Share News

సామరస్యాన్ని చాటిన సద్గురువు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:10 AM

పాశ్చాత్య పాలన, దాని నాగరితక ప్రభావం కారణంగా మన దేశంలో ఆధ్యాత్మిక జీవనానికి విఘాతం కలుగుతున్న తరుణంలో... ప్రజలను తన తత్త్వాలతో ప్రభావితం చేసిన మహాయోగి సంత్‌ శిశునాళ షరీఫ్‌..

సామరస్యాన్ని చాటిన సద్గురువు

పాశ్చాత్య పాలన, దాని నాగరితక ప్రభావం కారణంగా మన దేశంలో ఆధ్యాత్మిక జీవనానికి విఘాతం కలుగుతున్న తరుణంలో... ప్రజలను తన తత్త్వాలతో ప్రభావితం చేసిన మహాయోగి సంత్‌ శిశునాళ షరీఫ్‌. ఆయనను ఆధ్యాత్మిక గురువుగా భావించేవారు అసంఖ్యాకంగా ఉన్నారు. ‘కర్ణాటక కబీర్‌’గా ఆయన ఖ్యాతి గాంచారు. సంత్‌ శిశునాళ షరీఫ్‌ కర్ణాటకలోని హవేరి జిల్లా షింగ్గాంవ్‌ తాలూకా శిశువణహాళ (నేటి శిశునాళ) గ్రామంలో... 1809లో జన్మించారు. హజరత్‌ ఇమామ్‌ సాహెబ్‌, హుజ్జమ్మ దంపతులకు ఆయన ఏకైక సంతానం. ఇమామ్‌ సాహెబ్‌ గురువు హిందూ, ఇస్లాం మతాలను ఏకం చేయాలని కలలుగన్న హజరేషా ఖాద్రీ. హైందవ శిష్యులకు ఆయన లింగ దీక్ష కూడా ఇచ్చేవారట. ఆయన మార్గంలోనే పయనించిన ఇమామ్‌ సాహెబ్‌.... గ్రామస్తులకు అల్లాహ్‌ గురించిన పాఠాలతో పాటు రామాయణ, మహా భారత కథలను కూడా బోధించేవారు.

ఒకసారి అవధూత గోవిందభట్టు శిశునాళ గ్రామంలోని చావడిలో కూర్చొని ఉండగా... ఇమామ్‌ సాహెబ్‌ ఆయనను కలిసి, తన కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించాలని ప్రార్థించారు. అప్పుడు గోవిందభట్టు ‘‘షరీఫ్‌! నీ తండ్రి ఎవరు?’’ అని ప్రశ్నించారు. గ్రామస్తులందరూ హేళనగా నవ్వుతూ ఉండగా, షరీఫ్‌ నెమ్మదిగా ‘‘ఏం ప్రశ్న ఇది! మీకూ, నాకూ తండ్రి ఒక్కరే (ఆ భగవంతుడే) కదా!’’ అని అన్నాడు. వెంటనే అతణ్ణి తన శిష్యునిగా గోవిందభట్టు స్వీకరించి, తనతోపాటు తీసుకువెళ్ళారు. కొన్నేళ్ళ తరువాత షరీఫ్‌ గ్రామానికి తిరిగి వచ్చారు.

ఒక రోజు షరీ్‌ఫను ‘‘నువ్వు మసీదుకు రావెందుకు?’’ అని ఆ గ్రామ ముల్లాగారు ప్రశ్నిస్తే... తన దేహాన్ని చూపిస్తూ‘‘ నేను ఈ మసీదులోనే ఉంటున్నాను కదా! నన్ను నేను ఆరాధించుకుంటున్నాను కదా! అంతకన్నా పవిత్రమైన నమాజ్‌ వేరే ఉందా?’’ అని బదులిచ్చారు. ఆయన ఆదిశంకరుల అద్వైతాన్ని మహమ్మదీయ సిద్ధాంతంలో ఆచరణపూర్వకంగా చూపారు. శరీరాన్ని సాధనా మార్గంలో పయనింపజేసి భగవంతుడిలో లీనం చేయించే బోధనలే భగవద్గీత సారాంశం. ఆ మార్గంలో షరీఫ్‌ పయనించడమే కాదు, సమాజాన్ని కూడా నడిపించారు. ‘‘అందరు యోగులలో ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు విశ్వాసంతో, భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైనవారిగా పరిగణిస్తాను’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. అటువంటి అత్యున్నమైన భక్తుడు, యోగి సంత్‌ షరీఫ్‌. ఎన్నో తత్వాలను రాసి, గానం చేసి, వాటి ద్వారా ఎందరినో ఆధ్యాత్మిక మార్గంలోకి ఆయన నడిపించారు. తన గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని సాధారణమైన కన్నడ భాషలో తత్త్వాల (పాటల) రూపంలో సమాజానికి అందించి, మార్గదర్శిగా మారారు. హిందూ, ముస్లింల మధ్య ఐక్యతకు, సామరస్యానికి కృషి చేశారు. ఉభయ మతాల ప్రజలు ఆయనను తమ గురువుగా భావించి పూజించేవారు.


షరీఫ్‌ తత్త్వాలు జానపద భాషలో పైకి మామూలుగా కనిపించినా... వాటిలో నిగూఢమైన వేదాంతం, ఆధ్యాత్మికత, అంతరార్థాలు లోతుగా ఆలోచిస్తే కాని గ్రహించలేం. ఈనాటి తరానికి వాటిని దగ్గర చేయడం కోసం... సుప్రసిద్ధ కర్ణాటక పాప్‌ గాయకుడు రఘునాథ్‌ దీక్షిత్‌ ప్రత్యేకంగా పూనుకొని... నేటి యువత ఇష్టపడే ‘సమ్మేళన సంగీతం’ (ఫ్యూజన్‌ మ్యూజిక్‌) ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. సంత్‌ షరీఫ్‌ జీవిత కథ ఆధారంగా ‘సంత శిశునాళ షరీఫా’ అనే పేరుతో కన్నడ భాషలో చలన చిత్రం కూడా వచ్చింది.

గౌరిపెద్ది వెంకట శంకరభగవాన్‌

9492704983

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:10 AM