Share News

ఖాకీ కొలువు యోగా గెలుపు

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:41 AM

కూలి పనుల నుంచి కొలువు దాకా.. కొండల నడక నుంచి జాతీయ వేదికల దాకా ఆమె ప్రయాణం పెద్ద సవాల్‌. ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఖాకీ దుస్తుల్లో యోగాసనాలతో...

ఖాకీ కొలువు యోగా గెలుపు

విజేత

కూలి పనుల నుంచి కొలువు దాకా.. కొండల నడక నుంచి జాతీయ వేదికల దాకా ఆమె ప్రయాణం పెద్ద సవాల్‌. ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఖాకీ దుస్తుల్లో యోగాసనాలతో పతకాలు సాధిస్తున్నారు రావాడ రోహిణి. కష్టాలను నిచ్చెనగా మార్చుకుని శిఖరం చేరిన తన ప్రస్థానం గురించి ఆమె ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘మాది శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని లింగంనాయుడుపేట. అక్కడ మూడో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత అమ్మమ్మ పున్నమ్మను చూసుకోవాల్సి రావడంతో అక్కడికి పంపించారు. మా ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోని సారవకోట మండలం బైదలాపురం అనే గిరిజన గ్రామం అది. అమ్మమ్మను చూసుకుంటూ ఐదో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత హైస్కూలు. మాకు దగ్గరలో అంటే శ్రీముఖలింగం అనే ఊరు వెళ్లాలి. రోజూ రానుపోను 12 కిలోమీటర్లు కొండ మార్గంలో నడిచి వెళ్లేదాన్ని. ఉదయం 7.30కి బయలుదేరితే 9 గంటలకు స్కూలుకు చేరేదాన్ని. సాయంత్రం ఇంటికి చేరేప్పటికి ఆరు గంటలయ్యేది. ఇంట్లో ఉన్నదేదో తీసుకువెళ్లడమే. వర్షం, ఎండ.. ఉదైనా స్కూల్‌ మానడం నాకు తెలియదు. 8వ తరగతిలో అమ్మమ్మ కాలం చేయడంతో మళ్లీ మా ఊరు లింగంనాయుడుపేట వెళ్లిపోయా. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని తిమడాంలో 9, 10 చదువుకున్నా. రోజూ రానుపోను 4 కిలోమీటర్లు నడకే.

కూలి డబ్బులతో బస్సు చార్జీలు

కష్టాలు పడుతూనే పది పాసై ఇంటర్మీడియట్‌ నర్సన్నపేటలోని జూనియర్‌ కళాశాలలో చేరాను. రోజూ ఉదయం 6 గంటలకు బస్సు. అది మిస్సయిందంటే ఆ రోజు స్కూల్‌కి ఆబ్సెంట్‌. రెండో ఏడాది చదవుతుండగా అమ్మ ఆరోగ్యం పాడైంది. నేను, చెల్లి, నాన్న కూలి పనికి వెళితేగానీ ఇల్లు గడిచేది కాదు. అలా కాలేజీ సెలవు రోజున కూలికి వెళుతూ బస్సు చార్జీలకు వాటిని వాడుకుంటూ ఎలాగైతేనేం ఇంటర్‌ పూర్తి చేశాను. కానీ బస్సు చార్జీలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఫీజులు కట్టుకోలేక డిగ్రీపై ఆశలు వదులుకున్నా. బుడితి జంక్షన్‌లోని నేతాజీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో టీచర్‌గా చేరాను. ఓ ఏడాది అలా గడిచింది. తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడంతో నరసన్నపేటలో డిగ్రీలో చేరాను.


కానిస్టేబుల్‌గా ఎంపిక

మా అమ్మ నాగమ్మ, నాన్న సత్యనారాయణ, చెల్లి, నేను కూలి పనులకు వెళ్లేవాళ్లం. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మేం ముగ్గురం కూలికి వెళ్లేవాళ్లం. రోజుకు నాన్నకు రూ.40, నాకు చెల్లికి రూ.20 చొప్పున వచ్చేది. కష్టాల నుంచి బయట పడాలంటే బాగా చదువుకొని ప్రభుత్వోద్యోగం సంపాదించాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. అదే పట్టుదలతో ఇంటర్‌ పూర్తయ్యాక టీచర్‌గా చేస్తూనే సీఆర్పీఎఫ్‌, ఎస్‌ఎ్‌ససీ, పోస్టల్‌, ఆర్‌ఆర్‌బీ ఇలా చాలా రాశాను. కూలి డబ్బులు ఇంట్లో ఇస్తే ఉద్యోగ దరఖాస్తు ఫీజుకు అవసరమైనపుడు అమ్మానాన్న ఇచ్చేవారు. అలా 2012లో మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాశా. దానిలో ఎంపికై 2014లో డిగ్రీ పూర్తి చేసిన వెంటనే శిక్షణకు వెళ్లిపోయా. అదే ఏడాది ఉద్యోగంలో చేరాను.

