ఆత్మస్థైర్యమే అండగా...
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:01 AM
ఏదైనా జరగరానిది జరిగినప్పుడు... ‘ఇదంతా నా తలరాత’ అని సరిపెట్టుకోవద్దు. శ్రమ ఉన్న చోట ఆశ ఉంటుంది, ఫలితం తప్పకుండా దక్కుతుంది...
ఏదైనా జరగరానిది జరిగినప్పుడు... ‘ఇదంతా నా తలరాత’ అని సరిపెట్టుకోవద్దు. శ్రమ ఉన్న చోట ఆశ ఉంటుంది, ఫలితం తప్పకుండా దక్కుతుంది... ఇది రాఖీ షాకు ఆమె తల్లి చెప్పిన జీవన సూత్రం. బాల్యంలోనే సోకిన పోలియో వ్యాధిని, సామాజికంగా ఎదురైన సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొన్న రాఖీ... పదేళ్ళుగా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది జీవితాలకు వెలుగుదారి చూపిస్తున్నారు.
‘‘ఇప్పుడు నా వయసు 48 ఏళ్ళు. ఊహ తెలియని వయసులోనే నా పోరాటం మొదలయింది. ఆరు నెలల వయసులో నాకు పోలియో వ్యాక్సిన్ వేయించారు. ఆ రోజు రాత్రే జ్వరం వచ్చిందిట. అదే పనిగా వాంతులు. అమ్మ భయపడిపోయి ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. డాక్టర్ పరీక్షలు చేసి... ‘‘మీ అమ్మాయికి పోలియో ఉంది. దీనికి మందులు లేవు. జీవితాంతం ఫిజియోథెరపీ చేయించుకోవడం తప్ప మరో దారి లేదు’’ అని చెప్పారట. ఆ మాటలు విన్న ఏ తల్లిదండ్రులైనా భయపడిపోతారు. మా అమ్మా నాన్నా మానసిన వేదన పడినా ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. నాకు ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించేవారు. అమ్మ ఎన్నో ఆలయాలకు వెళ్ళి... నేను నడవాలని మొక్కుకుంది. నా ఎడమ కాలుకన్నా కుడికాలు ఎత్తు ఒకటిన్నర అంగుళాలు తక్కువ. దాంతో అడుగులు ఎగుడుదిగుడుగా పడేవి. అయిదారేళ్ళ వయసులో... నా సొంత కాళ్ళ మీద కాస్త నిలబడగలిగాను. కానీ అదంతా తాత్కాలికమే. అందరు పిల్లల్లా నడవడం, పరిగెత్తడం నాకు వీలయ్యేది కాదు. దాంతో ఆటపాటలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది.
చదువులోనే ఉపశమనం
బడిలో చేరిన తరువాతే అసలైన కష్టాలు ఎదురయ్యాయి. మిగిలిన పిల్లలు నాతో సరిగ్గా కలిసేవారు కాదు. ఇది నాకు ఎంతో బాధ కలిగించేది. ఆ ప్రభావం నా ఆలోచనల మీద పడకుండా నా తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నా ఆరోగ్య సమస్యల నుంచి చదువులో ఉపశమనాన్ని పొందడం నేర్చుకున్నాను. ఎంకామ్, ఎల్‌ఎల్‌బి చేశాను. మామూలు ఉద్యోగాలు చేయడం కష్టమని త్వరలోనే అర్థమయింది. స్వయం ఉపాధి మార్గాలతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. గ్లాస్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్, చాక్లెట్లు, అలంకరణ వస్తువుల తయారీ, మెహెందీ పెట్టడం లాంటివి నేర్చుకున్నాను. మెహెందీ డిజైనింగ్‌లో ఒక పత్రిక పెట్టిన పోటీల్లో రాష్ట్రస్థాయి బహుమతి కూడా గెలుచుకున్నాను. తరువాత చాక్లెట్లు, కేకుల బిజినె్‌సను నేను పుట్టి పెరిగిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనే ప్రారంభించాను. అది విజయవంతమయింది. అహ్మబాదాద్‌లోని ఒక అనాథ శరణాలయం అమ్మాయిలకి ఉచితంగా మెహెందీ పెట్టడానికి వెళ్లినప్పుడు... సోషల్ వర్క్ చేస్తున్న కొందరు మహిళలు పరిచయమయ్యారు. వారితో కలిసి ‘సమ్యక్ ఉమెన్స్ క్లబ్’ను ఏర్పాటు చేశాను. దానిద్వారా పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం.
జీవిత పరమార్థం అర్థమయింది
ఒకసారి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆరేళ్ళ పేద బాలుడి గురించి తెలిసింది. అతనికి కెమోథెరపీ చేయించడానికి లక్ష రూపాయలు అవసరమని వైద్యులు చెప్పారు. ఎంతో కష్టపడి, ఎందరినో కలిసి విరాళాల ద్వారా ఆ డబ్బు సమకూర్చగలిగాను. ఆ బాలుడి తల్లిదండ్రుల సంతోషాన్ని చూశాక... నా జీవిత పరమార్థమేమిటో అర్థమయింది. 2016లో ‘హెల్పింగ్ హ్యాండ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఊపిరి పోసుకుంది. దానికోసం వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేశాను. ఈ ఇరవయ్యేళ్ళలో కొన్ని వందల మందికి వైద్య సాయాన్ని అందించగలిగాం. అలాగే అనాథలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పించి, ఆదాయ మార్గాలు చూపించాం. తరచుగా వైద్య శిబిరాలను, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. పశువులు, జంతువుల సంరక్షణకు కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు నేను నిలబడగలను. కొద్దిసేపు నడవగలను. వాటికన్నా... ఒకప్పుడు ఎంతో వేదన పడిన బాధల్లో ఉన్నవారికి అండగా నిలబడగలగడం ఆనందంగా అనిపిస్తోంది. నేను ఎప్పుడూ సానుభూతి కోరుకోలేదు. జీవితాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నాను. సహనం, ధైర్యం, దృఢ సంకల్పం... ఇవి ఉంటే ఎవరైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, విజయం సాధించగలరు. దీనికి నేనే ఉదాహరణ.’’
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News