Share News

సమ్సోను కథ

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:34 AM

బైబిల్‌లో కనిపించే మరపురాని వీరుడు.. సమ్సోను. అతను ఇజ్రాయేలీయుల న్యాయాధిపతి. ఎదురుగా వచ్చిన సింహాన్ని అవలీలగా చీల్చి చెండాడే శక్తి అతనిది. అది అతని కండబలం...

సమ్సోను కథ

దైవమార్గం

బైబిల్‌లో కనిపించే మరపురాని వీరుడు.. సమ్సోను. అతను ఇజ్రాయేలీయుల న్యాయాధిపతి. ఎదురుగా వచ్చిన సింహాన్ని అవలీలగా చీల్చి చెండాడే శక్తి అతనిది. అది అతని కండబలం కాదు, దేవుడి అనుగ్రహబలం అతన్ని ఆవేశించడం వల్ల కలిగిన శక్తి. ఇజ్రాయేలీయులు తమ భూమిని తాము పాలించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి... వారి చుట్టూ శత్రువులే. తొలినాళ్ళ నుంచి ఫిలిష్తీయులతో యుద్ధం నడుస్తూనే ఉంది. పన్నెండు ఇజ్రాయేలీయ తెగల్లో ఒకటి దాను తెగ. దానికి చెందినవాడు మనోహు. బిడ్డలులేని మనోహు దంపతులకు దైవ కృపతో జన్మించినవాడు సమ్సోను. అతను మహా బలవంతుడు. అయితే మద్యం ముట్టుకున్నా, వెంట్రుకలు కత్తిరించినా, మృతదేహాన్ని పట్టుకున్నా... దైవదత్తమైన ఆ బలం మాయమైపోతుందనే శాపం కూడా ఉంది. ఆ న్యాయాధిపతి యుద్ధంలో సేనల్ని నడిపించేవాడు. సమస్యలు తీర్చేవాడు. దానితో అధికారం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. అతని శక్తిని చూసి ఫిలిష్తీయులందరూ గజగజా వణికేవారు. అతనంటే భయపడేవారు. అతన్ని ఎలాగైనా ఓడించాలనుకున్నారు. శక్తితో అది సాధ్యం కాదు కాబట్టి... కుయుక్తితో సాధించాలనుకున్నారు. అతని బలహీనతలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఒకవైపు వారు పన్నాగాలు పన్నుతూ ఉంటే... సమ్సోను అనాలోచితంగా ఒక తప్పు చేశాడు. అతను దెలీలా అనే ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించాడు. తల్లిదండ్రులు వద్దన్నా వినలేదు. ఆమె ద్వారా తమ పథకాన్ని ఫిలిష్తీయ పాలకులు సులువు చేసుకున్నారు. సమ్సోను బలం తాలూకు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వారు దెలీలాను పురిగొల్పారు. అతను నాలుగు సార్లు అబద్ధం ఆడి తప్పించుకున్నాడు. కానీ చివరకు ‘‘నా బలం నా వెంట్రుకల్లో ఉంది’’ అని నిజం చెప్పేశాడు. ఆ తరువాత ఒక రాత్రి వేళ... సమ్సోన్‌ను దెలీలా అతన్ని నిద్రపుచ్చింది. క్షురకుడితో అతని తలను గొరిగించింది. అంతే... అతను శక్తిని కోల్పోయాడు. ఒకప్పుడు సింహంలా ఉండే సమ్సోన్‌ పూర్తిగా బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయులు అతని కళ్ళు పీకేశారు. గానుగ యంత్రాన్ని తిప్పే బానిసగా మార్చారు. కొన్నాళ్ళకు సమ్సోనుకు వెంట్రుకలు మళ్ళీ పెరిగాయి.


ఒకరోజు.. ఫిలిష్తీయులు తమ ఇష్టదైవం గుడిలో పండుగ చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన సమ్సోను గొంతెత్తి ‘‘ప్రభువా! ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకో’’ అని ప్రార్థించాడు. అక్కడున్న రెండు స్తంభాలను కదిలించాడు. గుడి కూలిపోయింది. అతనితోపాటు మూడువేల మంది మరణించారు. ఇదీ సమ్సోను కథ. ఎంతో వీరుడైన, ధర్మపరుడైన అతను... ఒక అమ్మాయి ప్రేమను ఆశించి, ఆమె కుట్ర కారణంగా బలహీనుడై, చివరకు మరణించాడు. అతని కథ... ఒక మహావిజేత విషాద గాథగా నిలిచిపోయింది.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌, 9866755024

ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:34 AM