00-Navya.jpg

అనుకోకుండా యోగాలోకి

రాజమండ్రి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పోస్టింగ్‌. అప్పట్లో ప్రతి శుక్రవారం పోలీసులకు రన్నింగ్‌ పోటీలుండేవి. నాకు స్కూల్‌ నుంచే లాంగ్‌ రన్నింగ్‌ అలవాటు. దాంతో పురుషుల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేదాన్ని. అలా 2016లో ఒక రోజున అఖిలభారత పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఉందని మెసేజ్‌ వచ్చింది. నేను రన్నింగ్‌ బాగా చేస్తానని అప్పటి స్టేషన్‌ రైటర్‌ శ్రీనివాసరావు, డీఎస్పీ భరత్‌మాతాజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మమ్మల్ని మోటివేట్‌ చేశారు. ఓ తండ్రిలా మంచీచెడులు చెప్పేవారు. అలా ఆ పోటీల్లో పాల్గొన్నాను. అయితే అక్కడ రన్నింగ్‌ ఉండదని చెప్పారు. యోగాలో పాల్గొనాలని సూచించారు. ఆంధ్రా యూనివర్సిటీ యోగా విలేజ్‌లో 45 రోజుల శిక్షణ. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ సాగేది. సాత్వికాహారం, తిన్న తర్వాత రెస్ట్‌. అయితే మొదటి మూడు రోజుల తర్వాత తీవ్రమైన ఒళ్లు నొప్పులు. నన్ను పంపేయండి వెళ్లిపోతానని చెప్పా. అప్పటి మా ఇన్‌చార్జి సీఐ కళ్యాణి నాకు నచ్చజెప్పారు. అన్నీ తట్టుకొని శిక్షణ పూర్తి చేశా. మొదటిసారి యోగా పోటీల్లో మూడో స్థానం దక్కింది. తర్వాత పెళ్లి, పిల్లలు. ఆపై కరోనా సంక్షోభం. ఇలా 2017 నుంచి 2021 వరకూ పోటీల్లో పాల్గొనలేదు.


00-Navya.jpg

యోగాలో పీజీ చేయాలని..

నా భర్త నిడదవోలులో ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నేను జిల్లా కంట్రోల్‌ రూమ్‌లో పనిచేస్తున్నాను. మాకు ఏడేళ్ల లోహిత్‌, ఆరేళ్ల లాక్షిత ఉన్నారు. మాకు ఉద్యోగ బాధ్యతల వల్ల వాళ్లతో గడిపే సమయం తక్కువ. నేను యోగా పోటీలకు వెళితే మరీ ఇబ్బందిగా ఉంటోంది. పిల్లలను అత్త అప్పన్నమ్మ, తోడికోడలు చిన్నమ్మ చూసేవాళ్లు. ఇప్పుడు పక్కింటి వాళ్ల వద్ద ఉంచుతూ సమయం సర్దుబాటు చేసుకుంటున్నాం. యోగాలో పీజీ చేయాలని నా కోరిక. ఆ పోటీల్లో నేను మరింత రాణించాలి. నా శాఖకు కూడా మరింత పేరు సాధించాలనేది నా లక్ష్యం. ఆ సాధనకు నాకు సహకారం కూడా ఎంతో అవసరం. ఎవరూ కష్టాలు, కన్నీళ్లని ఆవేదనతో ఆగిపోవద్దు. ముఖ్యంగా మహిళలు విధిని ఎదిరించైనా అవకాశాలను విజయంగా మలుచుకోవాలి. మనకు, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి.. దేశానికి పేరు తెచ్చుకోవాలి.

రమేష్‌ నాగేంద్ర పలసల, రాజమండ్రి

పతకాల పంట

2022లో పంజాబ్‌లోని జలంధర్‌లో, 2023 మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నాలుగో స్థానంలో నిలిచా. దాంతో మరింత పట్టుదలతో ప్రాక్టీస్‌ చేశా. ఓవైపు ఉద్యోగ విధులు, చంటి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత. నా భర్త కూడా పోలీస్‌ ఉద్యోగమే. అవకాశం ఉన్నప్పుడు యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ మెరుగయ్యాను. నా భర్త ధనుంజయ పోలీస్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కావడంతో ఆయన కూడా కొన్ని మెళకువలు నేర్పుతుంటారు. అలా 2024లో ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన పోటీల్లో మూడో స్థానం దక్కింది. 2025లో అమరావతిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించాను.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 05:41 AM