మార్పు మన నుంచే మొదలవ్వాలి
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:33 AM
ప్రపంచం నేడు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, హింస, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ కాలుష్యం, స్వార్థం, అధికార దాహం...
సహజయోగ
ప్రపంచం నేడు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, హింస, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ కాలుష్యం, స్వార్థం, అధికార దాహం, పెరుగుతున్న అశాంతి... ఇలా ఎన్నో సవాళ్ళ మధ్య ఈ తరం మనుగడ సాగిస్తోంది. మనిషికి అపారమైన సౌకర్యాలను విజ్ఞాన శాస్త్రం సమకూరుస్తున్నప్పటికీ... అంతరంగ శాంతిని, సమతుల్యతను, పరస్పర ప్రేమను అందించలేకపోతోంది. బాహ్యప్రపంచాన్ని జయించేందుకు చేస్తున్న ప్రయత్నాల మధ్య... తన ఆంతరంగిక ప్రపంచాన్ని మనిషి తెలుసుకోవలసిన అవసరం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘‘ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది సహజయోగం మాత్రమే. ఇదొక మహత్తరమైన ఉద్యమం. ఆ ఉద్యమం మహా విస్ఫోటనంలా ప్రభావం చూపించవలసిన అవసరం ఉంది’’ అని 2001లో శ్రీమాతాజీ నిర్మలాదేవి చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను గుర్తు చేసుకోవడం అవసరం.
అంతర్గత విప్లవం
ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనిషి మారాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే వ్యక్తి హృదయంలో శాంతి ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, సహనం, క్షమాగుణం మనలో వికసించాలి. మానవ సమాజంలో సంపూర్ణ పరివర్తన కేవలం చట్టాలు, నిబంధనలు, రాజకీయ వ్యవస్థలు లేదా ఆర్థికాభివృద్ధి ద్వారా సాధ్యం కాదు. మనిషి అంతరంగంలో మార్పు వస్తేనే బాహ్య ప్రపంచంలో శాశ్వతమైన మార్పు సాధ్యం. శ్రీమాతాజీ బోధించిన సహజయోగం ఈ అంతర్గత పరివర్తనకు మార్గం చూపుతుంది. మనిషిలో జన్మతః నిక్షిప్తమై ఉన్న కుండలినీ శక్తి జాగృతమై, ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు... అతనిలో నూతన చైతన్యం ఆవిర్భవిస్తుంది. తనలోని ఆత్మను అనుభూతి చెందుతాడు. ఆ అనుభూతి ఒక ఆధ్యాత్మిక భావనగా మాత్రమే మిగిలిపోకుండా... అతని ఆలోచనల్లో, ప్రవర్తనలో, జీవన విధానంలో పరివర్తన తీసుకువస్తుంది. అది అంతర్గతంగా సంభవించే విప్లవం.
అదే నిజమైన పరివర్తన
సాధారణంగా విప్లవం అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో సంభవించే మార్పులు గుర్తుకువస్తాయి. కానీ శ్రీమాతాజీ ఆకాంక్షించిన విప్లవం ఎంతో ఉన్నతమైనది. అది మనిషి చైతన్యంలో సంభవించే విప్లవం. ద్వేషం స్థానంలో ప్రేమ, అహంకారం స్థానంలో వినయం, అసూయ స్థానంలో పరస్పర గౌరవం, స్వార్థం స్థానంలో పరోపకార చింతన ఏర్పడడమే నిజమైన పరివర్తన. సహజయోగ ధ్యానం ద్వారా మనిషి తన ఆలోచనల కల్లోలాన్ని అధిగమించి... నిర్విచార స్థితిని అనుభవించగలుగుతాడు. ఆ స్థితిలో మనసు ప్రశాంతమవుతుంది. అంతరాత్మతో అనుసంధానమవుతాడు. క్రమంగా వ్యక్తిలోని ప్రతికూల భావనలు తగ్గుతాయి. వివేకం, విచక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సహజయోగం ప్రత్యేకత ఏమిటంటే... అది కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వినడమో, చదవడమో కాదు. స్వీయ అనుభూతి ద్వారా తెలుసుకొనే మార్గం. ‘‘ఆత్మసాక్షాత్కారం ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన హక్కు’’ అని శ్రీమాతాజీ చెప్పారు. వ్యక్తిలో కలిగిన ఆత్మ జాగృతి కుటుంబాన్ని, కుటుంబంలో ఏర్పడిన ప్రేమ, సామరస్యం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి సమాజాలు విశ్వవ్యాప్తంగా పెరిగితే మానవాళిలో సమష్టి చైతన్యం వికసిస్తుంది. తద్వారా ప్రపంచశాంతి నెలకొంటుంది. ప్రతి హృదయంలో ఆత్మజ్యోతి వెలిగినప్పుడే విశ్వమానవ శాంతి, ప్రేమ, ఐక్యతలతో కూడిన నూతన ప్రపంచం ఆవిర్భవిస్తుంది.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్’,
తెలంగాణ
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన