స్వీయ క్రమశిక్షణే పునాది
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:32 AM
కొన్ని రోజుల క్రితం.... రద్దీగా ఉండే ఒక నగర రహదారి మీద ప్రయాణిస్తున్నాను. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగాల్సి వచ్చింది. ముందున్న రహదారి ఖాళీగా కనిపించింది. చుట్టుపక్కల...
యోగా
కొన్ని రోజుల క్రితం.... రద్దీగా ఉండే ఒక నగర రహదారి మీద ప్రయాణిస్తున్నాను. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగాల్సి వచ్చింది. ముందున్న రహదారి ఖాళీగా కనిపించింది. చుట్టుపక్కల ఎక్కడా పోలీసులు లేరు. అయినప్పటికీ గ్రీన్ లైట్ పడేవరకూ చాలా వాహనాలు ఓపికగా నిరీక్షించాయి. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఒక సమాజాన్ని క్రమబద్ధమైనదిగా మార్చేది ఏమిటి? సమాధానం సులువైనదే... క్రమశిక్షణ. నాగరికమైన ప్రతి సమాజం పని చేస్తూ ఉండడానికి కారణం... సమాజ శ్రేయస్సుకోసం తమ వ్యక్తిగత స్వేచ్ఛలోని కొంత భాగాన్ని మనస్ఫూర్తిగా ప్రజలు త్యాగం చేయడమే. మనం రహదారిలో సరైన వైపున వాహనాలు నడపాలి. ఇతరులకు దారి ఇవ్వాలి. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించాలి. క్యూలలో నిలబడాలి. నియమాలను అనుసరించాలి. ఈ చిన్న చిన్న చర్యలన్నీ క్రమశిక్షణకు సంబంధించినవి. ఇవి సామరస్యానికి, ప్రతి ఒక్కరి భద్రతకు దోహదపడతాయి. దురదృష్టవశాత్తూ, క్రమశిక్షణ అనేది తరచుగా బయటి నుంచీ విధించవలసిన విషయం అయిపోతోంది. అందుకే మనకు ట్రాఫిక్ పోలీసులు, నిబంధనలు, జరిమానాల అవసరం పడుతోంది. ప్రతి వ్యక్తి సహజసిద్ధంగా క్రమశిక్షణను కలిగి ఉంటే... ఈ బాహ్య నిర్బంధం చాలావరకూ అవసరం ఉండదు. ఇదే సూత్రం మన వ్యక్తిగత జీవితాలకు కూడా వర్తిస్తుంది.
స్వేచ్ఛ... బానిసత్వం
క్రమశిక్షణ లేకుండా మన శరీరాన్ని నియంత్రించుకోవడం అసాధ్యం. శరీరం నియంత్రణలో లేకపోతే, బుద్ధి మసకబారుతుంది. బుద్ధికి భంగం కలిగినప్పుడు మనస్సు అశాంతిమయం అవుతుంది, దాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇదంతా మన చుట్టూ జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ‘ఏది సరైనది’ అనేది చాలామందికి తెలుసు. కానీ దాన్ని పాటించడానికి ఇబ్బంది పడతారు. వారు అనారోగ్యకరమైన ఆహారం తినడం, అధికంగా మద్యం తాగడం, మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం, ధూమపానం, గంటలకు గంటలు మొబైల్ ఫోన్లతో గడపడం, సోషల్ మీడియా వ్యసనం... ఇలా లెక్కలేనన్ని ఇతర ప్రలోభాల్లో మునిగిపోతారు. విషాదం ఏమిటంటే... ప్రతి వ్యసనం స్వేచ్ఛతో మొదలవుతుంది, బానిసత్వంతో ముగుస్తుంది. ‘‘నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపగలను’’ అనుకొని మొదలుపెడతారు. అది కాస్తా నెమ్మదిగా ‘‘నేను ఎంత కోరుకున్నా ఆపలేకపోతున్నాను’’గా మారుతుంది.
