ఒక బండి కింద కట్టి, చిన్ని కృష్ణుణ్ణి అందులో పడుకోబెట్టారు.

ఆ సమయంలో... కంసుని అనుచరుల్లో ఒకడు, మాయలూ మంత్రాలూ తెలిసిన వాడు... శకట రూపంలో వచ్చి నందుని ఇంటి ముందు ఆగి ఉన్న బండ్ల మధ్య నిలబడ్డాడు. కృష్ణయ్య ఇది గమనించాడు. అప్పటివరకూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న వాడల్లా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైందోనని గోపికలు కొందరు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. కృష్ణయ్య ఏడుపు మానిపించడానికి ఎంతగానో ప్రయత్నించారు. కృష్ణుడి రోదన విన్న యశోదకు దుఃఖం ఆగలేదు. ఈలోగా శ్రీకృష్ణుణ్ణి ఒక గోపకాంత ఎత్తుకొని ఆడిస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ముంగిట ఉన్న బండ్లను చూపిస్తోంది. వాటిలోని మధుర పదార్థాలను రుచి చూపిస్తోంది. అయినా పసివాడు ఏడుపు మానలేదు. నల్లని మేఘాల మధ్య దోబూచులాడే నెలవంకలా ఉన్న ఆ పిల్లవాణ్ణి చూడగానే శకటాసురుడు తననుతాను మరచిపోయాడు. ఒకసారి ఆ పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలనిపించింది. అది తెలుసుకున్న కృష్ణయ్య ఏడుపు ఆపి... ఆ మాయా శకటం వైపు చూశాడు. గోపకాంత అతణ్ణి ఆ శకటం దగ్గరకు తీసుకువెళ్ళింది. వెంటనే కృష్ణయ్య మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. గోపకాంత చేతుల్లో నిలవకుండా కాళ్ళూ చేతులూ చాచి తన్నుకోవడం లాంటి చేష్టలు చేశాడు. అలా చేస్తూండగా కృష్ణయ్య ఎడమ పాదం పక్కనే ఉన్న మాయా శకటానికి తగిలింది. ఆ తాకిడికి ఆ శకటం అంతెత్తున ఆకాశంలోకి ఎగిరి, కిందపడి తునాతునకలయింది. అందులోంచీ ఒక రాక్షసుడు నెత్తురు కక్కుతూ నేల మీద పడ్డాడు. భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు.

బాలుని రూపంలో దివ్య శక్తి

ఇది చూసిన గోపికలు, గోపాలురు ఆశ్చర్యపోయారు. ‘‘కృష్ణా! కృష్ణా!’’ అని వణికిపోతూ యశోదమ్మ వచ్చింది. ‘‘తల్లులారా! నా చిన్నితండ్రి ఎలా ఉన్నాడు? అయ్యయ్యో! వాడికేమీ కాలేదు కదా!’’ అని రోదిస్తూ, పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకుంది. పిల్లవాడికి ఏదో బాలగ్రహం సోకిందని యశోదా నందులు తల్లడిల్లారు. ‘‘అదేమీ కాదు! ఏదో దివ్య శక్తి, మహా శక్తి చిన్ని కృష్ణయ్య రూపంలో మన ఇంటికి వచ్చింది. అనవసరంగా ఆందోళన చెందకండి. నాకు మాత్రం కృష్ణయ్య పుట్టినప్పటి నుంచి మనం చూస్తున్న విచిత్రానుభవాలన్నీ అతని గురించి మరింత తెలుసుకోవాలనే ఆత్రుత కలిగిస్తున్నాయి’’ అంది అప్పటివరకూ ఆ లీలాశిశువును ఎత్తుకొని ఆడించిన గోపకాంత. ఆమె మాటలు విన్నాక నంద యశోదల మనసు తేలికపడింది.


లోమశుడి శాపం

ఇంతకీ ఈ శకటాసురుడి కథేమిటంటే... అతను పూర్వ జన్మలో హిరణ్యాక్షుడి కుమారుడైన ఉత్కచుడు. లోమశుడు అనే మహర్షికి చెందిన ఉద్యానవనాన్ని ఒక సందర్భంలో అతను ధ్వంసం చేశాడు. అప్పుడు మహర్షి కోపగించి ‘‘ఈ చెట్లను నువ్వు ఎలా చిందరవందర చేసి పెళ్ళగించావో... నీ శరీరం కూడా అలాగే తునాతునకలై నేల కూలుతుంది’’ అని శపించాడు. ఉత్కచుడు... మహర్షి పాదాలమీద పడి, తనకు శాపవిమోచనం ఎప్పుడు కలిగేదీ చెప్పాలని వేడుకున్నాడు. లోమశుడు అతణ్ణి కరుణించి ‘‘ద్వాపరయుగం చివరిలో శ్రీహరి పాదఘాతంతో ముక్తి చెందుతావు’’ అని చెప్పాడు. ఆ ప్రకారమే అతనికి ముక్తి లభించింది.

కంసుడు పంపిన శకటాసురుడు ఎంతో బలమైనవాడు. కానీ చిన్న కృష్ణుడు ఒక్క తన్ను తన్నగానే ముక్కలైపోయాడు. ఎంతటి బలవంతుడైనా అధర్మం వైపు ఉంటే ఓటమి తప్పదనీ, పూర్వజన్న కర్మ ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాలనీ, కానీ భగవంతుణ్ణి శరణు వేడితే పాపాలు నశించి ఉత్తమగతులు కలుగుతాయనీ శకటాసురుడి కథ మనకు బోధిస్తుంది.

ప్రయాగ రామకృష్ణ

ఇవీ చదవండి:

స్కూల్‌ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

Updated Date - Oct 02 , 2026 | 04:24 AM