రుద్రం... వైజ్ఞానిక యోగం
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:29 AM
రుద్రం... ఇది కృష్ణ యజుర్వేదంలో భాగమైన, పరమ శివుణ్ణి ఆరాధించే అత్యంత శక్తిమంతమైన పురాతన వేద స్తోత్రం. ఇది ‘నమకం’, ‘చమకం’ అనే రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది....
సహజయోగ
రుద్రం... ఇది కృష్ణ యజుర్వేదంలో భాగమైన, పరమ శివుణ్ణి ఆరాధించే అత్యంత శక్తిమంతమైన పురాతన వేద స్తోత్రం. ఇది ‘నమకం’, ‘చమకం’ అనే రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది. బాహ్య దృష్టికి రుద్రం శివుడి వివిధ రూపాలను కొనియాడే ప్రార్థనగా కనిపించినా... యోగ శాస్త్ర దృష్టితో చూసినప్పుడు ఇది మానవ శరీరంలోని సూక్ష్మనాడీ వ్యవస్థ గురించి వివరించే రహస్యాల నిధి. మనిషి వెన్నెముకకు దిగువ భాగాన... త్రికోణాకారపు ఎముకలో క్షిప్తమైన ఉన్న కుండలినీ శక్తి, ఏడు చక్రాలు, మూడు ప్రధాన నాడులకు రుద్రంలోని మంత్రాలతో ఉన్న అనుబంధం ఉంది.
శుద్ధతత్త్వాలు
సృష్టిలో కనిపించే 36 తత్త్వాల్లో శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధ విద్య అనే అయిదింటిని శుద్ధ తత్త్వాలుగా పేర్కొన్నారు. మనలోని ఆత్మ సదాశివుని అంశ. కుండలిని ఆదిశక్తి అంశ. ఆదిశక్తి అనుగ్రహంతో కుండలిని జాగృతి చెంది... సుషుమ్న నాడిలో ఊర్థ్వ ముఖ చలనంతో గుణాతీతమైన బ్రహ్మతత్త్వాన్ని చేరడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సనాతన ధర్మం ప్రకారం మనిషి కేవలం రక్తమాంసాల ముద్ద కాదు. వెన్నెముక ఆధారంగా 72 వేల నాడులు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఇడ (చంద్ర) నాడి, పింగళ (సూర్య) నాడి, సుషుమ్న (మధ్య) నాడి ప్రధానమైనవి. రుద్రాధ్యాయ పారాయణం వల్ల ఏర్పడే చైతన్య తరంగాలు ఈ నాడులలోని అడ్డంకులను తొలగించి, వెన్నెముక చివర నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని మేలుకొలుపుతాయి. రుద్రాధ్యయనం పరిపూర్ణమైన వైజ్ఞానిక యోగ ప్రక్రియ. నిత్యం రుద్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల నాడులు శుద్ధి అవుతాయి. చక్రాలు జాగృతం అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి... ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. రుద్రం అనేది మనలో ఉన్న శివతత్త్వాన్ని మేలుకొలిపే ఒక అద్భుతమైన సాధనం. సూర్యనాడి, చంద్రనాడి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సుషుమ్నానాడి మధ్యస్థమైన మార్గం. దాన్నే ‘సోపాన మార్గం’, ‘విష్ణు మార్గం’ అంటారు. ఈ మార్గం ద్వారానే మనం శివతత్త్వం సంతరించుకుంటాం. శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన సహజయోగ ధ్యానాన్ని నిత్యం చేసుకుంటూ... కుండలినీ ఉత్థానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడంతో పాటు రుద్రం చదివితే శివతత్త్వమైన కరుణ, ప్రేమ, క్షమాగుణం లాంటివన్నీ మనలో స్థిరపడతాయి.
పండ్రగి వేణుగోపాల్
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు