సర్వం కృష్ణమయం జగత్
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:57 AM
కృష్ణుడు తన స్నేహితుతో కలిసి యమునాతీరానికి ఆటలాడుకోవడానికి వెళ్ళాడు. కాసేపు ఆటపాటలు అయ్యాక... ఇసుక తిన్నెల మీద కూర్చొని చద్ది అన్నం మూటలు విప్పి తింటూ ఉండగా...
భాగవతం
కృష్ణుడు తన స్నేహితుతో కలిసి యమునాతీరానికి ఆటలాడుకోవడానికి వెళ్ళాడు. కాసేపు ఆటపాటలు అయ్యాక... ఇసుక తిన్నెల మీద కూర్చొని చద్ది అన్నం మూటలు విప్పి తింటూ ఉండగా... పచ్చిక మేస్తున్న ఆవులు, దూడలు కనిపించకుండా పోయాయి. గోపబాలురు కలవరపడ్డారు. ‘‘మీరు అన్నాలు తింటూ ఉండండి. నేను వెళ్ళి... ఆవుల్నీ, దూడల్నీ తీసుకువస్తాను’’ అని కృష్ణయ్య వెళ్ళాడు. కనుచూపు మేరంతా వెతికాడు. ఎక్కడా వాటి జాడ లేదు. చిన్ని కృష్ణుడు బలవంతులైన అనేకమంది రాక్షసులను అవలీలగా సంహరించాడని బ్రహ్మాది దేవతలు విని ఉన్నారు. అఘాసురుణ్ణి సంహరించడం కళ్ళారా చూశారు. అలాంటి మరికొన్ని అద్భుతాలు చూడాలనే కుతూహలం బ్రహ్మదేవుడికి కలిగింది. వెంటనే గోవుల్నీ, దూడల్నీ మాయం చేసి, ఒక చీకటి గుహలో దాచాడు.
ఆవులు, దూడలు కనిపించకపోవడంతో తన స్నేహితులు ఉన్న చోటికి కృష్ణయ్య తిరిగివచ్చాడు. అక్కడ సావాసగాళ్ళెవరూ కనిపించలేదు. తృటికాలం ఆలోచించాడు. సకల చరాచర జగత్తును క్షణంలో తనలో లీనం చేసుకొని, మరో క్షణంలో ప్రభవింపజెయ్యగలిగే జగత్ప్రభువు కాబట్టి... జరిగినదేమిటో అర్థమయింది. అంతకుముందు ఎందరు గోపబాలురు, ఎన్ని ఆవులు, దూడలు ఉన్నాయో... మూమ్మూర్తులా వాటిలా మారిపోయాడు. అన్నిటి రూపాలు తానే ధరించాడు... సందెవేళ అయ్యేసరికి... గోవులుగా, దూడలుగా, గోపబాలురిగా మారి... వారివారి ఇళ్ళకు చేరాడు. తన దోవన తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు చిత్రంగా తల్లులకు వారి పిల్లలు మరింత ఎక్కువ ముద్దొచ్చారు. పిల్లలకు అన్నాలు తినిపిస్తున్నప్పుడు ఆ తల్లుల ఆనందానికి అవధులు లేవు. తల్లులలోనూ, పిల్లలలోనూ ప్రేమ పెల్లుబుకుతోంది. గోవుల పరిస్థితీ అంతే! వాటి పొదుగులన్నీ నిండిపోయాయి. దూడల దగ్గరకు వెళ్ళి పాలిస్తూ ‘అంబా’రావాలు చేశాయి.
బ్రహ్మదేవుడు ఇదంతా గమనించాడు. గుహలోకి వెళ్ళి చూశాడు. గోవులు, దూడలతో పాటు గోపబాలురు కూడా గుహలో బందీలుగానే ఉన్నారు. ‘మరి కృష్ణుడితోనూ వీళ్ళంతా ఉన్నారే? అది ఎలా సంభవం?’ అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అప్పుడు ప్రతి గోవులోనూ, ప్రతి దూడలోనూ, ప్రతి బాలుడిలోనూ... నీలమేఘఛాయతో, పట్టు పీతాంబరాలు ధరించి, చతుర్భుజుడై, శంఖ చక్ర గదా పద్మాలతో, చిరునవ్వులు చిందిస్తూ... అఖండ ఆనందమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆ స్వామిని ఆనందబాష్పాలతో బ్రహ్మదేవుడు అభిషేకించాడు. కృష్ణుడిని మాయ చెయ్యబోయి, తానే మాయలో పడ్డానని గ్రహించాడు. ‘సర్వం కృష్ణమయం జగత్’ అని తెలిసొచ్చింది. వినయంతో అంజలి ఘటించాడు.
ప్రయాగ రామకృష్ణ
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..