నియంత్రణగా చూడకూడదు
ఒక కార్డియాలజిస్టుగా ఈ వాస్తవాన్ని నేను తరచుగా చూస్తూ ఉంటాను. యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ చేయించుకున్న లేదా గుండెపోటుకు గురైన రోగులకు... క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అనుసరించమని వైద్యులు సలహా ఇస్తారు. వారికి క్రమం తప్పకుండా మందులు వాడడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని నిర్వహించుకోవడం అవసరం అవుతాయి. ‘‘డాక్టర్! నేను నిజంగానే ఈ మందుల్ని రోజూ తీసుకోవాలా?’’ అని చాలామంది రోగులు నన్ను అడుగుతూ ఉంటారు. నా జవాబు ఎప్పుడూ ఒక్కటే... క్రమం తప్పకుండా తీసుకుంటేనే మందు పని చేస్తుంది. కొన్నిసార్లు వాటిని వేసుకోవడం మరచిపోయినా... అది ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ కాలక్రమేణా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. రోజూ మందులు తీసుకోవాలనే క్రమశిక్షణ ఒక నియంత్రణలా అనిపించవచ్చు. కానీ అది అంతకన్నా గొప్ప స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.... అది ఎక్కువకాలంపాటు ఆరోగ్యంగా, తక్కువ సమస్యలతో జీవించే స్వేచ్ఛ. అంటే... క్రమశిక్షణ కొద్దికాలం పాటు మనకు పరిమితులు విధించినప్పటికీ దీర్ఘకాలంలో విముక్తి కల్పిస్తుంది.
సహజమైన ప్రతిఫలాలు
చైతన్యం విస్తరించేకొద్దీ... తమపట్ల, ఇతరుల పట్ల బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆలోచనలు, భావోద్వేగాలు, మాటలు, చేతల పట్ల ఎక్కువ జాగరూకత అవసరం. క్రమశిక్షణ అంటే శిక్ష కాదు... వివేకవంతమైన స్వీయనిర్వహణ. కేవలం ఆనందాన్ని ఇచ్చే దానికన్నా... ప్రయోజనకరమైన దాన్ని ఎంచుకోగలిగే సామర్థ్యమే క్రమశిక్షణ. ఈ ప్రక్రియలో ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానం ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండే చేసే సాధనతో మనసు ప్రశాంతమవుతుంది. ఆవేశాలు బలహీనపడతాయి, విచక్షణ బలపడుతుంది. క్రమంగా... క్రమశిక్షణ అనేది బాహ్యమైన ఒక భారంలా కనిపించడానికి బదులు అంతర్గత సమతుల్యత తాలూకు సహజమైన వ్యక్తీకరణగా మారుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే మనకు నచ్చినది ఏదైనా చేయగలిగే సామర్థ్యం కాదు.... మనకు ఏదైనా చేయాలనిపించినప్పుడు కూడా ఏది సరైనదో దాన్ని చేయగలిగే సామర్థ్యం. ఎందుకంటే... సాధారణ అస్తిత్వాన్ని ఆరోగ్యం, సార్థకత, అంతర్గత సంతృప్తి కలిగిన అసాధారణమైన జీవితంగా మార్చేది స్వీయ క్రమశిక్షణే. చివరిగా ఒక మాట... స్వేచ్ఛ కోసం మనం చెల్లించే మూల్యం క్రమశిక్షణ. మనల్ని మనం ఎంత ఎక్కువగా అదుపులో ఉంచుకోగలిగితే... పరిస్థితులకు అంత తక్కువగా బానిసలం అవుతాం. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ఉన్నతి అనేవి యాదృచ్ఛికంగా లభించేవి కావు... అవి క్రమశిక్షణాయుతమైన జీవితానికి సహజసిద్ధంగా లభించే ప్రతిఫలాలు.
నిజమైన శిష్యుడు
‘హార్ట్‌ఫుల్‌నె్‌స’లో... ‘‘క్రమశిక్షణ ఉన్నవాడే నిజమైన శిష్యుడు’’ అని దాజీ ఒక చక్కటి మాట అన్నారు. క్రమశిక్షణ లేకుండా నేర్చుకోవడం అసాధ్యం. సంగీత వాయిద్యంలో ప్రావీణ్యం సాధించడం, చదువులో రాణించడం, నిపుణుడైన సర్జన్ కావడం లేదా ఆధ్యాత్మికంగా పురోగమించడం... ఏదైనా కావచ్చు. ఆకాంక్షకు, విజయానికి మధ్య స్వీయ క్రమశిక్షణే వారధి. ఆధ్యాత్మికమైన ఎదుగుదల అపరిమితమైన స్వేచ్ఛను ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ తరచుగా దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతున్న కొద్దీ మరింత క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఒక డ్రైవర్‌ను, పైలెట్‌ను గమనించండి. కారు నడిపే వ్యక్తి గణనీయమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు. ఎక్కడైనా ఆగగలడు. సులభంగా దిశను మార్చుకోగలడు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోగలడు. వాణిజ్య విమానాన్ని నడిపే పైలెట్ వందలాది మందిని తీసుకువెళ్తూ ఉంటాడు. అతని ప్రతి చర్య కచ్చితమైన నియమాలను అనుసరిస్తుంది. కఠినమైన చెక్‌లిస్టులు, నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి బాధ్యత పెరిగేకొద్దీ మరింత ఎక్కువ క్రమశిక్షణ అవసరం.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది