In Sankranti Gratitude Towards Ancestors: పండుగ వేళ... కృతజ్ఞతగా
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:44 AM
సంక్రాంతి నుంచి దేవతలకు ప్రీతికరమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో... ఈ రోజున నిర్వహించాల్సిన విధులను పూర్వులు నిర్దేశించారు...
సంక్రాంతి
సంక్రాంతి నుంచి దేవతలకు ప్రీతికరమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో... ఈ రోజున నిర్వహించాల్సిన విధులను పూర్వులు నిర్దేశించారు. తమ పితృదేవతలను (గతించిన మన ఆత్మీయులు, గురువులు, మన కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించినవారు) తలచుకోవాలి. గృహిణి స్వయంగా వండిన పదార్థాలను ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి నైవేద్యం పెట్టి, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ తినాలి.
రామాయణంలో...
రామాయణ గాథ ప్రకారం... దశరథుడు మరణించిన విషయాన్ని శ్రీరాముడికి తెలియజేసి, అయోధ్యా రాజ్యాన్ని ఆయనకు అప్పగించడం కోసం కొన్నివేలమందితో భరతుడు బయలుదేరాడు. శ్రీరాముడు ఉన్న చిత్రకూటానికి వెళ్ళాడు. ఆ సైన్యాన్ని తిలకించిన రాముడికి దశరథుని కోవిదార ధ్వజం (గోగు పూవు రంగు జెండా) ఉన్న రథం కనిపించలేదు. తండ్రి గతించాడని భరతుడు చెప్పాడు. అప్పటికి దశరథుడు స్వర్గస్థుడై 38 రోజులు గడిచాయి. అయినప్పటికీ, సీతతో కలిసి నది ఒడ్డుకు రాముడు వెళ్ళి పిండ ప్రదానం చేశాడు.
ఇంగుదం బదరైర్మిశ్రం పిణ్యాకం దర్భ సంస్తరే
న్యస్య రామ స్సుదుఃఖార్త రుదన్వచన మబ్రవీత్
రేగు పిండిని, అడవిలో దొరికే ఇంగుదీ ఫలాలను కలిపి ముద్దలు చేసి పెడుతూ ‘‘దివ్యాన్నాలను స్వీకరించే నా తండ్రీ! నేను తింటున్న దాన్ని, ఇక్కడ లభించిన దాన్ని నీకు సమర్పిస్తున్నాను’’ అంటూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ముగించాడు. దక్షిణ దిక్కుకు తిరిగి దశరథుడికి తర్పణాలను (నువ్వులను, నీళ్ళను పవిత్రంగా సమర్పించడం) వదులుతూ దుఃఖాతిశయంతో తండ్రిని తలచుకున్నాడు.

కృతజ్ఞులమై ఉండాలి...
స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. ఒక కుటుంబం పొరుగూరికి బయలుదేరింది. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని తినేసి ప్రయాణం సాగిస్తోంది. ఆకస్మాత్తుగా వర్షం కురిసింది. మార్గంలోని సెలయేరు ప్రవాహం పెరిగింది. వారి ప్రయాణం ఆగిపోయింది. దాదాపు ఆరేడు గంటలు అక్కడే ఉండిపోయారు. పిల్లలు ఆకలికి తాళలేక నీరసంతో నిద్రపోయి, మళ్ళీ లేచి బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టారు. ఆ తల్లితండ్రులకు ఏం చేయాలో తోచలేదు. కాసేపటికి సూర్యుడు ఉదయించాడు. సెలయేటి ప్రవాహం తగ్గింది. చిత్రమేమిటంటే... ఆ దగ్గరలోనే ఒక చెట్టు కింద పెద్ద అన్నం మూట కనిపించింది. ఆవురావురుమంటున్న ఆ కుటుంబం కడుపు నిండా భోజనం చేసింది. ఆ తరువాత... ఆ మూటను ఎవరు మరిచిపోయారో అనుకుంటూ నలుదిక్కులా చూశారు. ఆ చెట్టు మీద నుంచి గతించిన ఆ కుటుంబ పెద్ద తల్లిదండ్రులు తమ కంఠ స్వరాలతో ‘‘మేమేరా! నీ తల్లిదండ్రులం. నీ అన్న, తమ్ముడు మాకు శ్రాద్ధ కర్మలను సక్రమంగా చేస్తూ పెట్టే పిండాలలో కొంత నీకు ఇచ్చాం. తృప్తిగా భోజనం చేశావుగా సకుటుంబంగా! ఉంటాం’’ అన్నారు. తల్లిదండ్రులు పరమపదించిన తరువాత కూడా మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. వారిని పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు. ఏ కొందరికో వారి తల్లిదండ్రులు కష్టాన్ని, నష్టాన్ని కలుగజేసి ఉండవచ్చు. కానీ ఆ కోపంతో పిండప్రదానాలను మానకూడదు. లౌకిక భావనతో చూస్తే దీన్ని కృతజ్ఞత అనుకోవచ్చు. మనమే పంచ ప్రాణాలుగా భావించి, కష్టపడి మనల్ని పెంచి వెద్ద చేసిన, ఒక తోవ చూపిన తల్లిదండ్రులను, పైన పేర్కొన్న ఆత్మీయులందరినీ స్మరించుకోవడం మన విధి. లేకపోతే కృతఘ్నులం అవుతాం.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..