వరాల వసంతం రంజాన్
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:19 AM
అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అల్లాహ్ మానవాళికి ప్రసాదించిన పవిత్రమైన మాసం రంజాన్. సహనం, దాతృత్వాలను పెంపొందించి, ధనికులు, పేదలు అనే అసమానతలను తొలగించి, సర్వ...
సందేశం
అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అల్లాహ్ మానవాళికి ప్రసాదించిన పవిత్రమైన మాసం రంజాన్. సహనం, దాతృత్వాలను పెంపొందించి, ధనికులు, పేదలు అనే అసమానతలను తొలగించి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, పరస్పర ప్రేమాభిమానాలను పెంచే దివ్యమైన మాసం. రజబ్, షాబాన్ మాసాలలోని నెలవంకను చూసి ‘‘ఓ అల్లాహ్! మమ్మల్ని రంజాన్ మాసం వరకూ చేర్చు’’ అని దైవప్రవక్త మహమ్మద్ ప్రార్థించేవారు. ఆ వరాల వసంతానికి స్వాగతం పలకడానికి ముందునెల అయిన షాబాన్ నుంచి అందరూ సిద్ధం కావాలని ఉపదేశించారు. ‘‘శుభప్రదమైన నెల రాబోతోంది. ఉపవాసాలను (రోజాలను) మీకు విధిగా అల్లాహ్ నిర్దేశించారు. రంజాన్ మాసంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారాలు మూసుకుంటాయి. సైతానులు సంకెళ్ళతో బంధితులవుతారు. వేయి నెలలకన్నా శ్రేష్టమైన రాత్రి ఒకటి ఈ మాసంలోనే ఉంది. విశ్వాసంతో ఉత్సాహంగా రంజాన్‌కు స్వాగతం చెప్పేవారు ఎంతో అదృష్టవంతులు. ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని చేస్తే... 70 మాసాల ఫలితం లభిస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఈ మాసంలో అల్లాహ్ ప్రీతికోసం ముఖ్యంగా అయిదు పనులు చేయాలని ఇస్లాం ధర్మం నిర్దేశించింది. మొదటిది ‘దేవుడొక్కడే. ఆయన ప్రవక్త మహమ్మద్’ అని విశ్వసించడం, రెండోది దైవాన్ని క్షమాపణ కోరడం, మూడోది అల్లా్‌హను ప్రార్థించి, స్వర్గ ప్రవేశాన్ని కోరడం, నాలుగోది నరకదండన నుంచి కాపాడాలని దేవుణ్ణి వేడుకోవడం, అయిదోది దివ్య ఖుర్‌ఆన్‌ను వీలయినన్ని ఎక్కువసార్లు చదవడం. రంజాన్ మాసంలో కూడా రేయింబవళ్ళు ఇతర మాసాల మాదిరిగానే ఉంటాయి. కానీ అల్లాహ్ దృష్టిలో, దైవప్రవక్త దృష్టిలో ఈ నెలకు, ఇతర నెలలకు ఎంతో తేడా ఉంది. ఈ మాసం సమీపించే కొద్దీ రంజాన్ శుభాల గురించి దైవప్రవక్త ఎక్కువగా బోధించేవారు. దివ్య ఖుర్‌ఆన్‌లో రంజాన్ మాసం ప్రాధాన్యత గురించి అల్లాహ్ ఇలా తెలిపారు: ‘‘ఇది పవిత్ర ఖుర్‌ఆన్ అవతరించిన మాసం. ఆ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. మంచి మార్గం చూపించి, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కాబట్టి రంజాన్ నెలను ఎవరు చూస్తారో... వారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి’’.
కొన్ని దినాల్లో రాబోతున్న రంజాన్ మాసాన్ని స్వాగతించడానికి విశ్వాసులు సిద్ధం కావాలి. దివ్య ఖుర్‌ఆన్‌ను రోజూ పారాయణం చెయ్యాలి. రాత్రి వేళల్లో రతావీహ్ నమాజ్, జకాత్, ఫిత్రా దానాలు, తాఖ్ రాత్రిళ్ళు (బేసి రాత్రులు) ఏతేకాఫ్ తదితర ఆధ్యాత్మికమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు