Share News

విజయానికి నిర్వచనం

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:27 AM

ఒక వ్యక్తి బాహ్య ప్రపంచాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాడనే విషయం ద్వారా సమకాలీన ప్రపంచంలో విజయాన్ని నిర్వచిస్తూ ఉంటారు. వైద్యుడు, ఇంజనీర్‌, అంతరిక్ష శాస్త్రవేత్త, రాజకీయ వేత్త, బ్యూరోక్రాట్‌...

విజయానికి నిర్వచనం

యోగా

ఒక వ్యక్తి బాహ్య ప్రపంచాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాడనే విషయం ద్వారా సమకాలీన ప్రపంచంలో విజయాన్ని నిర్వచిస్తూ ఉంటారు. వైద్యుడు, ఇంజనీర్‌, అంతరిక్ష శాస్త్రవేత్త, రాజకీయ వేత్త, బ్యూరోక్రాట్‌... ఇలా ఎవరైనా వారు ఎంచుకున్న రంగంలో పొందిన పేరు, ప్రఖ్యాతి, ఆ రంగాన్ని ఎంతమేరకు ప్రభావితం చేశారనే దాన్ని విజయంగా భావిస్తారు. వర్తమాన కాలంలో విద్యావిధానం ప్రాథమికంగా... బాహ్యమైన ఈ విజయాన్ని సాధించడానికి, దాన్ని పునరావృతం చేయడానికి వీలుగా రూపుదిద్దుకుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం ఉన్న వ్యక్తులను తయారు చేస్తుంది. అయితే... నిజమైన విజయానికి బాహ్య ప్రపంచం మీద పట్టు ఉండడం అనేది ఒక్కటే సరిపోతుందా? అనేదే ప్రశ్న.

సానుకూల లక్షణాలు...

ఒక వైద్యుడి జీవితాన్ని ఈ దృక్పథం నుంచి పరిశీలిద్దాం. వృత్తిపరమైన వృద్ధికి, వైద్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వైద్యశాస్త్రంలో నిరంతరం నిమగ్నమై ఉండడం ఎంతో అవసరం. అయితే వైద్యుడి చర్యలను కేవలం సైన్స్‌ పరిజ్ఞానం మాత్రమే నిర్ధారించలేదు. ఆశయం, భయం, గుర్తింపు, కోరిక, పోటీ, ఆర్థిక ఒత్తిళ్ళతో నిండిన అంతర్గత ప్రపంచం వైద్యుడి నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది. వైద్యపరంగా ఎంత జ్ఞానం ఉన్నా... అంతర్గత శక్తుల్ని పరిశీలించనట్టయితే నిర్ణయాలు దోషరహితంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి వైద్యాన్ని సమర్థవంతంగా అభ్యసించాలంటే సాంకేతిక నైపుణ్యమే కాదు, అంతర్గత నియంత్రణ కూడా అవసరం. ప్రతికూల ధోరణులను అరికట్టడంతో పాటు కరుణ, సహానుభూతి, వినమ్రత, స్పష్టత లాంటి సానుకూలమైన అంతర్గత లక్షణాలతో కూడిన చైతన్యాన్ని పెంచుకోవాలి. ఈ లక్షణాలు ఉన్న వైద్యుడు వ్యాధిని మాత్రమే కాదు, అంతర్గతమైన సమస్యలకు కూడా చికిత్స చేయగలరు.


అంతర్గత అభివృద్ధి

ఇక్కడే అంతర్గత ప్రపంచానికి సహకరించే అభ్యాసాలు... తాత్వికమైన ఆదర్శాలుగా కాకుండా ఆచరణాత్మకమైన అంశాలుగా మారుతాయి. హార్ట్‌ ఫుల్‌నెస్‌ అభ్యాసాలు... ముఖ్యంగా ధ్యానం, రిలాక్సేషన్‌, స్వీయ పరిశీలన లాంటివి మనకు మనం అంతర్గతంగా శిక్షణను ఇచ్చుకొనే సరళమైన, లోతైన మార్గాన్ని అందిస్తాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మానసికమైన గందరగోళాన్ని తొలగించుకోగలం, భావోద్వేపరమైన ప్రతిస్పందనలను మెరుగుపరుచుకోగలం, అంతర్గతమైన సమతుల్యతను అభివృద్ధి చేసుకోవడాన్ని నేర్చుకోగలం. ఇలాంటి పద్ధతులు శాస్త్రీయ శిక్షణకు ప్రత్యామ్నాయాలు కావు. కానీ అవి జ్ఞానాన్ని అన్వయించే సాధనమైన మనస్సును, హృదయాన్ని మెరుగుపరచడం ద్వారా దానికి మరింత దోహదం చేస్తాయి. బాహ్యపరమైన చర్యకు అంతర్గతమైన స్పష్టత మార్గనిర్దేశం చేసినప్పుడు, వృత్తిపరమైన నైపుణ్యం సహజంగానే నైతికంగా, కరుణాత్మకంగా, ఆచరణాత్మకంగా మారుతుంది. మనం సైన్స్‌, టెక్నాలజీలో అసాధారణమైన పురోగతి సాధించినా... హింస, నైతిక క్షీణత, సుదీర్ఘమైన మానవ కష్టాలను చూస్తూనే ఉన్నాం. బాహ్యమైన పురోగతి అంతర్గత పరిణామాన్ని అధిగమించిపోయింది. కాబట్టి విద్య, కేవలం బాహ్య ప్రపంచంలో విజయాన్నే గుడ్డిగా వెంబడించకూడదు. ఆత్మావలోకనం, నైతికమైన సున్నితత్వం, హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానం ద్వారా అందించే ఆలోచనాత్మక అభ్యాసాల ద్వారా ఈ అంతర్గత అభివృద్ధిని పాఠ్యాంశాల్లోకి చేర్చాలి. విద్యార్థులు, నిపుణులు తమ అంతర్గత ప్రపంచాన్ని బాహ్య ప్రపంచం మాదిరిగా అదే గంభీరతతో నిర్వహించగలిగితే, విజయం స్వలాభార్జనగా కాకుండా, ఉత్తేజకరమైనదిగా మారుతుంది.డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

Also Read:

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

Updated Date - Jan 23 , 2026 | 03:27 AM