Share News

సప్తర్షులతో కొలువైన శివపార్వతులు

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:27 AM

తొలినాటి దక్షిణ భారత శిల్ప శైలి, ఆగ్నేయాసియా లోహ శిల్పాల అద్భుతమైన సమ్మేళనంగా నిలుస్తున్న అరుదైన శివలింగాన్ని పురాతన దేవాలయాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధిస్తున్న లిడియా లక్ష్మి...

సప్తర్షులతో కొలువైన శివపార్వతులు

అన్వేషణ

తొలినాటి దక్షిణ భారత శిల్ప శైలి, ఆగ్నేయాసియా లోహ శిల్పాల అద్భుతమైన సమ్మేళనంగా నిలుస్తున్న అరుదైన శివలింగాన్ని పురాతన దేవాలయాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధిస్తున్న లిడియా లక్ష్మి వెలుగులోకి తెచ్చారు. ఆంగ్‌కోర్‌ వాట్‌ కన్నా పూర్వకాలం నాటి ఈ లింగం సులభంగా తరలించగలిగే, అరుదైన ఈ సూక్ష్మ శిల్పం. దాని విశిష్టత గురించి లిడియా లక్ష్మి మాటల్లోనే...

‘‘భారతదేశానికి బయట కనిపించే అరుదైన హిందూ శిల్పాలలో... కంబోడియాలోని ఆంగ్‌కోర్‌ కాలానికి చెందినవి లేదా దక్షిణ భారత శిల్ప శైలికి చెందిన కంచు, రాతి శిల్పాలు అనేకం ఉన్నాయి. అయితే కచ్చితమైన శిల్ప కళా నైపుణ్యం, పరిమాణంతో కూడిన ఏకీకృత సూక్ష్మ శిల్పం ఈశాన్య థాయిలాండ్‌ ప్రాంతంలోని మహా సరఖమ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇది మ్యూజియంలో భద్రపరచదగిన అపురూపమైన చారిత్రక అవశేషం. తెలుగు ప్రాంతాలతో దీనికి గట్టి సంబంధం ఉంది. ఎందుకంటే... ఈ శిల్పంలోని ప్రస్ఫుటమైన ముఖ లక్షణాలు, దట్టమైన కనుబొమల రేఖలు, లోతైన దీర్ఘచతురస్రాకారపు ఫ్రేమ్‌లు... తదుపరి కాలానికి చెందిన తమిళ చోళుల కాలం నాటి నాజూగ్గా, సన్నగా కనిపించే రేఖా శైలికి భిన్నంగా ఉన్నాయి. విష్ణు కుండినులు, రేనాటి చోళులలాంటి తొలి తెలుగు-దక్కన్‌ రాజ్యాల నాటి శక్తిమంతమైన, ప్రాచీనమైన శైలులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.

సముద్రాలు దాటి...

సామాన్యశకం 4-8 శతాబ్దాల మధ్యకాలంలో... వర్తకులు, నిపుణులైన లోహ శిల్పులు, సంచారులైన శైవ సన్యాసులు ఆంధ్ర తీరంతో సహా దక్షిణ భారత ఓడ రేవుల నుంచి బంగాళాఖాతం మీదుగా ఆనాటి ఆగ్నేయాసియాలోకి (ఫునాన్‌, పూర్వపు చెన్లా/ఖ్మేర్‌ భూభాగాలలోకి) నిరంతరం ప్రయాణించారు. దక్షిణ భారతీయ తాత్వికతతో, కళానైపుణ్యంతో తీర్చిదిద్దిన అర్చనా శిల్పాల నమూనాలను తమతో పాటు తీసుకువెళ్ళారు. ఒక విధంగా వీటిని సంచార పుణ్య క్షేత్రాలు అని చెప్పవచ్చు. అంటే... వారు తాము వెళ్ళిన ప్రతిచోటా పవిత్ర పూజా ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవడం కోసం సులువుగా తీసుకువెళ్ళగలిగే లోహం లేదా రాతి లింగాలను తమ వెంట తీసుకువెళ్ళారు. శిల్పాల పైభాగంలోని స్థూపాకార నిర్మాణం మీద పవిత్ర జలాలతో, పాలు లేదా నెయ్యితో రోజూ వారు అభిషేకాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. అంటే ఈ కళాఖండం... ఆధ్యాత్మికత సముద్రాలను దాటి స్వేచ్ఛగా ప్రవహించిన ఒక యుగానికి భౌతికమైన నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు... సప్త ఋషులు, శివుడు, పార్వతి నంది మీద కూర్చున్నట్టు దర్శనమిచ్చే అరుదైన శిల్పం ఇది. అభిషేక ద్రవ్యాలు శివుడు, పార్వతి, సప్త ఋషుల శిల్పాల మీదుగా కిందికి ప్రవహించి, పీఠభాగం చేరి, నాళం ద్వారా బయటకు ప్రవహిస్తాయి.


విశ్వక్షేత్రాలకు ప్రతీక

ఈ శిల్పం కేంద్రంలోని లింగం సదాశివుణ్ణి (వ్యక్త చైతన్యాన్ని) సూచిస్తుంది. పై ఫలకం చైతన్యం (పురుషుడు), విశ్వ శక్తి (ప్రకృతి) మధ్య విడదీయలేని కలయికకు ప్రతీకగా... శివ పార్వతులు దివ్య వాహనమైన వృషభం మీద కూర్చొని ఉండడాన్ని చిత్రిస్తుంది. కింది భాగంలో... ముడివేసి ఉన్న జటాముకుటాలతో, గడ్డాలతో, గాఢమైన ధ్యానభంగిమల్లో కూర్చొని ఉన్న ఋషులు ఉన్నారు. వారు ఆది యోగి అయిన శివుడి నుంచి యోగ శాస్త్రాన్ని స్వీకరించి, పరిరక్షించిన సప్త ఋషులు. ఇక... విగ్రహంపై స్పష్టంగా కనిపించేలా చెక్కిన నిలువు, అడ్డ విభజన రేఖలు పవిత్రమైన బ్రహ్మసూత్రాన్ని సూచిస్తాయి. అవి నిర్మాణపరంగా శిల్పాన్ని సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్ణు), లయం లేదా విముక్తి (రుద్ర) అనే మూడు విశ్వక్షేత్రాలుగా విభజిస్తాయి. మ్యూజియంలలో నైరూప్య స్థూపాకార లింగాలు, ప్రాథమిక ఏకముఖ లింగాలు ఎన్నో ఉన్నాయి. కానీ నందిపై శివపార్వతులు, సప్తఋషుల క్రమం, కచ్చితమైన రీతిలో ఏకీకృతం చేసిన బ్రహ్మసూత్ర శైలి కలిగినది, సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగేది అయిన లింగం ఎంతో అపూరూపమైనది.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..

Updated Date - Oct 02 , 2026 | 04:27 AM